Monday, May 13, 2024

ప్రజావాణికి వినతుల వెల్లువ..

తప్పక చదవండి
  • తెల్లవారుజాము నుంచే ప్రజాభవన్‌ ముందు బారులు
  • ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం
  • ఇచ్చేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు
  • కిలోమీటర్‌ మేర అర్జీదారుల బారులు

ప్రజాసమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వానికి తమ కష్టాలు చెప్పుకుని వినతులు ఇచ్చేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలె ప్రజాభవన్‌కు నేడు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అర్జీలు ఇచ్చేందుకు వచ్చే వారితో దాదాపు కిలోమీటర్‌ మేర క్యూ ఏర్పడింది. గతంలో ప్రజాదర్బార్‌గా ఉన్న పేరును రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజావాణిగా మార్చి ప్రతి మంగళ, శుక్రవారాల్ల నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యక్రమం జరగనున్నా.. 10 గంటల వరకు వచ్చిన వారికే అర్జీలు ఇచ్చే అవకాశం ఉండడంతో తెల్లవారుజాము నుంచే ప్రజాభవన్‌కు చేరుకున్నారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలను నియంత్రించడం ప్రజా భవన్‌ వద్ద ఉన్న భద్రతా సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. ప్రజావాణిలో ఎక్కువగా భూమి సంబంధిత సమస్యలు, ధరణి, ఆరోగ్యం, నిరుద్యోగం, పింఛన్లు, ఇళ్లు వంటి అంశాలపైనే ఎక్కువ దరఖాస్తులు వస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రజావాణి కార్యక్రమం కేవలం ప్రజా భవన్‌లోనే నిర్వహించడం వల్ల రాష్ట్రం మొత్తం నుంచి ప్రజలు అందరూ హైదరాబాద్‌కే రావాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజా భవన్‌లోనే కాకుండా నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలతో ప్రజావాణి నిర్వహిస్తే బాగుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజావాణి నియోజకవర్గాల్లోనూ నిర్వహించడం వల్ల స్థానిక సమస్యలు ఎక్కడికక్కడే త్వరగా పరిష్కారమవడమే కాకుండా ప్రజలకు హైదరాబాద్‌ దాకా వచ్చే ఇబ్బంది కూడా ప్రజలకు తగ్గుతుందని పేర్కొంటున్నారు. దీంతో ప్రజాభవన్‌ వద్ద రద్దీ తగ్గి ఇక్కడి యంత్రాంగం మీద ఒత్తిడి తగ్గే అవకాశముంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు