Friday, May 10, 2024

శివుడి పేరిట అభయహస్తం అర్జీ..

తప్పక చదవండి
  • శివుడి ఆలయం కోసం ఇందిరమ్మ ఇల్లు కావాలని అర్జీ
  • అసలు విషయం తెలిసి పశ్చాత్తాపడుతున్న విమర్శకులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణలో ఓ విచిత్ర సన్నివేశం చోటు చేసుకుంది.. చివరి రోజు ఓ గ్రామంలో శివుడి పేరిట దరఖాస్తు రావడం చర్చనీయాంశంగా మారింది.. ఈ కోట్లాది దరఖాస్తుల్లో ‘శివయ్య’ పేరుతో వచ్చిన ఓ దరఖాస్తు అందరి దృష్టిని ఆకర్షించింది. భార్య పేరు పార్వతీ దేవి, కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడిగా దరఖాస్తులో నింపారు. ఆ దరఖాస్తుదారుడి వివరాలు ఆరా తీయగా.. హాట్ టాపిక్‌గా మారిన ఈ దరఖాస్తు వెనుక కదిలించే కారణం వెలుగులోకి వచ్చింది…ఇంతకీ సంగతేంటంటే.. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన సామాన్యుడు ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి ‘శివుడి’ పేరుతో ఈ దరఖాస్తు పెట్టారు. గ్రామంలోని త్రికూటేశ్వర ఆలయానికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 12వ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న అతి పురాతన, అరుదైన, అద్భుతమైన ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోకుండా పోయింది. సురేందర్ రెడ్డితో పాటు గ్రామస్థులను అది ఎంతగానో బాధిస్తోంది. అయితే, సురేందర్ రెడ్డి అందరిలా చూస్తూ ఊరుకోలేదు.

6 గ్యారెంటీల పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్న వేళ ఆయనకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా దేవుడి పేరుతో దరఖాస్తు సమర్పించారు. వివరాల్లో దేవుడి పేర్లనే రాశారు. ఫోటో అతికించాల్సిన చోట కూడా శివుడి ఫోటోనే పెట్టారు. ఆలయంలో పురోహితుడి కోసం గది లేదని, ఆ గది కోసం ‘ఇందిరమ్మ ఇల్లు’ కావాల్సిందిగా దరఖాస్తు చేశానని సురేందర్ రెడ్డి తెలిపారు. కరెంట్ బిల్లు కోసం ‘గృహజ్యోతి’ కావాల్సిందిగా టిక్ చేశానని ఆయన చెప్పారు. రాష్ట్రకూటుల కాలంలో ఆ ఆలయాన్ని నిర్మించి, విగ్రహాలను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ప్రజాపాలన చివరి రోజైన జనవరి 6న వచ్చిన ఈ అప్లికేషన్ అధికారులను ఆశ్చర్యపరిచింది. దేవుడి ఫోటో పెట్టిన దరఖాస్తును అధికారులు ఎలా తీసుకుంటారని పలు అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ సురేందర్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. అలా చేయడంలో ఎలాంటి లాభాపేక్ష గానీ, దురుద్దేశం గానీ లేదని స్పష్టం చేశారు. కేవలం ఆలయ అభివృద్ధి కోసమే చేశానని నిజాయతీగా అంగీకరించారు. అంతేకాదు.. ‘ఇది నేను స్వయంగా చేశా. అధికారులకు గానీ, ఇతరులెవరికీ గానీ ఈ అప్లికేషన్‌తో సంబంధం లేదు. ఏం జరిగినా దీనికి నేనే పూర్తి బాధ్యత వహిస్తాను’ అంటూ సురేందర్ రెడ్డి నిర్భయంగా చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు