Tuesday, May 7, 2024

ఎంఎన్‌ జే ఆసుపత్రిలో నిధుల గోల్‌ మాల్‌

తప్పక చదవండి
  • ట్రూబీమ్‌ యంత్రం కొనుగోలులో అవకతవకలు..!
  • దర్యాప్తు సంస్థ రంగ ప్రవేశంతో కదులుతున్న డొంక
  • రేడియం మిషన్‌ టెండర్లపై దర్యాప్తు సంస్థ దృష్టి
  • ఇంఛార్జ్‌ డైరెక్టర్‌ జయలత పాత్ర ఉన్నట్లు నివేదికలో వెల్లడి
  • మొదట వివరాలిచ్చేందుకు జయలత ససేమీరా..
  • తర్వాత ఒత్తిడి పెరగడంతో నివేదిక అందజేత
  • 25 ఎంఎం(ఎన్టీఎక్స్‌)హెచ్‌ఎంఎల్సీ మిషన్‌ బదులు.. 5 ఎంఎం ఎస్వీసీ మోడల్‌ మిషన్‌ పంపిణీ
  • అగ్రిమెంట్‌ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిన..
  • అమెరికాకు చెందిన వేరియంట్‌ కంపెనీ
  • దర్యాప్తు సంస్థ ప్రవేశంతో ఎంఎన్‌ జే కేన్సర్‌ ఆసుపత్రి వర్గాల్లో కలవరం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఎంఎన్‌ జే క్యాన్సర్‌ ఆసుపత్రి ట్రూబీమ్‌ యంత్రం కొనుగోలులో స్కాం బయటపడింది. ఏసీబీ రంగ ప్రవేశంతో రేడియేషన్‌ మిషన్‌ కొనుగోలులో గట్టిగనే పర్సంటేజీలు చేతులు మారినట్లు తేలుతోంది. టెండర్‌ లో జరిగిన అగ్రిమెంట్‌ ప్రకారం కాకుండా ఆసుపత్రి డైరెక్టర్‌, అధికారుల అండతో టెండర్‌ దక్కించుకున్న కంపెనీ ఆయాచితంగా లబ్ధిపొందినట్లు స్పష్టమైంది. ఈ విషయంలో ఎంఎన్‌ జే క్యాన్సర్‌ హాస్పిటల్‌ డైరెక్టర్లు జయలత, అప్పటి డైరెక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌ రెండు చేతులా సహకరించినట్లు అర్థమవుతోంది.

క్యాన్సర్‌ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించ్ఱే ఉద్దేశ్యంతో ప్రభుత్వ అనుమతితో ఎంఎన్‌ జే ఆసుపత్రి వర్గాలు టెండర్‌ ప్రతిపాదికన 2013లో ట్రూబీమ్‌ యంత్రాన్ని కొనుగోలు చేశాయి. ఈ యంత్రం కొనుగోలు కోసం అప్పట్లో గ్లోబల్‌ టెండర్లకు ఆహ్వానం పలుకగా.. రెండు కంపెనీలు టెండర్లల్లో పాల్గొన్నాయి. అయితే ఇందులో అమెరికాకు చెందిన వేరియన్‌ మెడికల్‌ సిస్టం ఇంటర్నేషనల్‌ కంపెనీ టెండర్‌ ను దక్కించుకుంది. టెండర్‌ ప్రకారం సదరు కంపెనీ 25 ఎంఎం హెచ్‌ఎఎంఎల్సి డెఫినేషన్‌ గల ట్రూబీం మిషన్‌ ను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ మిషన్‌ ధరను 22 లక్షల 32 వేల 600 యూఎస్‌ డాలర్లుగా అంటే మన దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.14 కోట్ల విలువగా నిర్ణయించడం జరిగింది. ఇందుకు అనుగుణంగానే సదరు కంపెనీ ఇన్వాయిస్‌ ఇచ్చింది. ఇక దీంతో పాటు 2 సంవత్సరాల వారంటీతో పాటు టర్కీ వర్క్స్‌ (సివిల్‌ వర్క్స్‌) రూ.30 లక్షల 10 వేలు, మిషన్‌ మెయింటనెన్స్‌ కింద మరో రూ.6.30 లక్షలు చెల్లించాలని ఒప్పందంలో ఉంది.

- Advertisement -

మొత్తంగా సుమారు రూ.21.53 కోట్లను వివిధ దశల్లో చెల్లించాలని అగ్రిమెంట్‌ కుదిరింది. మిషన్‌ షిప్పింగ్‌ అయ్యాక 80 శాతం, వినియోగంలోకి వచ్చాక సంతృప్తి కలిగితే మిగిలిన డబ్బును చెల్లించాలని స్పష్టంగా ఉంది. వారంటీ పూర్తయ్యే వరకు మొత్తంలో 10 శాతం డబ్బును గ్యారంటీగా కంపెనీ ఉంచాలని పేర్కొంది. ఇదంతా 2013లో నాటి ఎంఎన్‌ జే కేన్సర్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ కన్నన్‌ ఆధ్వర్యంలో కుదిరిన అగ్రిమెంట్‌. అయితే తర్వాత కన్నన్‌ పదవీ విరమణ చేశాక..అసలు తంతు మొదలైంది. ఆయన అనంతరం ఇంఛార్జ్‌ డైరెక్టర్లుగా పుట్టా శ్రీనివాస్‌, ఎన్‌.జయలత బాధ్యతలు స్వీకరించారు. అయితే వీరి కాలంలోనే ట్రూబీమ్‌ మిషన్‌ కొనుగోలులో గోల్‌ మాల్‌ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

మరోవైపు టెండర్లలో 25 ఎంఎం (ఎన్టీఎక్స్‌) హెచ్‌ఎంఎల్సీ మిషన్‌ పంపిణీ చేస్తామని చెప్పిన కంపెనీ డైరెక్టర్లు ఇచ్చిన అండతోనే నిబంధనలకు పాతరేసింది. 25 ఎంఎం మిషన్‌ కు బదులు 5 ఎంఎం ఎస్వీసీ మోడల్‌ మిషన్‌ ను పంపిణీ చేసింది. ఈ రెండు మిషన్ల పనితీరు, ధరలోనూ చాలా వ్యత్యాసాలున్నప్పటికీ 5 ఎంఎం ఎస్వీసీ మోడల్‌ మిషన్నే సప్లై చేయడం గమనార్హం. అయితే ఈ విషయంలో అభ్యంతరం చెప్పాల్సిన ఇంఛార్జ్‌ డైరెక్టర్‌ ఎన్‌.జయలత, అప్పటి డైరెక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌, ఆర్‌ఎస్‌ఓ శ్రీకృష్ణ, ఏఓ లలిత ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సమాచారం. వీరు అతి ముఖ్యమైన 25 ఎంఎం (ఎన్టీఎక్స్‌) హెచ్‌ఎఎంఎల్సీ మిషన్‌ స్థానంలో 5ఎంఎం ఎస్వీసీ మోడల్‌ మిషన్‌ ను కంపెనీ వారు అందజేసినప్పటికీ ఉదాసీనంగా వ్యవహరించడం శోచనీయం. అంతేకాక టెండర్‌ లో పేర్కొన్న నిబంధనలకు గాలికొదిలేసి మిషన్‌ మొత్తం ఉపయోగంలోకి రాకముందే నిబంధనలకు విరుద్దంగా మొత్తం అమౌంట్‌ ను వేరియన్‌ కంపెనీకి చెల్లించేయడం విస్మయం కల్గిస్తోంది. కంపెనీతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని, కమిషన్లు తీసుకున్నట్లు హాస్పిటల్‌ వర్గాలు ఆరోపిస్తున్నారు.

ఈనేపథ్యంలోనే ఈమొత్తం వ్యవహారంపై ఏసీబీ నజర్‌ పెట్టింది. అసలు టెండర్‌ అగ్రిమెంట్‌ ఏంటీ..? చెల్లించిన మొత్తం ఎంత..? నిబంధనలపై దృష్టి సారించింది. అందులో భాగంగానే డైరెక్టర్‌ జయలతకు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే మొదట జయలత వివరాలిచ్చేందుకు ఒప్పుకోనప్పటికీ.. ఏసీబీ అధికారులు ఒత్తిడి పెంచడంతో.. గురువారం తన నివేదికను అవినీతి నిరోధక శాఖ అధికారులకు అందజేశారు. మొత్తం ఈవ్యవహారంలో కోట్ల రూపాయాల స్కాం జరిగినట్లు తెలుస్తుండడంతో.. ట్రూభీమ్‌ మిషన్‌ కొనుగోలులో జరిగిన నిధుల గోల్‌ మాల్‌ పై 5గురి సభ్యులతో కూడుకున్న కమిటీ సమగ్రంగా విచారించి 17-02-2016లో కమిటీ సభ్యులైన డాక్టర్‌ శంకర్‌ మహాదేవ్‌, డాక్టర్‌ ఎం. విజయ్‌ కుమార్‌, డాక్టర్‌ సి. సంజీవ కుమారి, డాక్టర్‌ జోసెఫ్‌ బెంజమిన్‌, డాక్టర్‌ బి. నెహ్రు దర్యాప్తు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అంతేకాకుండ ఈ కొనుగోలు వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కూడా సమగ్రంగా విచారించి వాస్తవాలతో కూడిన రిపోర్ట్‌ ను, అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదికని అందజేయడం జరిగింది. కానీ, నాటి ప్రభుత్వంలో కొందరు నాయకులు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకుండా దోషులతో లాలూచి పడి చర్యలు తీసుకోకుండా, ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో నష్టాన్ని కలిగించారు. ఇప్పటికైనా నూతనంగా ఏర్పడ్డ రేవంత్‌ రెడ్డి సర్కార్‌ అవినీతి అధికారులైన ఇంఛార్జ్‌ డైరెక్టర్‌ ఎన్‌.జయలత, అప్పటి డైరెక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌, ఆర్‌ఎస్‌ఓ శ్రీకృష్ణ, ఏఓ లలిత లపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి, రెవెన్యూ రికవరీ ఆక్ట్‌ ప్రకారం దుర్వినియోగమైన ప్రభుత్వ సోమమును రికవరీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎంఎన్‌ జే ఆసుపత్రిలో జరిగే మరో అవినీతి కుంబకోణంపై పూర్తి ఆధారాలతో మీ ముందుకు తేనుంది.. ఆదాబ్‌ హైదరాబాద్‌.. మా అక్షరం అవినీతిపై అస్త్రం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు