Monday, May 6, 2024

కుషాయిగూడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు ..

తప్పక చదవండి

హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్ ):- వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈసీఐఎల్,కుషాయిగూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారు జామునే స్వామివారి దర్శనంకోసం భక్తులు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం వద్ద బారులు తీరారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులకు స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కుషాయిగూడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పలువురు ప్రముఖులు,భక్తులు, వ్యాపారవేత్తలు తరలివచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో స్థానిక ప్రజా ప్రతినిధులు,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవో మటం వీరేశం మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు.స్వామి వారికీ నైవేద్యంగా చెక్కర పొంగలి,కట్టే పొంగలి,పులిహోర, లడ్డు సమర్పించినట్లు ఆలయ ఈవో మటం వీరేశం తెలిపారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అయన అన్నారు. భక్తులకు సంతృప్తికర దర్శనం కల్పించడంలో కుషాయిగూడ టీటీడీ ఆలయ సిబ్బంది సఫలీకృతమైందని, సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రముఖ పూజారులు రమణాచార్యులు, లక్ష్మణాచార్యులు, వేణుగోపాల్,నారాయణలతో పాటు పలువురు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు