Wednesday, September 11, 2024
spot_img

రష్యాతో మా బంధం ఎప్పటికీ ధృఢమైనదే

తప్పక చదవండి
  • ఈ బంధాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తాం
  • రష్యా పర్యటనపై విదేశాంగ మంత్రి జయశంకర్‌

న్యూఢిల్లీ : తన రష్యా పర్యటనతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మధ్య ఉన్న స్నేహం గురించి పాశ్చాత్య మీడియా చేసిన విమర్శలకు విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘ప్రజలు నన్ను చదవలేకపోతున్నారంటే, నా మైండ్‌ గేమ్‌ పని చేస్తోందని అర్థం. వాళ్లు ఏమైనా అనుకోవచ్చు కానీ, మా విధానం మాత్రం స్థిరంగానే ఉంది. ఎందుకంటే.. రష్యాతో మా సంబంధం ఎప్పుడూ ముఖ్యమైంది, చాలా స్థిరమైంది. ఈ సంబంధాన్ని మేము ఎల్లప్పుడూ కొనసాగిస్తాం‘ అని చెప్పారు. రష్యాతో సంబంధాలు భారత్‌కు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయన్న ఆయన.. ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు భారతదేశం ఆలోచనాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. భారతదేశానికి రష్యా ఎంతో విలువైన భాగస్వామి అని, సుదీర్ఘ కాలం నుంచి రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని జైశంకర్‌ తెలిపారు. ఈ బంధం.. భారత్‌తో పాటు రష్యాకు కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చిందని అన్నారు. తమ మధ్య పెరుగుతున్న వాణిజ్యం, పెట్టుబడులు, సైనిక`సాంకేతిక సహకారం, కనెక్టివిటీ ప్రాజెక్టులు వంటివి భారత్‌, రష్యా మధ్య ఉన్న సంబంధం ఎంత బలమైందో, విలువైందో చాటి చెప్తాయని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్దం నుంచి ఇరు దేశాల నాయకుల మధ్య వార్షిక సమావేశాలు సాగుతున్నాయని చెప్పారు. తమ నాయకుల మధ్య సానుకూల భావాలు ఉన్నాయని.. ఇదే భారత్‌, రష్యా మధ్య బలమైన సంబంధానికి బిగ్‌ సోర్స్‌ అని తాను భావిస్తున్నానని చెప్పారు. ఎవరితో సంబంధాలు పెట్టుకుంటున్నామనే దానికన్నా.. ఆ సంబంధాలు ఎలాంటి ఫలితాల్ని అందించాయన్నది ముఖ్యమని జైశంకర్‌ నొక్కి చెప్పారు. ఇదిలావుండగా.. 2022 ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కి మద్దతు ఇవ్వాలని పాశ్చాత్త దేశాలు భారత్‌పై ఒత్తిడి చేశాయి. అయితే.. భారత్‌ ఆ ఒత్తిడిని ఎదుర్కొని ఈ యుద్ధంపై తన స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచిస్తూ.. సార్వభౌమత్వం, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇలాంటి తరుణంలో రష్యా అధ్యక్షుడితో జైశంకర్‌ భేటీ అవ్వడంతో.. భారత్‌ రష్యాకే అనుకూలంగా ఉందా? అనే కోణంలో పాశ్చాత్త మీడియా విమర్శలు గుప్పించింది. అందుకు కౌంటర్‌గానే జైశంకర్‌ పై విధంగా స్పందించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు