- అయోధ్య రాముడికి నామకరణం
- బాలక్ రామ్ మందిర్‌గా పిలుస్తామన్న ట్రస్ట్ పూజారి
- కొలువుదీరిన రాముడి వయసు ఐదేళ్లని వెల్లడి
- భక్తజనసంద్రంగా అయోధ్య.. తరలివస్తున్న భక్తులు
- బాలరాముడి కోసం ఉదయం నుంచే క్యూ
- ఉదయం దాదాపు 3లక్షల మందికి దర్శనం
అయోధ్య : ప్రాణప్రతిష్ట రోజు కేవలం విఐపలకు మాత్రమే దర్శనమిచ్చిన అయోద్య బాలరముడు మంగళవారంన ఉంచి సామాన్యులకు దర్శనమిచ్చారు. భవ్యమందిరంలో కొలువైన బాలరాముడిని దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు పోటెత్తారు. అయోధ్య పురవీధులన్నీ రామభక్తులతో నిండిపోయాయి. శ్రీరాముడి దర్శనానికి సామాన్య భక్తులకు అనుమతి ఇస్తున్నారు. దీంతో తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు మెయిన్ గేటు వద్ద బారులు తీరారు. ఉదయం ఏడు గంటల నుంచే భక్తుల్ని నిర్వాహకులు అనుమతిస్తున్నారు. మరోవైపు ఆలయం బయట భారీగా భక్తుల ఎక్కువగా ఉంది. అవసరమైతే స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ యోచిస్తోంది. రామ్ లల్లా దర్శనం కోసం రెండు స్లాట్‌లు కేటాయిస్తున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. ఉదయం 7గం. నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గం. వరకు రెండు దఫాలుగా భక్తులను అనుమతిస్తామని ప్రకటించారు. దీంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఇప్పటికే అయోధ్యలో ఉన్న భక్తులు కాకుండా కొత్తగా వస్తున్న భక్తులతో అయోధ్య కిటకిటలాడిరది. కాగా, కొలువైన బాల రాముడిని ఇప్పటి వరకు రామ్ లల్లా అని పిలిచారు. ఇప్పుడు బాల రాముడి పేరును మార్చారు. ఇకపై రామ్ లల్లాను ‘బాలక్ రామ్’గా పిలవనున్నట్టు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయంలో కొలువుదీరిన శ్రీరాముడు ఐదేళ్ల పసిబాలుడని… అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించామని చెప్పారు. ఇకపై ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామని తెలిపారు. ఇకపోతే రామ్‌లల్లాకు రోజుకు ఆరుసార్లు హారతి నిర్వహిస్తారు. ఇందుకోసం భక్తులకు పాస్‌లు జారీ చేస్తారు. ఇప్పటి వరకు రామ్‌లల్లాకు రోజుకు రెండు హారతులు ఉండేవి. ఇకపై రోజుకు ఆరు హారతులు ఉంటాయని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. అలాగే రోజుకో వస్త్ర అలంకార విశేషం ఉంటుందని ప్రకటించింది. అంచనాలను నిజం చేస్తూ తొలి రోజునే అయోధ్య రామమందిరానికి భక్తులు పోటెత్తారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఉదయం సమయంలో సుమారు మూడు లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శనం చేసుకున్నారు. అంతే సంఖ్యలో భక్తులు ఆలయం బయట దర్శనం కోసం వేచి చూస్తున్నారు. భక్తులు భారీగా పోటెత్తడంతో అధికారులు రద్దీని నియంత్రించేందుకు ఏకంగా 8 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించాల్సి వచ్చింది. దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని కూడా అధికారులు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు రామాలయానికి క్యూకట్టారని స్థానికులు తెలిపారు. అయోధ్య వాసులే కాకుండా, పొరుగు జిల్లాలైన లఖ్‌నవూ, బారాబంకీ, గొండా, బహ్రెయిచ్, ఉన్నావ్, గోరఖ్‌పూర్ నుంచి భక్తులు బాలరాముడి దర్శనం కోసం తరలివచ్చారు. ఉదయం ఏడు గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకోగానే భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు అయోధ్యలో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. భక్తులు వేచి చూసేందుకు ఓ ప్రాంతం సిద్ధం చేశాం. అక్కడి నుంచి క్రమపద్ధతిలో భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నట్లు అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాళ్ మీడియాకు తెలిపారు. రద్దీ నిర్వహణ కోసం యూపీ స్పెషల్ ఫోర్సెస్‌కు, ఇతర భద్రతా సిబ్బందికీ ప్రత్యేక సూచనలు చేశామని అయోధ్య ఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మా బాధ్యత క్రౌడ్ మేనేజ్‌మెంట్ అయినప్పటికీ పోలీసింగ్ విధులు కూడా ఉన్నాయి. అయితే, భక్తులతో కటువుగా ఉండొద్దని సిబ్బందికి సూచనలు ఇచ్చాము. భక్తుల సౌకర్యం కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నాం అని ప్రవీణ్ కుమార్ తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు ప్రకటన ప్రకారం, భక్తులను ఉదయం 7 నుంచి 11.30 వరకూ దర్శనానికి అనుమతిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ మళ్లీ దర్శనాలను అనుమతిస్తారు. స్వామి వారికి నైవేద్యంగా భక్తులు పళ్లు, పాలను సమర్పించవచ్చని ట్రస్టు పేర్కొంది. ఆలయ వర్గాలు స్వామి వారికి రోజుకో అలంకరణ చేయనున్నాయి. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపుపచ్చ, శుక్రవారం లేత పసుపుపచ్చ, శనివారం నీల వర్ణం దుస్తుల్లో స్వామివారు దర్శనమిస్తారు. ఇక ప్రత్యేక సందర్భాల్లో కూడా బాలరాముడి అలంకరణలో మార్పులు ఉంటయాని ట్రస్టు వారు తమ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.