Friday, May 3, 2024

కబ్జా కోరల్లో శ్రీ మహాదేవ్ ఆలయ భూమి

తప్పక చదవండి
  • అక్రమంగా రిజిస్ట్రేషన్స్‌ చేసుకున్నగోయెంకా ,రేసు మల్లారెడ్డి, రేసు ఇంద్రసేనారెడ్డి
  • డాక్యుమెంట్స్‌ రద్దైన ధరణిలో పేర్లు..
  • ఎండోమెంట్‌ అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌
  • అక్రమార్కులకు రెవెన్యూ అధికారుల వత్తాసు!
  • కుమ్మెర శ్రీ మహాదేవ్‌ స్వామి ఆలయ.. భూములపై అధికారుల శీతకన్ను
  • అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం..
  • దర్జాగా కబ్జా చేసి ఎంజాయ్‌ చేస్తున్న అక్రమార్కులు
  • అక్రమార్కుల పై చీటింగ్‌ కేసు పెట్టి, ధరణి రికార్డ్స్‌..
  • కరెక్షన్‌ చేస్తే మళ్లీ భూములు ఆలయ పరమయ్యే ఛాన్స్‌..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కుమ్మెర గ్రామంలోని శ్రీ మహాదేవ్‌ స్వామి ఆలయ భూముల పరిరక్షణ విషయంలో కంచె చేను మేసినట్లుంది పరిస్థితి. దేవాలయానికి సంబంధించిన ల్యాండ్స్‌ ను రక్షించాల్సిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ వాటిపై శీతకన్ను ప్రదర్శిస్తున్నారు. వెరసి ఆ భూముల్లో తప్పుడు పద్ధతుల్లో రికార్డులకు వచ్చిన వారు యధేచ్చగా కబ్జాలో ఉంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కుమ్మెర గ్రామ శివారు పరిధిలో శ్రీ మహాదేవ్‌ స్వామి వారి దేవాలయం ఉంది. ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిది. అయితే ఆలయాన్ని పరిరక్షించుకునేందుకు,దీప,దూప, నైవేద్యాల కోసం కుమ్మెర గ్రామస్థులు సుమారు 8.17 ఎకరాల భూమిని టెంపుల్‌ కు గతంలో దానంగా ఇవ్వడం జరిగింది. ఈ ల్యాండ్‌ కుమ్మెర శివారులోని సర్వే నెంబర్‌ 195లో 5.05 ఎకరాలు,196లో 3.12 ఎకరాలుగా ఉంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్న హైదరాబాద్‌ చుట్టు పక్కల భూములకున్న వాల్యూను బట్టి శ్రీ మహాదేవ్‌ స్వామి వారి ల్యాండ్స్‌ క్రమంగా పరాధీనం అవుతూ వచ్చాయి.1955 నుండి1958 సంవత్సరం వరకు దేవల్‌ ఈశ్వర్‌,పూజారి మల్లయ్య జంగం పేరు పై కలదు. తదనంతరం 1962 నుండి 1972 సంవత్సరం వరకు దేవల్‌ ఈశ్వర్‌, వీర మల్లయ్య జంగం పేరు పహానిలో రికార్డులలో కలదు.1986,1987 సంవత్సరం వచ్చేసరికి ఏకంగా దేవల్‌ ఈశ్వర్‌..ఆ తర్వాత దేవల్‌ ఈశ్వర్‌ వీరమల్లు పేరుతో ఉన్న భూములు కాస్తా రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించబడి ఇతరులు పహానీలకు వచ్చేశారు. ఆ తర్వాత ఈ ల్యాండ్స్‌ ను అధికారుల సహాయంతో కొందరు ప్రబుద్ధులు రిజిస్ట్రేషన్స్‌ కూడా చేసేకున్నారు. అనంతరం దేవాలయ భూములను కబ్జా పెట్టి ప్రస్తుతం యధేచ్చగా కబ్జాను ఎంజాయి చేస్తున్నారు. చుట్టూ ప్రహారీ గోడను నిర్మించుకొని ప్రభుత్వం ఇచ్చే రైతు బంధును కూడా పొందుతుండడం గమనార్హం. అయితే ఇదే విషయాన్ని కొందరు గ్రామస్థులు,స్థానికులు ఈ వ్యవహారాన్ని ఎండోమెంట్‌ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో..2021లో అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయబడ్డ అన్నీ డాక్యుమెంట్స్‌ ఎండోమెంట్‌ శాఖ అధికారులు క్యాన్సిల్‌ చేయించడం జరిగింది.


ధరణిలో పేర్లు మార్చని రెవెన్యూ యంత్రాంగం
ఇక ఆలయ భూములకు సంబంధించిన తప్పుడు రిజిస్ట్రేషన్స్‌ అన్ని రద్దు కాగా..రెవెన్యూ రికార్డుల్లో మాత్రం తిరిగి దేవాలయ ల్యాండ్స్‌ గా నమోదు చేయకపోవడం గమనార్హం. ఇదే విషయంపై అనేకసార్లు ఎండో మెంట్‌ అధికారులు,స్థానికులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌,అడిషనల్‌ కలెక్టర్‌,చేవెళ్ల ఆర్డీవో, తహశీల్దార్లకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్లు విలువైన ఆలయ భూములను కాపాడాల్సిన కలెక్టర్‌,ఇతర రెవెన్యూ అధికారులు టెంపుల్‌ ల్యాండ్స్‌ విషయంలో నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తుండడం శోచనీయం. వెరసి ఈ భూముల్లో ప్రస్తుతం సంగీత గోయెంకా సర్వే నెంబర్‌ 195,196లలో 8.05 ఎకరాలకు అక్రమంగా కబ్జాలో ఉండగా..రేసు మల్లారెడ్డి, రేసు ఇంద్రసేనా రెడ్డి 0.12 గుంటలకు కబ్జాలో ఉండడం గమనార్హం.
చీటింగ్‌ కేసు పెట్టి.. భూమిని స్వాధీనం చేసుకోవాలని
స్థానికుల డిమాండ్‌
మరోవైపు ఆలయ భూముల అక్రమ రిజిస్ట్రేషన్స్‌ ను ఇప్పటికే ఎండో మెంట్‌ శాఖ వారు రద్దు చేయించినందున..రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కూడా వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్స్‌ రద్దు అయినందున వెంటనే అక్రమ పద్ధతుల్లో ధరణిలో కొనసాగుతున్న వారి పేర్లను తొలగించి మళ్లీ దేవుని మాన్యాలుగా రికార్డులకు నమోదు చేయాలని కోరుతున్నారు. అలాగే ఈ భూముల్లో అక్రమ కబ్జాలో ఉంటూ..తప్పుడు రిజిస్ట్రేషన్స్‌ కు పాల్పడిన వారిపై ఎండోమెంట్‌ అధికారులు చట్ట ప్రకారం చీటింగ్‌ కేసును నమోదు చేయించాలని స్థానికు డిమాండ్‌ చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు