Tuesday, May 21, 2024

మీకు నచ్చింది చేసుకోండి ..?

తప్పక చదవండి
  • తెలంగాణ అప్పు రూ.3.17 లక్షల కోట్లే..
  • మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఫైర్‌
  • తప్పు చేస్తే కదా మేము భయపడుతాం..
  • ఏ విచారణకైనా మేము మా నాయకులు సిద్ధం..
  • తప్పు జరిగితే నిరభ్యంతరంగా చర్యలు తీసుకోవచ్చు
  • మాపై కోపంతో రాష్ట్రాన్ని దయచేసి ఆగం చేయకండి
  • తొమ్మిదిన్నరేండ్ల పాలనపై ‘స్వేదపత్రం’ విడుదల
  • బీఆర్‌ఎస్‌ పాలన దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయం
  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ తన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ప్రగతి ప్రస్థానాన్ని ‘స్వేదపత్రం’ పేరుతో ఆదివారం విడుదల చేసింది. తెలంగాణ భవన్‌ లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ స్వేదపత్రం విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పాలనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విధ్వంసం నుంచి వికాసం వరకు మా ప్రయాణం కొనసాగిందని చెప్పుకొచ్చారు. దేశ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా వర్ణించారు. గత పాలకులు ఉద్దేశ పూర్వకంగానే జీవన విధ్వంసం చేశారని, బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అన్నట్లుగా బతుకులు ఉండేవని కేటీఆర్‌ అన్నారు. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణను అన్నివిధాల అభివృద్ధి బాటలో నడిపించామని కేటీఆర్‌ చెప్పారు. మా పాలనపై కాంగ్రెస్‌ బురదచల్లే ప్రయత్నం చేస్తుందని, కాంగ్రెస్‌ ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన అవసరం మాపై ఉందని అన్నారు.కాళేశ్వరంపై న్యాయ విచారణను స్వాగతిస్తున్నామని చెబుతూనే.. మాపై కోపంతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చవద్దంటూ కాంగ్రెస్‌ కు కేటీఆర్‌ సూచించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణపై సమైక్య పాలనలో తీరని వివక్ష చూపించారు. గత పాలకులు తెలంగాణను నిర్లక్ష్యం చేశారు. క్షమించరాని జీవన విధ్వంసానికి పాల్పడ్డారు. ఒకప్పుడు తెలంగాణ అంటేనే నెర్రలు బారిన నేలలు. 60ఏళ్ల గోసను 10ఏళ్లలో మాయం చేసి చూపించారు కేసీఆర్‌.. 2014కు ముందు హైదరాబాద్‌ మినహా మిగిలిన 9 జిల్లాలు వెనుకబడ్డాయి. రక్తాన్ని రంగరించి రాష్ట్రాన్ని ప్రగతిపథం వైపు నడిపించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో విధ్వంసం నుంచి వికాసం వైపు తెలంగాణ ప్రయాణం సాగింది. సంక్షోభం నుంచి సమృద్ధి వైపు పాలన సాగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. విద్యుత్‌ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాం.మిషన్‌ భగీరథను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. తలసరి ఆదాయంలో తెలంగాణను నెంబర్‌ వన్‌ గా నిలిపాం. వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారింది. అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక అని కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అప్పులు రూ. 72,658 కోట్లు ఉన్నాయని .. తెలంగాణ అప్పులు రూ. 3.17 లక్షల కోట్లు అయ్యాయని . కానీ, రూ. 6.71 లక్షల కోట్ల అప్పు ఉందని కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుగా చూపుతోందని కేటీఆర్‌ అన్నారు. ఇదంతా తప్పుల తడక అని కేటీఆర్‌ విమర్శించారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1.14లక్షలు కాగా . 2023లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3.17లక్షలు అని పేర్కొన్నారు . 2013లో తెలంగాణ పేదరికం 21శాతం.. 2023లో పేదరికం 5శాతంకు తగ్గిందని అన్నారు. 2013 -14లో జీఎస్‌ డీపీ రూ. 4.51లక్షల కోట్లు. 2022 -2023 నాటికి జీఎస్డీపీ రూ. 13.22 లక్షల కోట్లకు పెంచామని చెప్పారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చాయని కేటీఆర్‌ అన్నారు.
సివిల్‌ సప్లయ్‌ లో రూ. 56వేల కోట్ల అప్పు ఉందని కేటీఆర్‌ అన్నారు .. అందులో రూ. 30వేల కోట్ల విలువైన ధాన్యం నిల్వలున్నాయి, ఎఫ్‌ సీఐ నుంచి రూ. 16వేల కోట్లు రావాల్సి ఉందని కేటీఆర్‌ అన్నారు.మేము స్వంతగా నివేదికలను రూపొందించడం లేదని ఆర్బీఐ నివేదికలను మాత్రమే ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 126 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఎలా వెల కడతారని కేటీఆర్‌ ప్రశ్నించారు. అదేవిధంగా విద్యుత్‌ రంగంలో గణనీయమైన వృద్ధి సాధించామని తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి 2,700 మెగావాట్ల లోటు ఉంది. అంచెలంచెలుగా విద్యుత్‌ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాం. 2013-14 నాటికి 7,778 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం ఉంది.. 2022- 23 నాటికి 19,464 మెగావాట్ల సామర్థ్యం సాధించామని కేటీఆర్‌ చెప్పారు. విద్యుత్‌ రంగంలో మేం సృష్టించిన ఆస్తులు విలువ రూ. 6,87,585 కోట్లు. విద్యుత్‌ రంగంలో మేం పెట్టిన ఖర్చు రూ. 1,37,517 కోట్లు అని కేటీఆర్‌ అన్నారు.
సాగునీటి రంగానికి మేం పెట్టిన ఖర్చు రూ. 1,76,000కోట్లు. కొత్తగా 60లక్షల ఎకరాలకు సాగునీరు, ఆయకట్టు స్థిరీకరణ చేశాం. 204 టీఎంసీల రిజర్వాయర్లను ఏర్పాటు చేశామని కేటీఆర్‌ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క బరాజ్‌ లో చిన్న తప్పు ఉంటే మొత్తం ప్రాజెక్టునే తప్పుబడుతున్నారని అన్నారు. న్యాయ విచారణ చేయిస్తామంటున్నారుగా .. బరాబర్‌ చేయించుకోండి అంటూ కేటీఆర్‌ అన్నారు. ఏ విచారణకైనా సిద్ధం.. తప్పు జరిగితే చర్యలు తీసుకోండి. కాళేశ్వరంపై న్యాయ విచారణను స్వాగతిస్తున్నాం. మాపై కోపంతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చవద్దు అంటూ కాంగ్రెస్‌ కు కేటీఆర్‌ సూచించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు