Sunday, May 5, 2024

నిప్పులు చిమ్ముతూ…

తప్పక చదవండి
  • పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం
  • న్యూ ఇయర్‌లో ఇస్రో మరో ఘనత
  • ఆదిత్య మిషన్‌ సక్సెస్‌గా సాగుతోందన్న ఇస్రో ఛైర్మన్‌
  • అభినందనలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి

శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల అంటే బ్లాక్‌హోల్‌ అధ్యయనమే లక్ష్యంగా పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ను ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ధావన్‌ రాకెట్‌ ప్రయోగ కేంద్రం నుంచి నిప్పులుచిమ్ముతూ రోదసీలోకి దూసుకెళ్లిన వాహకనౌక 21.5 నిమిషాల్లో నిర్ధేశిత కక్ష్యలోకి అత్యాధునిక ఎక్స్‌పోశాట్‌ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. దీంతోపాటు మరో పది ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్తున్నది. ఖగోళ శాస్త్రంలో సరికొత్త చరిత్రకు ఇస్రో నాంది పలుకబోతున్నది. ఇది భారత్‌ తొలి పొలారిమెట్రీ మిషన్‌ కాగా.. ప్రపంచంలో రెండోది. ఇంతకు ముందు ఈ తరహా మిషన్‌ అమెరికా చేపట్టింది. సవాళ్లతో కూడుకున్న పల్సర్‌లు, బ్లాక్‌హోల్‌ ఎక్స్‌ రే బైనరీలు, యాక్టివ్‌ గెలాక్సీ న్యూక్లియోలు, న్యూట్రాన్‌ స్టార్స్‌, నాన్‌ థర్మల్‌ సూపర్‌ నోవా అవశేషాలతో సహా విశ్వంలో గుర్తించబడిన 50 ప్రకాశవంతమైన మూలాలను ఎక్స్‌పోశాట్‌ అధ్యయనం చేయనున్నది. ఈ ఉపగ్రహాన్ని 500-700 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార దిగువ భూ కక్ష్యలో ప్రవేశపెడుతారు. ఐదేండ్లపాటు సేవలందించనున్న ఎక్స్‌పోశాట్‌లో రెండు పేలోడ్స్‌ ఉన్నాయి. పాలీఎక్స్‌ (ఎక్స్‌కిరణాలలో పొలారిమీటర్‌ పరికరం), ఎక్స్‌రే స్పెక్టోస్రోపీ, టైమింగ్‌ (ఎక్స్‌పెక్ట్‌`ఎక్స్‌స్‌పీఈసీటీ)ను అమర్చారు. పాలీఎక్స్‌ను రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేయగా, ఎక్స్‌పెక్ట్‌ను యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌కు చెందిన స్పేస్‌ ఆస్ట్రానమీ గ్రూప్‌ రూపొందించింది. ఖగోళ వస్తువులు, తోకచుకుల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని ఎక్స్‌పోశాట్‌ సేకరించనున్నది. ఇకపోతే ఆదిత్య ఎల్‌1 మిషన్‌ సక్సెఫుల్‌గా సాగుతోందని ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ తెలిపారు. నిర్దేశిత ఎల్‌ 1 పాయింట్‌ వద్దకు ఆదిత్య ఉపగ్రహం జనవరి ఆరో తేదీన చేరుకోనున్నట్లు ఇస్రో చీఫ్‌ వెల్లడిరచారు. ఇవాళ పీఎస్‌ఎల్వీ సీ58 ఎక్స్‌పోశాట్‌ మిషన్‌ ప్రయోగం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడిరచారు. ఎక్స్‌పోశాట్‌ ద్వారా కృష్ణ బిల్హాల అధ్యయనం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఎక్స్‌ రే పోలారిమెట్రీ మిషన్‌ విశిష్టమైందని, ఈ మిషన్‌ అందించే డేటాను అధ్యయనం చేసేందుకు సుమారు 100 మంది శాస్త్రవేత్తలను కూడా రిక్రూట్‌ చేస్తున్నట్లు ఇస్రో చీఫ్‌ తెలిపారు. బ్లాక్‌ హోల్స్‌ గురించి ఆ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా స్టడీ చేయనున్నట్లు చెప్పారు.

ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాకెట్‌ విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేతలను ఆయన అభినందించారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అగ్రరాజ్యం అమెరికా తర్వాత బ్లాక్‌ హోల్స్‌ను అధ్యయనం చేయడానికి అబ్జర్వేటరీ ఉపగ్రహం ఉన్న రెండో దేశంగా భారత్‌ అవతరించిందని కొనియాడారు. ఆంగ్ల నూతన సంవత్సరం రోజు మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో రోదసీలో భారత పతాకాన్ని ఎగుర వేసిందన్నారు. ఈ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో మరో శిఖరం చేరిందన్నారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు