Wednesday, May 8, 2024

కేసీఆర్‌ భరోసా ప్రజల్లోకి తీసుకపోవడంలో నేతలు విఫలం..!

తప్పక చదవండి

ఈసారి తెలంగాణలో 2023 ఎన్నికలు రసవత్తరంగా జరిగినాయి.ఆయా పార్టీల తరపున హేమా హేమీలందరు రంగంలోకి దిగి ప్రచారం చేసారు. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోజు నాలుగు, ఐదు నియోజకవర్గాల్లోని ప్రజా ఆశీర్వాదాసభల్లో నిరవధికంగా ప్రచారపర్వం కొనసాగించారు.బీఆర్‌ఎస్‌ ను గెలిపించేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అటు పక్క,ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు ఇటు పక్క, ఎమ్మెల్సీ కవిత మరోపక్క స్టార్‌ క్యాంపెయినర్లుగా విస్తృతంగా ప్రచారం చేసారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తరపున ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంశాఖ మాత్యులు అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఎడతెరపిలేకుండా ప్రచారం చేసారు. కాంగ్రెస్‌ తరపున ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే, సోనియా గాంధీ,రాహుల్‌ గాంధీ,ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్దిరామయ్య, డిప్యూటీ సీఎం డికె శివకుమార్‌ తదితర నాయకులు పోటా, పోటీగా చేసేది చెప్పేకన్నా దుమ్మెత్తి పోసుకోవడం ప్రజలకు కన్పించింది. ఉప్పునిప్పుగా ఉన్న కాంగ్రెస్‌,బీజేపీ కలసిపోయి తెరచాటుగా వైనం పొందిన మరచిపోలేము. ఏది ఏమైనా ఆగస్టు చివరి వారం నుంచి ప్రచారంలో బీఆర్‌ఎస్‌ తనదైన శైలిలో మూడు నెలల పాటు ప్రచారం నిర్వహించారు.ఈ ఎన్నికల్లో ట్రయాంగిల్‌ ఫైట్‌ గా భావించిన తెలంగాణలో చివరి వారంలో కాంగ్రెస్‌- బీఆర్‌ఎస్‌ మధ్య పోటీ క్లై మాక్స్‌ చేరుకుంది.ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇంతకీ తెలంగాణ లో ఏమి జరుగబోతోంది? బీఆర్‌ఎస్‌ మళ్ళీ అధికారంలోకి వస్తుందా ? లేక కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందా? అన్న దానిపై చేసిన సర్వేలు వివిధ సంస్థలు విడుద లతో అన్ని పార్టీలకు అలజడి రేకెత్తింది.అయితే 2018లో వచ్చిన సర్వేలపై నాడు ఊహించినట్టుగానే కొంత మంది సన్నాసులు, వెకిలి, మకిలి సర్వేలు చేస్తున్నారేమోనని పెడచెవిన పెట్టారు. నమ్మవద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.గత నాలుగు దశాబ్దా లుగా ఎన్నికల పలితాలను ముందుగానే విశ్లేషించి చెప్పగల నేర్పరితనం, నైపుణ్యం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను నమ్మి ఈ ఎన్నికల్లో ఫలితాలు అంచనా వేయడంలో విఫలం అయ్యారు. బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సర్వేలకు హేతుబద్దత లేదని, నూటికి నూరుపాళ్లు బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. గతంలో మాత్రం అధికారపార్టీకి అనుకూలంగా ఇచ్చిన సర్వేలతో ఉబ్బితబ్బైబ్బయ్యారు. తాము చెపుతున్న వంద సీట్లకు వివిధ సర్వేలు దగ్గరగా ఉన్నాయని ఎన్నో సభల్లో ఘంటాపథంగా చెప్పారు. ఇప్పుడు అదే సర్వేలు చెప్పిన అంచనాలను మాత్రం బీఆర్‌ఎస్‌ నాయకులు జీర్ణించుకోలేక ఎదురుదాడి చేసారు.ఆయా సర్వేలను తిట్టి పోస్తూ వారి అనుకూల మీడియాలో కథనాలను ప్రచురణలు, ప్రసారం చేశారు. గిదే విషయాన్నీ ‘వినదగునెవ్వరు చెప్పిన’ అని అంటారు.కేసీఆర్‌ వ్యవహారం ఇందుకు బిన్నం.తాను చెప్పిందే ఇతరులు వినాలని అయన భావిస్తూంటారేమో కానీ ,హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఒడిపోతున్నామంటే సర్వే సంస్థలను, ఇంటలిజెన్స్‌ ఆఫీసర్లకు చివాట్లు పెట్టిండనే ప్రచారం ఉంది.ఇప్పుడు కూడా అదే చెప్పితే పట్టించుకోలేదని ఆయా సంస్థలు మొత్తుకుంటున్నాయి.కేసీఆర్‌ స్థానంలో మరొకరుంటే ఆయా సంస్థల అంచనాలను తెప్పించుకుని, వాటిని పరిశీలించి, ఎక్కడ పొరపాటు జరిగిందని, విరుగుడు చర్యలపై దృష్టి పెట్టేవారు. మూడు నెలల క్రితం వరకు కేసీఆర్‌ అంటేనే తెలంగాణ.. తెలంగాణ అంటేనే కేసీఆర్‌ అన్న రీతిలో ఏకపక్షంగా ఉన్న వాతావరణం ఎందుకు మారిపోయిందో చెప్పేందుకు తన స్వంత ఇంటలిజెన్సీ సాహసం చేయలేదు. ఎందుకంటే పోలీసులు కూడా ఉద్యోగులే కదా? కేసీఆర్‌ ఆలా గాకుండా తన సహజ శైలిలో భయబ్రాంతులకు గురిచేస్తారనే భావం అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలను ముందుగానే ఆయా పార్టీల గెలుపు, ఓటములపై సర్వే సంస్థల రిపోర్ట్‌ అనుకూలంగా వచ్చినప్పుడు ఒకలా,వ్యతిరేకంగా వచ్చినప్పుడు మరోలా స్పందించడం రాజకీయ పార్టీలకు అలవాటే కానీ,కేసీఆర్‌ మాత్రం మూడు నెలల్లో మార్పు రాక పోతుందా ? అనే వేచితూచే ధోరణి కొంప ముంచిందని, ప్రతి ఒక్కరిలో ఆవేదనతో కూడిన ప్రశ్నలు అందరిలో ఉత్పన్నమవుతున్నాయి. ఆగస్టు,21 ముందు సీఎం కేసీఆర్‌ ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉన్నారు.అప్పుడు గ్రామీణ ప్రాంతాలలో బీఆర్‌ఎస్‌ – బీజేపీ – కాంగ్రెస్‌ మధ్య ట్రయాంగిల్‌ పోటీ ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌ దే పై చేయి ఉన్నది. అదే సమయంలో పట్టణంలో కూడా మంచి పట్టుసడలకుండా ఉన్నది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఈ పరిస్థితు ల్లో మార్పు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు అందరు ఉహిం చినదానికి భిన్నంగా అధికార పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ 119 సీట్లలో 115 స్థానాల్లో సిట్టింగ్‌ అభ్యర్థులను ప్రకటించడం చకా, చక జరిగిపోయాయి.తెలంగాణ ఉద్యమంలో తెగించి కొట్లాడిన ఉద్యమ కారులకు నామినేటెడ్‌ పదవుల్లో అవకాశాలు లభించలేద ని కొందరు, దశాబ్దంగా ఎదిరిచూస్తున్నా ఆశావహులు నిరాశతో సెకండ్‌ క్లాస్‌ తరగతి నాయకులు ప్రతి నియోజక వర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఓటమికి బాగస్వాములైనారు.అయితే 2018 ఫలితాలే ఇప్పుడు పునరావృతం అవుతాయనే అతి విశ్వాసంతో కళంకితులను మార్చకపోయే సరికి తెలంగాణ సమాజంకు చిర్రె త్తింది. ఇక తానా అంటే తందనా అంటూ లేని కాంగ్రెస్‌ గాలి అన్ని నియోజక వర్గాల్లో కవులు,కళాకారులు, ప్రజాస్వామ్య వాదు లు కేసీఆర్‌ పాలన పై దృష్ఫ్రచారానికి కారకులైనారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగనివ్వక పోవడం ఒక కారణమైతే..ప్రతి జిల్లాలో పాతుకుపోయిన ఎమ్మెల్యేల ఆగడాలను,భూకబ్జాలను భరించలేక బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఇచ్చిన ఓటు అనే ఆయుధంతో ‘కారు’ కింద నేల కదిలించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి అవకాశం వచ్చిన ప్రతిసారీ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలకు అవకాశం ఇస్తూనే ఉన్నారు. కేసీఆర్‌ భరోసా ప్రజల్లోకి తీసుకపోవడంలో అభ్యర్థులు విఫలమైనారు.ప్రజల ఆలోచనా సరళి వేగంగా మారుతున్నా సమయంలో స్పష్టమైన ఎజెండాతో ఉంటే తక్కువ సమయంలోనే ప్రజలు ఆదరించే అవ కాశం ఉంది.దమ్ముంటే సిట్టింగ్‌ లకే సీట్లు ఇవ్వండని రేవంత్‌ రెచ్చ గొట్టడం, కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ లో ఇరుక్కున్నారనే అభిప్రాయం ఫలితాలను చూసాక అర్థమయింది. అమలు దేవుడెరుగు కానీ,కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ స్కీం ప్రతి గడపను తట్టింది.దక్షణ భారత్‌లో పై చేయిగా కాంగ్రెస్‌ జవసత్వాలు నింపింది.
` డాక్టర్‌ సంగని మల్లేశ్వర్‌ 9866255355

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు