- రాంగ్ రూట్ లో వచ్చి బైక్ ను ఢీ కొట్టిన అగ్రజ్
- ఇద్దరికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
- మద్యం మత్తులో యువకులు హల్‌చల్
- కారు నడిపిన మాజీ మంత్రి సమీప బంధువు?
హైదరాబాద్ లోని కేపీహెచ్బీలో సోమవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్ లో వచ్చి ఓ బైక్ ను ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణం కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమేనని పోలీసులు తెలిపారు. అగ్రజ్ రెడ్డి అనే యువకుడు రాంగ్‌రూట్‌లో అతివేగంగా కారు నడుపుతూ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో అగ్రజ్ రెడ్డితో పాటు కార్తీక్, తేజ అనే యువకులు కూడా ఉన్నారు. వీరు గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో పార్టీ చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన అగ్రజ్ రెడ్డి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీప బంధువు తెలుస్తోంది.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు అగ్రజ్ రెడ్డికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 90 పాయింట్లు వచ్చాయి. దీంతో అతడు మద్యం మత్తులో వాహనం నడిపినట్లు గుర్తించి పలు సెక్షన్ల కేసు నమోదు చేశారు. ప్రజాప్రతినిధుల వారసులు ఇలా మితిమీరిన వేగంతో ఇష్టారీతిగా వాహనాలు నడుపుతుంటే రోడ్లపై తిరగాలంటేనే భయమేస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.