Saturday, May 4, 2024

కరోనా కొత్త వేరియంట్‌తో ఎపి అప్రమత్తం

తప్పక చదవండి
  • శబరి యాత్రలకు వెళ్లే వారికి హెచ్చరికలు

విజయవాడ : పొరుగు రాష్ట్రం తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ కేసులు 14 నమోదు కాగా, ఏపీలోనూ ఆందోళన మొదలైంది. దీంతో ఆరోగ్యశాఖ అప్పరమత్తం అయ్యింది. అయితే, ఏపీలో ఇప్పటివరకూ కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. అయితే, కేరళ వంటి రాష్టాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో మనం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. శబరిమలై యాత్రకు వెళ్లే భక్తులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. పండుగ సీజన్ల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించినా, స్థానిక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకుని ఆరోగ్య పరిస్థితి నిర్దారించుకోవాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో ఉన్న విలేజ్‌ క్లినిక్స్‌ అన్నింటికీ యాంటీజెన్‌ టెస్ట్‌ కిట్స్‌ ఇప్పటికే అందజేశామని, అక్కడ ఏదైనా పాజిటివ్‌ నిర్దారణ అయితే, దానిని ఆర్టీపీసీఆర్‌ టెస్టుకు పంపేందుకు వీలుగా రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలల్లో పరీక్షలకు అవసరమైన సౌకర్యాలు సిద్ధంగా ఉంచామన్నారు. అక్కడ కూడా పాజిటివ్‌ అని తేలితే విజయవాడలోని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కు పంపి వేరియంట్‌ ను గుర్తించి వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడిరచారు. కేరళ, తమిళనాడు తరహాలో ఏపీలో ఇప్పటివరకూ ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, అయితే, ప్రజలు ముందు జాగ్రత్తలు చర్యలు పాటించడం మేలని సూచించారు. బయటకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించడం, జన సమూహం ఉన్న ప్రాంతాల్లో ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించాలని సూచించారు. తరచూ చేతులు కడుక్కోవడం, పరిశుభ్రతను పాటించడం వంటి వాటి ద్వారా వ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చని చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేరళలో కరోనా కొత్త వేరియంట్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో ఏపీ నుంచి ఈ సీజన్‌ లో కేరళ వెళ్లి వచ్చే అయ్యప్ప భక్తులకు అధికారులు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శబరిమల నుంచి వచ్చే భక్తులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు చెప్పారు. ఇందు కోసం 12 మెడికల్‌ కళాశాలల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ’ప్రతీ గ్రామ సచివాలయానికి 10 ర్యాపిడ్‌ కిట్లు పంపించాం. ఫీవర్‌ ఉన్న వారికి ర్యాపిడ్‌ కిట్లతో ముందుగా పరీక్షలు చేస్తాం. ఇందులో పాజిటివ్‌ వస్తే ఆ శాంపిల్స్‌ ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్స్‌ కు పంపుతాం. పాజిటివ్‌ నిర్దారణ అయిన వారిలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ తెలుసుకునేందుకు విజయవాడలోని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబులో పరీక్షలు చేస్తాం.’ అని పేర్కొన్నారు. కరోనా న్యూ వేరియంట్‌ జేఎన్‌ 1లో జ్వరం, పొడి దగ్గు, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్‌ కంటే వేగంగా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతోందని, అయినా ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని చెబుతున్నారు. అయితే, మాస్క్‌ ధరించడం, జన సమూహం ఉన్న ప్రాంతాల్లో ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించాలని సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని అంటున్నారు. ఏపీలో 33 వేలకు పైగా ఆక్సిజన్‌ బెడ్స్‌, 6 వేలకు పైగా ఐసీయూ బెడ్స్‌, వెంటిలేటర్స్‌, కొవిడ్‌ మందులకు కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు