- అద్రాస్ పల్లి గ్రామస్తుల గోడు వినే వారే లేరా..
- అద్రాస్ పల్లి గ్రామ ప్రభుత్వ భూములు వెంటనే కాపాడాలని
గ్రామస్తులు మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన
శామీర్‌పేట్ (ఆదాబ్ హైదరాబాద్): కబ్జాకు గురైన అద్రాస్ పల్లి గ్రామ ప్రభుత్వ భూములు వెంటనే కాపాడాలని గ్రామస్తులు మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. శుక్రవారం మూడుచింతలపల్లి మండలం అద్రాస్ పల్లి గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అద్రాస్ పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 235లో సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేధన చెందారు. గతంలో జిల్లా కలెక్టర్ , తహసీల్దార్ కి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తంచేశారు . ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోందని అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు కబ్జాలనుండి కాపాడాల్సిన అధికారులే కాలయాపన చేస్తూ కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారేమో అన్న సందేహం కలుగుతోందన్నారు. ప్రభుత్వ భూములు కాపాడుకోవడానికి తాము నానా తంటాలు పడాల్సి వస్తోందని ఆవేధన వ్యక్తం చేశారు.
ఇప్పటి కైన జిల్లా కలెక్టర్ స్పందించి, ఈ భూములు సర్వే చేయించి కాపాడాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ భూములు కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో గ్రామ ప్రజలంతా ఏకమై కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.తమ గ్రామంలో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములు కాపాడాలని కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి న్యాయం చేయాలని కోరితే, జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం శోఛనీయం అన్నారు. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసేందుకు కార్యాలయానికి వెలితే నిర్ధాక్షిన్యంగా గ్రామస్తులను వెనక్కి పంపిచారని ఆగ్రహం చెందారు. ధర్నా చేసిన వారి వినతి పత్రం తీసుకోనని, అదనపు కలెక్టర్ కు ఇవ్వమని పంపించడం సిగ్గుచేటన్నారు. బాధ్యత గలజిల్లా కలెక్టర్ ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. అధికారులు పట్టించుకోక పోవడం, ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికావడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెల్తామని పేర్కొన్నారు. గ్రామస్తులంతా కలిసి ముఖ్యమంత్రి ప్రజాదర్బార్లో ఫిర్యాదు చేసి, కబ్జాలపాలైన ప్రభుత్వ భూములు కాపాడుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్రాస్పల్లి ఉపసర్పంచ్ గ్యార జహంగీర్, గ్రామస్తులు ఎల్ల ప్రసాద్, బోయిని నర్సింహ్మ, ఎన్. ధయాకర్, డి. మహి, దొండ రాజు, ఆది రమేష్, ఆర్. వెంకటేష్, నాగరాజు స్వామి, శ్రీపతి, జి.కుమార్, తదితరులు పాల్గొన్నారు.