Saturday, May 18, 2024

పదేళ్ల పాలనలో ప్రశాంతం…

తప్పక చదవండి

తెలంగాణలో కర్ఫ్యూలు.. మతకల్లోలాలు లేవు

  • సాగర్‌ ఆయకట్టుకు శాశ్వత పరిష్కారం
  • నీటి సమస్యలు తొలగించే చర్యలకు శ్రీకారం
  • డిరడి ప్రాజెక్టుతో దేవరకొండ సస్యశ్యామలం
  • కాలేశ్వరం జలాలతో కన్నీటిని తుడిచాం
  • రైతులు, సంక్షేమ కార్యక్రమాలే మా ప్రాధాన్యం
  • అభివృద్ది కొనసాగాలంటే బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి
  • పదేళ్లలో చేపట్టిన అభివృద్ది మీ కళ్లముందే ఉంది
  • కాంగ్రెస్‌ కల్లబొల్లి మాటలతో బోల్తా కొట్టొద్దు
  • ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్‌ ప్రచారం

రాష్ట్రంలో పదేండ్ల నుంచి కర్ఫ్యూ లేదు.. మతకల్లోలం లేదు.. శాంతియుంతంగా రాష్ట్రం పురోగమిస్తుంది.. మనకు కులం, మతం లేదు.. జాతి లేదు. ప్రజలందరూ మనవారే. తెలంగాణలో ఏ మూలన ఉన్న వ్యక్తి అయినా మన మనిషే. తెలంగాణలో ఎవరూ బాగుపడ్డా మనం బాగుపడ్డట్టే. ప్రతి వ్యక్తి ముఖం మీద చిరునవ్వు ఉండాలి. మతకల్లోలాలు లేవు. హిందూ, ముస్లిం కలిసి బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. హైదరాబాద్‌లో గతంలో ప్రతి ఏడాది కత్తిపోట్లు, మతకల్లోలాలు, కర్ఫ్యూలే. కానీ గత పదేండ్లుగా చీమ చిటుక్కుమనలేదు
` కేసీఆర్‌

- Advertisement -

నల్లగొండ : నాగార్జున సాగర్‌ ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలను తొలగించేందుకు అద్భుతమైన పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. డిరడి ప్రాజెక్టు పూర్తితో ఈ ప్రాంత ప్రజల సాగు కష్టాలు తొలగిపోతాయని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సిఎం సుడిగాలి పర్యటనలతో ప్రచారం నిర్వహించారు. మిర్యాలగూడలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఎన్నికల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యేగా భాస్కర్‌రావును గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలు ఎన్నేళ్లు కొట్లాడాలి.. ఎందుకు ఎట్లాడాలి.. ప్రజల ఖర్మనా దేని కోసం కొట్లాడాలి ? నేను అందరికీ ఒక మాట ఇస్తున్నా. మిర్యాలగడ్డ మీదనుంచి చెబుతున్నా. కృష్ణానదిలో ఈ సారి నీళ్లు తక్కువ వచ్చాయి. కర్నాటకలో ఆపుకున్నరు. శ్రీశైలం దాకా వచ్చినయ్‌. సాగర్‌కు బొట్టు రాలే. ఉన్నదాంట్లో సర్దుతున్నాం. మంచినీళ్లకు, వ్యవసాయానికి ఇస్తున్నాం. ప్రతి సందర్భంలో ఈ బాధ ఉంటుంది. ఈ బాధ శాశ్వతంగా తీరే ఆలోచన బీఆర్‌ఎస్‌ చేస్తున్నదని అన్నారు. గోదావరిలో పుష్కలమైన జలాలు ఉన్నాయ్‌. మనం కాళేశ్వరం కట్టుకున్నాం. ఆసిఫ్‌నగర్‌ కెనాల్‌ ఉందో.. దాని ద్వారా తెస్తే డైరెక్టర్‌గా నల్లగొండ ఉదయసముద్రానికి నీళ్లు వస్తయ్‌. దాని నుంచి పెద్దదేవులపల్లి చెరువులోకి నీరు తీసుకురావొచ్చు. దాంతో శాశ్వతంగా సాగర్‌ ఆయకట్టు రైతుల బాధ తీరుతుంది. దాదాపు స్కీమ్‌ అంతా రెడీ అయ్యింది. బీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో గెలిస్తే చేసే పనేంటంటే.. గోదావరికి లింక్‌ చేస్తాం. ఏ సంవత్సరంలో నీళ్లు తక్కువ వచ్చినా.. ఏ పంటకు తక్కువ నీళ్లున్నా ఆ కాలువ ద్వారా బ్రహ్మాండంగా నీళ్లను తెచ్చుకుందాం. శాశ్వతంగా సాగర్‌ ఆయకట్టు రైతుల పీడవదిలిపోతుంది. ఈ పద్ధతుల్లో ఆలోచించాలి. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పెద్దమనిషి. ఆయన చెబుతున్నడు ప్రజలు కట్టే అమూల్యమైన పన్నుల డబ్బులను రైతుబంధు రూపంలో ఇచ్చి కేసీఆర్‌ దుబారా చేస్తున్నడు అని చెబుతున్నడు. రైతుబంధుకు డబ్బులు ఇస్తే దుబారనా? ఇది కాంగ్రెస్‌ పార్టీ మనస్తత్వం. వాళ్ల వైఖరి’ అంటూ విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు ఏమంటున్నడు అంటే.. కేసీఆర్‌ అనవసరంగా 24గంటల కరెంటు ఇస్తున్నడు.. అది వేస్ట్‌.. ఇవ్వకూడదు.. రైతులకు మూడు గంటలు ఇస్తే సరిపోతది రైతులకు అంటున్నడు. వాళ్ల దృక్పథం అది. కర్నాటకలో 24 గంటల కరెంటు ఇస్తామని గెలిచారు. చివరకు ఇప్పుడు ఐదుగంటల కరెంటు ఇస్తున్నరు. అక్కడో ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌ అనెటాయన ఉన్నడు. మొన్న మనదగ్గరికి వచ్చిండు. కేసీఆర్‌ నువ్వు కావాలంటే మా కర్నాటకు రా.. మా అందం చూడు ఇగ.. మేం ఐదుగంటల కరెంటు ఇస్తున్నం అంటున్నడు. ఇక్కడ 24గంటలు కరెంటు ఇస్తున్నం సన్నాసి.. నీ ఐదుగంటలకు నేనేమి రావాలి.. చెప్పేందుకు కనీసం సిగ్గుపడాలి చెప్పాను. ఈ విధంగా ఆ పార్టీ వైఖరి, దృక్పథం ఉంటదని అన్నారు. ప్రజాసంక్షేమం కోసం పని చేస్తున్న వారిని గెలిపించి ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్‌ పిలుపు నిచ్చారు. నేను చెప్పేమాటలను దళితబిడ్డలు, దళిత మేధావులు ఆలోచన చేయాలన్నారు.. దళితబంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్‌. ఎవడూ చేయలేదు. ఒకటే రోజు చేయకపోవచ్చు.. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ అంత లేకపోవచ్చు. కానీ ఆ నినాదం వస్తే.. వారిలో ఆత్మవిశ్వాసం రావాలి.. దఫాల వారీగా అయినా సరేనని కంకణం కొట్టుకొని ఇంటికి రూ.10లక్షలు ఇచ్చేలా దళితబంధు కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. దళిత సమాజం ఆలోచన చేయాలి. ఇలా చేసే వారిని ప్రోత్సహించాలి.. గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఒరవడిలోపడి కొట్టుకుపోవద్దు. గెలిపిస్తే ఇంకా చేయాలని అనిపిస్తుంది. గతంలో బ్యాంకుల్లో అప్పులుంటే.. బ్యాంకుల వాళ్లు తలుపులు తీసుకొని పోతుండే. గవర్నమెంట్‌ కూడా వారికి సపోర్టు చేస్తుండే. కానీ రైతు పరిస్థితి మెరుగుపరచాలని ఎన్నడూ ఏ పార్టీ ప్రభుత్వం ఆలోచించలేదన్నారు. గ్రామాలు, పల్లెలు ఎట్లా కళకళలాడాలి ? పచ్చదనం ఎట్లా ఉండాలని ఒక్కొక్క కార్యక్రమాలు నిర్ణయించాం. ఆడబిడ్డల గోస తీరాలని, దూప తీరాలని మిషన్‌ భగరీథ ద్వారా శుద్ధమైన మంచినీళ్లు తెచ్చుకున్నాం. కరెంటు బాధను శాశ్వతంగా దూరం చేసుకున్నాం. ఈ జిల్లాకు చెందిన కరెంటు మంత్రి జగదీశ్‌రెడ్డి, భాస్కర్‌రావు ముందుకువచ్చి దామరచర్లను చూపించడంతో రూ.30వేలకోట్లతో అల్టామ్రెగా పవర్‌ప్లాంట్‌ రూపుదిద్దు కుంటున్నది. ఈసారి భాస్కర్‌రావును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిస్తే భాస్కర్‌రావు కోరిన కోర్కెలు నెరవేరుస్తా. అక్కడి నిరుద్యోగులకు పవర్‌ప్లాంట్‌లో ఉద్యోగాలు వచ్చేలా చేయిస్తా. మంచిపనులు కోసం తపించే.. మంచి నాయకుడు ఎప్పుడు ఉన్నా వారిని గెలిపించే ప్రయత్నం జరగాలని అన్నారు. ఇవాళ సమస్యలన్నీ ఒకటి తర్వాత ఒకటి తీర్చుకుంటున్నాం. ముందుకెళ్తున్నాం. ఒక రాష్ట్రం, ఒక దేశం బాగుపడ్డదా? లేదా? అని తెలుసుకునేందుకు కొన్ని గీటురాళ్లు అభివృద్ది పనులే అన్నారు. కేవలం పది సంవత్సరాల చిన్న వయసున్న తెలంగాణ ఈ రోజు తలసరి ఆదాయంలో నెంబర్‌ వన్‌ అని గర్వంగా తెలుపుతున్నా. తలసరి విద్యుత్‌ వినియోగంలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. మంచినీళ్ల సరఫరాలో నెంబర్‌ వన్‌గా ఉన్నాం. సాగునీళ్ల బాధ తీరబోతున్నది. రాబోయే రెండేళ్లలో తీరిపోతుంది. పేదలు, నిరుపేదలు, రైతాంగాన్ని వెంబడేసుకొని కొనసాగుతున్న ముందుకెళ్తున్న ఈ ప్రయాణం ఇదేవిధంగా కొనసాగితే మంచిది. వేరేవాళ్లు వస్తే డిస్టబెన్స్‌ వస్తుంది. వాళ్ల వైఖరి, ఆలోచన సరళి మీకు తెలుసునన్నారు. ఇక డిరడి ప్రాజెక్టు పూర్తయితే దేవరకొండ నియోజకవర్గం దరిద్రం పోతదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఎందుకంటే.. ఈ ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతలతో లింక్‌ ఉంటది కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో నీళ్లు వస్తాయని సీఎం తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్‌ నాయక్‌ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ అని కేసీఆర్‌ గుర్తు చేశారు. పార్టీలో చేరినప్పటి నుంచి డిరడి ప్రాజెక్టు కోసం, ఇక్కడి వ్యవసాయం, నీళ్ల గురించే మాట్లాడేవారు. కాంగ్రెస్‌ పార్టీల నాయకులే స్టేలు తీసుకురావడంతో డిరడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఆగింది. ఇప్పుడిప్పుడు కోర్టు చిక్కులు పోయాయి. కేంద్ర ప్రభుత్వం 10 ఏండ్ల సమయం తీసుకుని, మొన్న నేను చెడామడా తిట్టిన తర్వాత ఈ మధ్యనే దాన్ని ట్రిబ్యునల్‌కు రిఫర్‌ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో డిరడి ప్రాజెక్టు పూర్తవుతుంది. పాలమూరు ఎత్తిపోతలకు లింక్‌ ఉంది కాబట్టి అది అయిపో యిందంటే.. ఐదు రిజర్వాయర్లు, ఒక బ్యారజ్‌ కూడా దేవరకొండలో వస్తుంది. మీ దరిద్రం పోతుందని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాక ముందు పరిస్థితి ఎలా ఉండే. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలని కోరుతున్నాను అని కేసీఆర్‌ సూచించారు. కరెంట్‌, మంచి నీళ్లు బాధలు పోయినయ్‌, సాగునీటి బాధలు తీర్చుకుంటున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. గత ప్రభుత్వాల హయాంలో ఒక్క తండాను గ్రామపంచాయతీ చేయలేదు. మా తండాల్లో మా రాజ్యం అనే నినాదాన్ని నిజం చేసుకున్నాం. 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసుకున్నాం అని కేసీఆర్‌ తెలిపారు. దేవరకొండ వెనుకబడిన ప్రాంతం కాబట్టి నాకు ప్రత్యేకమైన దృష్టి ఉందని సీఎం పేర్కొన్నారు. చక్కటి ఎమ్మెల్యే ఉన్నారు. రవీందర్‌ నాయక్‌ బాధపెట్టే వ్యక్తి కాదు. చక్కటి నాయకుడు కాబట్టి డబుల్‌ మెజార్టీతో గెలిపించాలి. దేవరకొండ చరిత్రలో ఇదే పెద్ద మీటింగ్‌ అని అనుకుంటున్నాం. ఇంతకుముందు వచ్చిన కానీ ఇంత గొప్ప సమావేశం జరగలేదు. రవీందర్‌ కుమార్‌ 80 వేల మెజార్టీతో గెలిచిపోయిండు అని అర్థమవుతుంది. మళ్లీ ఎన్నికల తర్వాత వస్తాను. ఒక రోజుంతా దేవరకొండలో ఉంటాను. ప్రాజెక్టులను పరిశీలిస్తాను. ఇక్కడ కొన్ని పరిశ్రమలు కూడా రావాలని కోరారు. 100 శాతం మీతో పాటు ఉంటాను. వెనుకవడ్డ ప్రాంతాల్లో పేదరికం పోవాలి. మంచి వ్యక్తిని గెలిపించుకుంటే మంచి జరుగుతుంది. మళ్లీ మన గవర్నమెంటే వస్తుంది. అందులో అనుమానం అవసరం లేదు. మీ ఆశీర్వచనంతో ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలి. అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ తీసుకొచ్చే బాధ్యత నాది అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు