Monday, April 29, 2024

రాజకీయాలకు దూరంగా…

తప్పక చదవండి
  • టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుల నియామకంపై ఫోకస్‌
  • పటిష్టంగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సంస్థ
  • నిబద్దత కలిగిన అధికారిని ఛైర్మన్‌గా నియమించే ఛాన్స్‌
  • కసరత్తు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి
  • గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో లీకులే లీకులు
  • ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

హైదరాబాద్‌ : ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ ఫోకస్‌ పెట్టింది. ప్రధానంగా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. దీనిని పకడ్బందీ సంస్థగా తయారు చేసి, సమర్థులైన అధికారులను నియమించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగులకు భరోసా కల్పించే ప్రయత్నంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే యూపిపిఎస్సీ ఛైర్మన్‌ను కలసి అక్కడ అనుసరిస్తున్న విధానాలను సీఎం తెలుసుకున్నారు. అదే తరహాలో సర్వీస్‌ కమిషన్‌ను పునరుద్దరించాలని చూస్తున్నారు. రిటైర్ట్‌ లేదా సర్వీసులో ఉన్న నిబద్దత కలిగిన ఐఎఎస్‌ లేదా ఐపిఎస్‌ను ఛైర్మన్‌గా వేసి పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. సభ్యులను కూడ రాజకీయాలతో సంబంధం లేని వారిని, నిష్ణాతులను, అకడమిక్‌ అనుభవం ఉన్నవారిని వేసే ఆలోచనలో సీఎం ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరీక్ష పేపర్లు లీక్‌ కావడంతో కమిషన్‌ అభాసుపాలయ్యింది. ఐఎఎస్‌ అధికారి ఛైర్మన్‌గా ఉన్నా లాభం లేకుండా పోయింది. పేపర్ల లీకేజీల వ్యవహారంలో నాటి కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కలేదు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం పోరాడుతున్నా పట్టించుకోలేదు. సరికాదా లక్షా 40వేల ఉద్యోగాలను భర్తీ చేశామని బుకాయిస్తూ వచ్చారు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా భర్తీ చేశారన్నదానికి సమాధానం లేదు. అందుకే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్దిని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఓకే చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఆ తర్వాత ఐదు గ్యారంటీల అమలుకు ముందడుగు వేసింది. ప్రజాపాలన ` అభయహస్తం పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొంది. ఫిబ్రవరి లోనే ఉద్యోగాల నియామకాలు మొదలు పెడుతామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. దీంతో ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం లక్షలాది విద్యార్థులు ఎదురుచూస్తున్న పరిస్థితి. టీఎస్పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామా ఆమోదంతో ఉద్యోగాల నియామకాలకు అడ్డంకులు తొలగిపోయాయి. అతి త్వరలో టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్‌, సభ్యులను సర్కార్‌ నియమించనుంది. చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌ ఆఫీసర్‌ను నియమించే అవకాశం ఉంది. ఇటీవలే యూపీఎస్సీ ఛైర్మన్‌ను సీఎం రేవంత్‌ కలిసిన విషయం తెలిసిందే. పారదర్శకంగా బోర్డు ఉండేలా కసరత్తు చేపట్టారు. ప్రతీ సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. టీఎస్పీఎస్సీ బోర్డులో చైర్మన్‌తో పాటు 10 మంది సభ్యులు ఉండనున్నారు. బోర్డులో ఉండాల్సిన నిపుణుల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. సీఏం విదేశీ పర్యటన తర్వాత కొత్త బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.ఈ క్రమంలో తెలంగాణ సర్వీస్‌ కమిషన్‌పై సిఎం రేవంత్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు