Sunday, May 5, 2024

క్రికెట్‌ దేవుడుకు అరుదైన గౌరవం

తప్పక చదవండి
  • ఈ ఏడాది ఏప్రిల్‌ లో 50వ పుట్టినరోజు జరుపుకున్న సచిన్‌
  • వాంఖెడే స్టేడియంలో విగ్రహం ఏర్పాటు చేసిన మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం
  • విగ్రహావిష్కరణకు హాజరుకానున్న సీఎం ఏక్‌ నాథ్‌ షిండే
  • శ్రీలంక మ్యాచ్‌కి ముందు ఆవిష్కరణ..

తన అమోఘమైన బ్యాటింగ్‌ నైపుణ్యం, ఎవరికీ సాధ్యం కాని రికార్డులతో క్రికెట్‌ దేవుడిగా ఖ్యాతిగాంచిన భారత మాజీ క్రికెటర్‌, ‘క్రికెట్‌ గాడ్‌’ సచిన్‌ టెండూల్కర్‌ కు గొప్ప గౌరవం దక్కనుంది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియం ముందు సచిన్‌ టెండూల్కర్‌ కాంస్య విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. నవంబర్‌ 2న ఇండియా వర్సెస్‌ శ్రీలంక మ్యాచ్‌ ఆరంభానికి ముందు సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు.. అహ్మద్‌నగర్‌కి చెందిన ప్రమోద్‌ కంబల్‌ అనే శిల్ఫి ఈ విగ్రహాన్ని రూపొందించాడు. నవంబర్‌ 2013లో సచిన్‌ టెండూల్కర్‌ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన పదేళ్లకు ‘మాస్టర్‌’ విగ్రహావిష్కరణ జరగనుంది. నిజానికి ఏప్రిల్‌ 24న సచిన్‌ టెండూల్కర్‌ 50వ పుట్టిన రోజున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నారు. అయితే పనులు పూర్తి కావడానికి ఆలస్యం కావడంతో నవంబర్‌ 1న ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. వాంఖడే స్టేడియంలో సచిన్‌ టెండూల్కర్‌ స్టాండ్‌కి ముందు ఈ విగ్రహం ఉండడం విశేషం. సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెర్నాండేస్‌, సచిన్‌ టెండూల్కర్‌, బీసీసీఐ సెక్రటరీ జై షా, ట్రెజరర్‌ ఆశీష్‌ సెలర్‌, ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అమోల్‌ కేల్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకాబోతున్నారు.

భారత క్రికెట్‌ చరిత్రలోనే మహోన్నత బ్యాట్స్‌ మన్‌ గా సచిన్‌ ఎప్పటికీ నిలిచిపోతాడు. ఫార్మాట్‌ ఏదైనా తనదైన శైలిలో పరుగులు వెల్లువెత్తించడమే ఈ మ్యాస్ట్రోకు తెలిసిన విద్య. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ప్రతిభ మాత్రమే కాదు వినయ విధేయతలుకూడా ఉండాలని పెద్దలు చెప్పే మాటలకు సిసలైన రూపం సచిన్‌ టెండూల్కర్‌. అందుకే, ఇతర జట్ల ఆటగాళ్లు కూడా సచిన్‌ ను ఎంతగానో అభిమానిస్తుంటారు. సచిన్‌ కెరీర్‌ గణాంకాలు చూస్తే ఎవరైనా సాహో అనాల్సిందే. 200 టెస్టుల్లో 53.78 సగటుతో 15,921 పరుగులు చేశాడు. అందులో 51 సెంచరీలు, 68 అర్ధసెంచరీలు ఉన్నాయి. 463 వన్డేల్లో 44.83 సగటుతో 18,426 పరుగులు సాధించాడు. అందులో 49 సెంచరీలు, 96 అర్ధసెంచరీలు ఉన్నాయి. 1989 నవంబర్‌ 15న పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సచిన్‌ టెండూల్కర్‌, 2013 నవంబర్‌ 14న ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. 200 టెస్టులు, 463 వన్డేలు ఆడిన సచిన్‌ టెండూల్కర్‌.. 100 అంతర్జాతీయ సెంచరీలు, 164 హాఫ్‌ సెంచరీలు చేశాడు. 1994లో ‘అర్జున’ అవార్డు దక్కించుకున్న సచిన్‌ టెండూల్కర్‌, 1997లో ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’, 1998లో ‘పద్మశ్రీ’, 2008లో ‘పద్మ విభూషణ్‌’, 2013లో భారత అత్యున్నత్త పురస్కారం ‘భారత రత్న’ అందుకున్నాడు. సచిన్‌ తన కెరీర్‌ లో కేవలం ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడాడు. అందులో 10 పరుగులు చేసి, ఒక వికెట్‌ తీశాడు. సచిన్‌ మీడియం పేసర్‌, లెగ్‌ స్పిన్నర్‌ కూడా. టెస్టుల్లో 46, వన్డేల్లో 154 వికెట్లు తీయడం విశేషం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు