Thursday, June 13, 2024

మల్కాజ్‌ గిరి ‘గాలి’ సునీత వైపే..!

తప్పక చదవండి
  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై పట్నం దంపతులకు పట్టు
  • రెండు సార్లు రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ గా అనుభవం
  • భర్త మహేందర్‌ రెడ్డికి రవాణమంత్రిగా మంచిపేరు
  • సునీతా మహేందర్‌ రెడ్డిల చేరికతో హస్తం శ్రేణుల్లో జోష్‌
  • అధికార పార్టీలో చేరడంతో పట్నం సునీత వైపే అంతా మొగ్గు
  • మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి లోక్‌ సభ టికెట్‌ ఇచ్చిన అధిష్టానం
  • ఆమె ఎంపీగా గెలువడంపై చెయ్యి గుర్తు పార్టీ ధీమా
  • మ‌ల్కాజ్‌గిరిలో సుడిగాలి ప్రచారం చేస్తున్న సునీత మహేందర్‌ రెడ్డి

పార్లమెంట్‌ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలే టార్గెట్‌ గా కసరత్తు చేస్తుంది. రాష్ట్ర రాజధానిలో ఉన్న మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ ఈ మూడు ఎంపీ స్థానాలపై ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్‌ నియోజకవర్గమైన మల్కాజ్‌ గిరిపై ఉత్కంఠ నెలకొంది. అందులో భాగంగా మల్కాజ్‌ గిరి ఎంపీ స్థానం కాంగ్రెస్‌ సిట్టింగ్‌ కావడమే గాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అక్కడ ఎంపీగా ఉండడంతో ఆ టికెట్‌ ను పోగొట్టుకోకూడదని టీపీసీసీ భావించింది. స్వయంగా సీఎం రేవంత్‌ ఈ స్థానంపై దృష్టిపెట్టాడు. ఇప్పటికే రోడ్‌ షోలు, పలు సభలకు హాజరై ప్రచారం కూడా చేశారు. తాను సీఎం అయినప్పటికీ మల్కాజ్‌ గిరిపై ఉన్న ప్రేమ, అభిమానం పోదని తప్పకుండా మళ్లీ కాంగ్రెస్‌ ను మల్కాజ్‌ గిరి ఎంపీ స్థానంలో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్నం సునీతాకు ఉమ్మడి జిల్లాపై ఉన్న అనుభవంతోనే ఎంపీ టికెట్‌ ఇచ్చినట్లు ఆమెను పార్లమెంట్‌ కు పంపితే ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి మంచిదంటూ చెబుతూ వస్తున్నాడు.

పట్నం దంపతులకు ఫుల్‌ సపోర్ట్‌:
ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంచి పట్టు ఉన్న పట్నం సునీతా మహేందర్‌ రెడ్డినే లోక్‌ సభ అభ్యర్థిగా ప్రకటించింది. రెండు సార్లు రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ గా గెలిచిన సునీతాకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. భర్త మహేందర్‌ రెడ్డి కూడా బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశాడు. పార్టీ ఏదైనా సునీతా మహేందర్‌ రెడ్డిలు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగడం వాళ్లకు ప్లస్‌ పాయింట్‌ గా చెప్పవచ్చు. గతంలో టీడీపీ పార్టీ ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చాలా కాలంగా సేవలందించారు. ఆయా పార్టీల్లో వివిధ పదవులను అనుభవిస్తూ జిల్లాలో డెవలప్‌ మెంట్‌ కార్యక్రమాలు చేస్తున్న పట్నం ఫ్యామిలీపై ప్రజలకు మంచి అభిప్రాయమే ఉంది.

- Advertisement -

పట్నం గాలికి విపక్షాల ఔట్‌
నగరం నడిబొడ్డున ఉన్న మల్కాజ్‌ గిరి ఎంపీ నియోజకవర్గంలో జెండా పాతాలని కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఉవ్విళ్లూరుతున్నాయి. హస్తం అభ్యర్థిగా సునీతా మహేందర్‌ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల రాజేందర్‌ పోటీచేస్తుండగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. వీళ్లద్దరీలో సునీతావైపే ఓటర్లు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఓ వైపు అధికార పార్టీ మరోవైపు పట్నం దంపతుల గాలి చూస్తుంటే భారీ మెజార్టీతో గెలువడం ఖాయంగా కనిపిస్తోంది. పలుసర్వేలు సైతం మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ స్థానం కాంగ్రెస్‌ ఖాతాలో పడనున్నట్లు వెల్లడిరచాయి.

ప్రచారంలో దూసుకుపోతున్న సునీతా మహేందర్‌ రెడ్డి :
హైదరాబాద్‌ లోనే కీలక స్థానమైన మల్కాజ్‌ గిరిలో కాంగ్రెస్‌ జెండా సుస్థిరం చేసేందుకు పట్నం దంపతులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ లో చేరిన తమకు హస్తం అధిష్టానం ఇంత పెద్ద బాధ్యతను తమపైన పెట్టడంపై ఆనందోత్సవంలో ఉన్నారు. నగరం నడిబొడ్డున ఈ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా పట్నం సునీతా అలుపులేని ప్రచారం చేస్తున్నారు. సుదీర్ఘ ప్రచారం చేస్తూ నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. హస్తం పార్టీకి ఎందుకు ఓటెయ్యాల్నో వివరించి చెబుతూ తమను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పగలు, రాత్రి అంతా నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాము చేసిన మంచి కార్యక్రమాలు చూపుతూ ఎంపీగా పార్లమెంట్‌ కు పంపాలని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఎల్బీనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. కొత్తపేట, లింగోజిగూడ డివిజన్లలోని రాజీవ్‌ గాంధీ నగర్‌, భరత్‌ నగర్‌, శివమ్మ నగర్‌, ఆర్టీసీ కాలనీ, మసీద్‌ గల్లీ పరిసర కాలనీలో నిర్వహించిన రోడ్‌ షో చేశారు. ఎల్బీనగర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ మధు యాష్కిగౌడ్‌, మల్‌ రెడ్డి రాంరెడ్డి, శ్రీనివాస్‌ గుప్తా, జక్కిడి ప్రభాకర్‌ రెడ్డి, ముద్దగోని రామ్మోహన్‌ గౌడ్‌, శిల్పారెడ్డి, వజీర్‌ ప్రకాష్‌ గౌడ్‌, లింగాల కిషోర్‌ గౌడ్‌ లతో కలిసి పట్నం సునీత మహేందర్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తమను మల్కాజ్గిరి ఎంపీగా భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు