ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా అతీత శక్తిగా ఎదుగుతోంది. ఐసీసీ ఫైనల్స్ చేరిందంటే చాలు కప్పుతో ఇంటికి వెళ్లడం ఆ జట్టుకు పరిపాటి అయింది. మెగా టోర్నీల్లో తమకు తిరుగులేదని కంగారు జట్టు మరోసారి నిరూపించింది. భారత గడ్డపై పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆసీస్ వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఈ ఏడాది ఆస్ట్రేలియాకు ఇది మూడో ఐసీసీ ట్రోఫీ కావడం విశేషం. జూన్‌లో ఇంగ్లండ్ గడ్డపై కమిన్స్ సారథ్యంలోని ఆసీస్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో విజేతగా అవతరించింది. మేగ్ లానింగ్ కెప్టెన్సీలోని మహిళల జట్టు టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. కమిన్స్ బృందం వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించడంతో ఆసీస్ ఖాతాలో మూడు ఐసీసీ ట్రోఫీలు చేరాయి.

టెస్టు గదతో కమిన్స్ బృందం పురుషుల, మహిళల ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకూ 20 వరల్డ్ కప్ టైటిళ్లు గెలిచాయి. ఇదొక్కటి చాలు ఆసీస్ ఎంతటి ప్రమాదకరమైన జట్టో చెప్పడానికి. పెద్ద మ్యచులలో దూకుడే మంత్రగా ప్రత్యర్థులను మట్టికరిపించే ఆసీస్ వరల్డ్ కప్ ఫైనల్లోనూ అదే చేసింది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కమిన్స్ సేన.. ఫేవరేట్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో గెలుపొంది ఆరోసారి వరల్డ్ కప్ ట్రోఫీని దక్కించుకుంది.

ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ అనూహ్యంగా ఓటమి పాలైంది. టాస్ ఓడిన భారత్‌ను శుభ్‌మన్ గిల్(4) వికెట్ తీసి మిచెల్ స్టార్క్ దెబ్బకొట్టాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ(47)ను కమిన్స్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్(66), విరాట్ కోహ్లీ(56) ఇన్నింగ్స్ నిర్మించడంతో భారత్ 240 పరుగులు చేసింది.ట్రావిస్ హెడ్(137) లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(137) శతకంతో చెలరేగాడు. డేవిడ్ వార్నర్(7), మిచెల్ మార్ష్(15), స్టీవ్ స్మిత్(4) ఔటైనా.. పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో నిలబడ్డ హెడ్ కేవలం 120 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 137 పరుగులు చేశాడు. మార్నస్ లబూషేన్(58)తో కలిసి నాలుగో వికెట్‌కు 192 పరుగులు జోడించి ఆసీస్‌ను గెలుపు వాకిట నిలిపాడు. దాంతో, సొంతగడ్డపై రెండోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడాలన్న భారత జట్టకు కల కలగానే మిగిలింది. ఆరో ట్రోఫీతో ఆసీస్ ఏ జట్టుకు అందనంత ఎత్తులో నిలిచింది.