- కేసీఆర్ దోచుకున్న డబ్బును కక్కిస్తా
- తెలంగాణలో దొరల రాజ్యాన్ని తరిమేద్దాం
- కల్వకుర్తి సభలో రాహుల్ పిలుపు
- కేసీఆర్‌ను గద్దె దించాలంటే, కలసికట్టు పోరాటం
- అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపాల్సిందే
- వివేక్ చేరికతో వెయ్యేనుగుల బలం
- టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్య
మహబూబ్‌నగర్ : బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల నుంచి దోచుకున్న డబ్బులను కక్కించాలని రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చారు. తెలంగాణకు కేసీఆర్ రాజులాగా వ్యవహరిస్తున్నారని, దొరల తెలంగాణకు ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు యుద్ధమని అన్నారు. కేసీఆర్ లూటీ చేసిన డబ్బుల్ని మీ అకౌంట్లలో వేసేలా ప్రయత్నం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో విజయభేరి యాత్ర పేరుతో తెలంగాణ కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, బీజేపీపై ఆరోపణలు చేశారు. ‘నాకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని కూడా గుంజుకున్నారు. దాంతో నేను ఆ ఇంటిని సంతోషంగా ఇచ్చేశా. మొత్తం దేశం, తెలంగాణ అంతా నా ఇల్లు. అవసరమైతే కోట్లాది మంది ప్రజలు అక్కున చేర్చుకుంటారు. బీజేపీకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారిపైన ఈడీ, సీబీఐ కేసులు ఉంటాయి. కానీ, బీఆర్‌ఎస్ పైన ఇలాంటివేమీ ఉండవు. బీజేపీ పెద్దలు తెలంగాణకు వచ్చి ఓబీసీ వ్యక్తిని సీఎంగా చేస్తానంటారు. ఇక్కడ వారికి రెండు శాతం ఓట్లు వస్తే సీఎంని ఎలా చేస్తారు. వీళ్ల తీరు ఎలా ఉందంటే.. అమెరికా అధ్యక్షుడిగా ఓబీసీ వ్యక్తిని మోడీ అమెరికా వెళ్లి చెప్పినట్లుందన్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, అసోం, ఉత్తర్‌ప్రదేశ్ ఎక్కడైనా కాంగ్రెస్ పోటీ చేస్తే, అక్కడ ఎంఐఎం అభ్యర్థులు ప్రత్యక్షం అవుతారు. వాళ్లంతా అక్కడ బీజేపీ అభ్యర్థులకు సాయపడడానికి వస్తారు. ఈ ఎంఐఎం వాళ్లకు డబ్బులు కూడా బీజేపీనే ఇస్తుంది. అందుకే ఎంఐఎం బీజేపీ
బీఆర్‌ఎస్ పార్టీలు ఒకటే శక్తి. తెలంగాణలో బీజేపీ టైర్లు పంచర్ చేసినట్లుగానే కేంద్రంలో కూడా బీజేపీ టైర్లు పంచర్ చేస్తాము. ఇక్కడ తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్‌లో కూడా గెలవబోతున్నాం. తర్వాత కేంద్రంలోనూ గెలుస్తాం. అందరం కష్టపడి ఇక్కడ బీఆర్‌ఎస్‌ను ఓడిద్దాం. జనరల్ ఎన్నికల్లో బీజేపీని ఓడిద్దాం అని రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చారు. ఇదిలావుంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు అకస్మాత్తుగా రావడం హాట్ టాపిక్‌గా మారింది. అసలు రాహుల్ రాకపై ఎందుకో గానీ కాంగ్రెస్ నేతలు గోప్యత పాటిస్తున్నారు. రాహుల్ ఎక్కడికీ వెళ్లడం లేదంటూనే ఆయన కోసం కాంగ్రెస్ నేతలు కాన్వాయ్ సిద్ధం చేస్తున్నారు. గంట పాటు రాహుల్ బయటకు వెళ్లేలా కాంగ్రెస్ నేతలు ఎª`లాన్ చేస్తున్నారు. అయితే ఆయన ఎక్కడకు వెళుతున్నారనేది మాత్రం బయటకు తెలియనివ్వడం లేదు. రాహుల్ ఈ సడెన్ విజిట్‌పై ఉత్కంఠ చోటు చేసుకుంది. రాహుల్ విజిట్‌పై పోలీసులు సైతం ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకూ రాహుల్ రాకపై కనీసం పోలీసులకు సైతం సమాచారం లేకపోవడం గమనార్హం.
కాగా.. రాహుల్ గాంధీ బుధవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బస్సు యాత్ర చేపట్టారు. మధ్యాహ్నం కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. కల్వకుర్తిలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. అనంతరం నాలుగు గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కార్నర్ మీటింగ్ చేపట్టారు. సాయంత్రం ఐదు గంటలకు రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్‌లో రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్ కూడలి వరకు పాదయాత్ర చేస్తారు.మరోవైపు.. పార్టీ నేతలతో పలు అంశాలపై ఇప్పటికే నోవాటెల్‌లో చర్చలు జరిపారు. పెండిరగ్ సీట్లపై టీపీసీసీ నేతలతో నిశితంగా చర్చించారు. ముఖ్యంగా కమ్యూనిస్టుల సీట్లపై ఇప్పటికే దాదాపు క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది.ఈ సమావేశం తర్వాత.. సీనియర్ నేత వివేక్ వెంకటస్వామికి కండువా కప్పిన రాహుల్.. కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు.
బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలంటే అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అవినీతి, కుటుంబ పాలనకు తెలంగాణలో తెరదించాలని అన్నారు. ఇది కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. బిజెపిని వీడి కాంగ్రెస్‌లో చేరిన వివేక్ వెంకటస్వామిని కూడా ఇదే కోరడం జరిగిందని అన్నారు. గాంధీ కుటుంబంతో వివేక్‌కు ఎంతో అనుబంధం ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన నోవోటెల్ హోటల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ వివేక్‌తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్‌లో మాట్లాడి కాంగ్రెస్‌లో చేరాలని కోరారని, ఆయన కోరిక మేరకు రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారన్నారు. వివేక్ తిరిగి కాంగ్రెస్‌లో చేరడమంటే ఆయన సొంత కుటుంబంలో చేరినట్లేనని, ఆయన్ను కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని రేవంత్ అన్నారు. వివేక్ చేరిక కాంగ్రెస్‌కు వెయ్యేనుగుల బలాన్ని చేకూర్చిందన్నారు. కీలక సందర్భంలో ఆయన కాంగ్రెస్‌లో చేరడంతో తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ రావాలనే ప్రజల ఆకాంక్షకు వివేక్ చేరిక బలాన్నిస్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు. కాగా ఎన్నికల సమయంలో బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ వివేక్‌తో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఫోన్ చేసి మాట్లాడారు. ’తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మీలాంటి వాళ్లు కాంగ్రెస్‌లోకి రావాలని కోరారు’ ఖర్గే ఆహ్వానం మేరకు ఇవాళ నోవాటెల్‌లో రాహుల్ గాంధీని కలిసి పార్టీలో చేరారు.