Saturday, December 2, 2023

నేడు రెండో విడత

తప్పక చదవండి
  • ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్‌
  • 70 స్థానాలకు జరగనున్న ఎన్నికలు
  • 7న 20నియోజకవర్గాల్లో తొలివిడత

పశ్చిమరాయ్‌పుర్‌ : నక్సల్స్‌ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో రెండో విడతలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, సీఎం భూపేశ్‌ బఘేల్‌ ప్రచారం చేయగా.. బీజేపీ తరపున ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులు, అసోం సీఎం హిమంత బిస్వాశర్మ ప్రచారం చేశారు. ఇరుపార్టీల నేతలు తమదే గెలుపన్న ధీమాతో ఉన్నారు. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య గట్టి పోటీ నెలకొన్నఛత్తీస్‌గఢ్‌ లో రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈనెల 7న 20స్థానాలకు తొలి విడత ఓటింగ్‌ జరగ్గా.. శుక్రవారం మిగతా 70స్థానాలకు రెండో విడత పోలింగ్‌ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90శాసనసభ స్థానాలు ఉండగా.. ఈనెల 7న 20నియోజకవర్గాల్లో తొలివిడత పోలింగ్‌ జరిగింది. 22 జిల్లాల పరిధిలో ఉన్న మిగతా 70స్థానాలకు శుక్రవారం ఓటింగ్‌ జరగనుంది. రెండో విడతలో 958మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందులో 827మంది పురుషులు కాగా, 130మంది మహిళలు, ఒక ట్రాన్స్‌ జెండర్‌ ఉన్నారు. మొత్తం 1,63,14,479 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 81,41,624 మంది పురుషులు, 81,72,172 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 684 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. రెండో విడత పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం 18,833 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేసింది. 700 పోలింగ్‌ కేంద్రాల్లో మొత్తం మహిళా ఉద్యోగులే విధులు నిర్వహించనున్నారు. పశ్చిమ రాయ్‌పుర్‌ స్థానంలో అత్యధికంగా 26మంది పోటీలో ఉండగా.. దౌండిలోహార స్థానంలో అత్యల్పంగా నలుగురు బరిలో ఉన్నారు. రెండో విడత పోలింగ్‌ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది. అయితే నక్సల్స్‌ ప్రభావిత రాజిమ్‌ జిల్లాలోని బింద్రనవాగఢ్‌ స్థానంలోని 9పోలింగ్‌ బూత్‌ల్లో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది. రెండోసారి అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్నహస్తం పార్టీ అగ్రనేతలు.. ఛత్తీస్‌గఢ్‌లో విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, సీఎం భూపేశ్‌ బఘేల్‌ ప్రచారాన్ని హోరెత్తించారు. కమలం పార్టీ నేతలు చేసిన అవినీతి ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టారు. తమ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే.. బీజేపీ సారథ్యంలోని మోడీ సర్కార్‌ దేశ వనరులను దోచిపెడుతోందని ఆరోపించారు. రైతులు, మహిళలు, గిరిజనులు, దళితుల కోసం బఘేల్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను హస్తం నేతలు ప్రధానంగా ప్రచారం చేశారు. 2018లో మాదిరిగానే ఈసారి కూడా రైతుల రుణాలు మాఫీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు. కులగణన హామీ ద్వారా ఓబీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, అసోం సీఎం హిమంతబిశ్వ శర్మ ప్రచారం నిర్వహించారు. బఘేల్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ సర్కార్‌ అవినీతి, మహాదేవ్‌ యాప్‌ కుంభకోణం, ఉద్యోగ నియామక కుంభకోణం, నక్సల్స్‌ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. కాంగ్రెస్‌ మత మార్పిడి, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శలు గుప్పించారు. తొలివిడత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం తప్పదన్న కమలనాథులు, రెండో విడతలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. 2018 ఎన్నికల్లో 68 స్థానాలు కైవసం చేసుకొని కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టింది. బీజేపీ కేవలం 15 సీట్లతో సరిపెట్టుకుంది. ఇప్పుడు రెండో విడత పోలింగ్‌ జరుగుతున్న 70 స్థానాల్లో క్రితం సారి కాంగ్రెస్‌ 50చోట్ల గెలుపొందగా, బీజేపీ 13 సీట్లలో విజయం సాధించింది. జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ నాలుగు, బీఎస్‌పీ రెండు స్థానాల్లో గెలుపొందాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు