Friday, May 3, 2024

నేటి నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం

తప్పక చదవండి
  • నామినేషన్‌ ప్రక్రియకు అన్ని చర్యలు తీసుకున్నాం
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి
  • ఓటర్లను రెచ్చగొట్టే విధంగా ప్రచారాలు ఉండరాదన్న ఎలక్షన్‌ ఆఫీసర్‌..

వికారాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తీసుకోవాల్సిన అనుమతులు, ఖర్చుల వివరాలు తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రతినిధులను ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు, అసెంబ్లీ బరిలో ఉండే అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి ప్రచారాలు నిర్వహించుకోవాలన్నారు. ప్రచారాలకు ఉపయోగించే వాహనాలు, మైకులు, పాటలకు సంబంధించి ఆడియో, వీడియోలలో ఉన్న సమాచారంతోపాటు సంబంధిత అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతులు పొందాలని కలెక్టర్‌ సూచించారు. అనుమతులకు సంబంధించి కావలసిన ధ్రువ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలన్నారు. అనుమతులు లేకుండా ప్రచారంలో ఉపయోగించే వాహనాలను సీజ్‌ చేయడం జరుగుతుందని, కుల మతాలకు అతీతంగా ప్రచారాలు కొనసాగించాలని అదేవిధంగా ఓటర్లను రెచ్చగొట్టే విధంగా ప్రచారాలు నిర్వహించకూడదని కలెక్టర్‌ సూచించారు. ప్రచారాలు నిర్వహించుకునే పార్టీలు, అభ్యర్థులు రోజువారి ప్రచార వివరాలను అందించి 48 గంటలు ముందుగా రిటర్నింగ్‌ అధికారి వద్ద అనుమతులు పొందాలని కలెక్టర్‌ రాజకీయ ప్రతినిధులకు సూచించారు. నామినేషన్‌ వేసే అభ్యర్థులు ముందుగానే రిటర్నింగ్‌ అధికారిని సంప్రదించి సమర్పించవలసిన ధ్రువపత్రాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఆయన తెలిపారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చులకు సంబంధించి ఎప్పటికప్పుడు రిజిస్టర్లలో నమోదు చేయాలని, ఎన్నికల పరిశీలకులు అభ్యర్థుల ఖర్చుల వివరాలను మూడు దఫాలుగా పరిశీలించడం జరుగుతుందని కలెక్టర్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నికల సమయంలో వ్యవహరించి వివరించాల్సిన విషయాలు అభ్యర్థుల హ్యాండ్‌ బుక్‌ లో అన్ని వివరాలు ఉన్నాయని పార్టీలు, అభ్యర్థులు వాటిని అనుసరించాలని కలెక్టర్‌ సూచించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు