Tuesday, April 30, 2024

పెట్రోల్‌, డీజిల్‌పై చేతులెత్తేసిన కేంద్రం

తప్పక చదవండి

పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్జీ తదితర చమురు ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు ఆలోచనేమీ లేదని కేంద్ర ఆర్థికశాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర తగ్గుముఖం పట్టిందని, దేశీయంగా ఫ్యుయల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించే పరిస్థితి లేదన్నారు. దేశీయ అవసరాల కోసం 85 శాతం విదేశాల నుంచే ముడి చమురు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. గ్లోబల్‌ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలను బట్టే.. దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నిర్ణయిస్తారు. సోమవారం ఫ్యూచర్స్‌ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 76.40 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో గతేడాది మే నెలలో కేంద్ర ప్రభుత్వం ముడి చమురు దిగుమతిపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించింది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.8, లీటర్‌ డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.33.61 లక్షల కోట్ల పన్ను (సవరించిన అంచనా) వసూళ్లకు కట్టుబడి ఉన్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 20 శాతం, పరోక్ష పన్ను వసూళ్లలో ఐదు శాతం గ్రోత్‌ నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల డేటా తమ వద్ద అందుబాటులో ఉందని ఆ అధికారి చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.30.54 లక్షల కోట్ల పన్ను వసూళ్లు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10.1 శాతం పెరుగుతాయని కేంద్రం అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పన్ను వసూళ్లు రూ.33.61 లక్షల కోట్లు ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.18.23 లక్షల కోట్లు, పరోక్ష పన్నుల రూపంలో రూ.15.38 లక్షల కోట్లు వసూలవుతాయని కేంద్రం అంచనా వేస్తున్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు