Wednesday, May 15, 2024

అసెంబ్లీ ఎన్నికలకు డీకే అరుణ దూరం

తప్పక చదవండి
  • బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తానన్న అరుణ
  • పోటీ చేయనని గతంలోనూ చెప్పినట్లు వెల్లడి
  • బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తానన్న డీకే అరుణ

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు కాషాయం కండువా తీసేసి ఇతర పార్టీలకు జంప్‌ అవుతున్నారు. మరికొందరు ముఖ్యనేతలు ఈసారి జరిగే ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకతో వలసలతో కిక్కిరిసిపోయిన తెలంగాణ బీజీపీకి.. ఎన్నికల సమయంలో అగ్రనేతలు వరుసగా షాక్‌ ఇస్తున్నారు. అనేక మంది సీనియర్‌ నేతలు ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నారు. ఏకంగా మాజీ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ఏనుగు రవీందర్‌ రెడ్డి, తాజాగా వివేక్‌ వెంకట స్వామి బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు. మరోవైపు ఇప్పటికే ఎంపీలు డాక్టర్‌ లక్ష్మణ్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పోటీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. తాజా ఈ జాబితాలోకి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చేరారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తామని స్పష్టం చేస్తామంటున్నారు. రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ఆమె కీలక ప్రకటన చేశారు. గద్వాల అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడిరచారు. ఈసారి గద్వాల్‌ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండబోనని అధిష్టానానికి తేల్చి చెప్పారు డీకే అరుణ. అయితే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తరుఫున పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తన స్థానం గద్వాలలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపుతామని వెల్లడిరచారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బీసీ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. ఈ అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తానని డీకే అరుణ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ వైపు పెరుగుతున్న ఆదరణ చూసి, కాంగ్రెస్‌ను పైకి లేపేలా అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని అంటే బీజేపీతోనే సాధ్యం అని ప్రజలు భావిస్తున్నారని స్పష్టం చేశారు డీకే అరుణ. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉంటేనే రాష్ట్ర ఆర్థిక స్థితి, ప్రజల జీవన స్థితి మెరుగుపడుతుందన్నారు అరుణ. కాంగ్రెస్‌ అడ్డగోలుగా హామీలు ఇస్తూ తెలంగాణను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీకి పోటీ చేయను అని గతంలోనే చెప్పానని, బీసీ సీఎం నినాదం నేపథ్యంలోనే గద్వాల స్థానం నుంచి బీసీ అభ్యర్థిని నిలబెడుతున్నామని డీకే అరుణ తెలిపారు. భారతీయ జనతా పార్టీ కీలక నేతలే ఒక్కొక్కరుగా పోటీ నుంచి తప్పుకుంటుంటే పార్టీ నేతలే షాక్‌ అవుతున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావలో ఉన్నారట పార్టీ శ్రేణులు. ఏది ఏమైనా ప్రస్తుతం డీకే అరుణ తీసుకున్న నిర్ణయం భారతీయ జనతా పార్టీలో అనిశ్చితి నెలకొందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు