Sunday, April 28, 2024

బరితెగిస్తున్న వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ..

తప్పక చదవండి
  • బాచుపల్లిలో కోమటి కుంట చెఱువు చెరబట్టి ఎఫ్టీఎల్ లో భారీ అక్రమ నిర్మాణం..
  • సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న విజయ్ కుమార్..
  • డ్రైనేజీ నీటిని చెరువులో వదిలి కలుషితం చేస్తున్న వాసవి నిర్మాణ సంస్థ..
  • ఇందులో ప్లాట్లు కొన్నారా అంతే సంగతులు..
  • వాసవి నిర్మాణ సంస్థ యజమానిపై రెండు కేసులు నమోదైనా
    ఆగని అక్రమ నిర్మాణ పనులు..
  • అక్రమాన్ని సక్రమం చేసే పనిలో అధికార పార్టీ కీలక మంత్రి..
  • సి.ఎస్.ఆర్. నిధులను సైతం దారి మళ్లిస్తున్న వైనం..

బరితెగింపునే తమ ఇంటిపేరుగా మార్చుకున్న వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ యజమాని విజయ్ కుమార్..అక్రమనిర్మాణాలతో ఆరితేరి పోయారు.. నిస్సిగ్గుగా విలువలకు తిలోదకాలిచ్చి, తనకు నచ్చిన చోట,తాను మెచ్చిన చోట నిరభ్యంతరంగా అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నాడు.. దొడ్డి దారిన అనుమతులు సాధించడం ఇతగాడికి వెన్నతో పెట్టిన విద్య.. అటు అధికారులను, ఇటు స్థానిక రాజకీయ నాయకులను అలవోకగా తన దారికి తెచ్చుకునే కుయుక్తులు ఆయన సొంతం.. పర్యావరణానికి విఘాతం కలుగుతుందని తెలిసినా ఈయనగారి అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు.. కాగా ఈ వ్యవహారంపై ఎన్.జి.టి అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకుంటే తప్ప.. చెరువుల పరిరక్షణ కరువు అంటున్నారు పర్యావరణ వేత్తలు..

హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, నిజాం పేట మున్సిపాలిటీ పరిధిలో, బాచుపల్లి శివారులో వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ యజమాని విజయ్ కుమార్ దొడ్డి దారిన నిర్మాణ అనుమతులు పొంది యదేచ్చగా కోమటికుంట చెరువులో భారీ అక్రమ నిర్మాణాన్ని చేసి, అమాయక ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలను కొల్లగొట్టుటకు కుయుక్తులు పన్నుతున్నారని బహిరంగ విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి..అక్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు పలుమార్లు చెరువులో నిర్మిస్తున్న నిర్మాణ పనులు నిలిపివేయాలని హెచ్చరించినా, అధికారుల మాటలు బేఖాతరు చేస్తూ, కాసులకు కక్కుర్తిపడి యదేచ్చగా నిర్మాణ పనులు చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు.. కబ్జాదారుల కబంధ హస్తాల్లో కనుమరుగౌతున్న కోమటి కుంట చెరువును పరిరక్షించుటకు ఇరిగేషన్ ఏ.ఈ. వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ యజమాని విజయ్ కుమార్ పై బాచుపల్లి పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన అవేమీ పట్టించుకోకుండా చెరువులో భారీ భవనాన్ని నిర్మించి కబ్జాకు పాల్పడ్డారు.. అంతటితో ఆగకుండా కోమటి కుంట చెరువును పూడ్చి అందులో పనిచేసే కార్మికులకు షెడ్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేసి మురుగునీటి డ్రైనేజీని చెరువులోకి వదిలారు.. స్థానిక నిజాంపేట మున్సిపల్ కమిషనర్ చెప్పిన వినకుండా యదేచ్చగా నిర్మాణ పనులు కొనసాగించడంతో కమిషనర్ సైతం వాసవి గ్రూప్ యజమాని విజయ్ కుమార్ పై బాచుపల్లి పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.. దీనితో విజయ్ కుమార్ పై రెండు కేసులు నమోదయ్యాయి.. అధికారులు చెరువుల పరిరక్షణకు చర్యలు చేపడితే.. వాసవి అర్బన్ అక్రమాలను సక్రమం చేయుటకు అధికార పార్టీ కి చెందిన కీలక మంత్రి రంగంలోకి దిగి అక్రమాలను సక్రమం చేయుటకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని, అక్రమాలను సక్రమం చేయుటకు వాసవి నిర్మాణ సంస్థ చేసిన కబ్జాను సమర్ధించుటకు వారికి దాసోహం అంటున్న మంత్రి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బుల్టి నిధులను అభివృద్ధి పేరుతో దారి మళ్లిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అలాగే అమాయక ప్రజలు వాస్తవాలను పరిశీలించకుండా చెరువులో కట్టిన నిర్మాణాలలో కొనుగోలు చేసి నష్ట పోయే అవకాశం ఉందని, అమాయక ప్రజలు నష్ట పోకుండా, అక్రమాలను సక్రమం చేయకుండా చట్ట ప్రకారం వాసవి నిర్మాణ సంస్థ యజమానిపై చర్యలు చేపట్టి, అన్యాక్రాంతం అవుతున్న కోమటికుంట చెరువును కాపాడాలని, అమాయక ప్రజలు ఇక్కడ ప్లాట్లు కొని నష్ట పోకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలువురు సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.. ప్రభుత్వం అక్రమ నిర్మాణాన్ని తక్షణమే కూల్చి వేయకపోతే, కోమటి కుంట చెరువును పరిరక్షించక పోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయిస్తామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.. ఎన్.జి.టి అధికారులే క్షేత్ర స్థాయి విచారణ జరపాలని లేకపోతే చెరువుల పరిరక్షణ కష్టమేనని పలువురు పర్యావరణ వేత్తలు వేడుకుంటున్నారు.. వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ చేస్తున్న అక్రమాలకు సంబంధించి, అమాయక ప్రజలకు ఎరవేసి చేస్తున్న మోసానికి సంబంధించి, కొనుగోలు దారులను బురిడీ కొట్టిస్తున్న విషయాలపై.. పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తెనుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘ ‘ మా అక్షరం అవినీతి పై అస్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు