Wednesday, April 24, 2024

తెలుగు రాష్ట్రాలకు ముక్కోటి శోభ..

తప్పక చదవండి
  • వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు ..
  • తిరుమలకు క్యూ కట్టిన ప్రజాప్రతినిదులు, వీఐపీలు
  • భక్తులతో కిటకిటలాడుతున్న ప్రధాన ఆలయాలు

హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జామునే స్వామివారి దర్శనంకోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం.

భద్రాద్రి ఆలయంకు భక్తులు పోటెత్తారు.
ఉదయం 5గంటల నుంచే ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. భక్తులకు గరుడవాహనంపై రాముడు, గజవాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణుడు దర్శనం ఇస్తున్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారు జామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహాక్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జామున భారీ సంఖ్యలో తరలివచ్చారు.

- Advertisement -

తిరుమలకు క్యూ కట్టిన వీఐపీలు ..
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తులు పోటెత్తారు. తిరుమలలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. దీంతో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి పలువురు ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవీంద్రబాబు, జస్టిస్ సుబ్బారెడ్డి, జస్టిస్ సుజాత, జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పలువురు మంత్రులతోపాటు ఎంపీలు మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేశ్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేశ్, మాజీ మంత్రి నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇదిలాఉంటే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వేకువజామునే శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులు స్వామివారిని దర్శించుకుని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. భక్తులకు సంతృప్తికర దర్శనం కల్పించడంలో టీటీడీ సఫలీకృతమైందని, సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు