Saturday, April 27, 2024

తెలంగాణ జిల్లాల్లోని అనేక గ్రామాల్లో ” బొడ్రాయి” ప్రతిష్ఠాపన మహోత్సవాలు

తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోని అనేక గ్రామాల్లో “బొడ్రాయి ” ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రవేశించగానే ప్రతి ఊరిలో ” బొడ్రాయి” కన్పిస్తుంది.ఆ ” బొడ్రాయి” ని గ్రామ దేవతగా భావించి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, గుమ్మడి కాయలు వేప కొమ్ములతో పూజిస్తారు.ఆ ఊరి ” బొడ్రాయి” ఆ ఊరి ఆడబిడ్డ గా భావించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మొక్కలు మొక్కుతారు. ఆ ఊరికి అంటువ్యాధుల నుండి కాపాడే దేవతగా ప్రజల విశ్వాసం. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, మహంకాళమ్మ మొదలైన ఎనిమిది మంది అక్కాచెల్లెళ్ళ కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆషాడ, శ్రావణ మాసాలలో బోనాలు చేయడం పోతరాజు ఎనిమిది మంది అక్కాచెల్లెళ్ళకు ఒక్కడే తమ్ముడని పోతరాజు వేషధారణలో నృత్యాలు చేయడం యువతీ, యువకులు చిన్న, పెద్ద తేడా లేకుండా ఆనందోత్సాహాలతో బోనాల పండుగను జరుపుకోవడం మనందరికీ తెలిసిందే.ఆషాఢ మాసంలో హైదరాబాద్ గోల్కొండ లో ప్రారంభమైన బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు , లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు తర్వాత మిగతా గ్రామాలలో శ్రావణ మాసంలో బోనాలు నిర్వహిస్తారు. బోనాల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో ” “బొడ్రాయి ” ప్రతిష్ఠామహోత్సవం పెద్ద యెత్తున గ్రామ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ” బొడ్రాయి ” పాతది తీసివేసి కొత్తది ప్రతిష్ఠామహోత్సవం పెద్ద యెత్తున ఘనంగా నిర్వహిస్తున్నారు.కొత్త ” బొడ్రాయి” పై గ్రామాల్లోని ఆడబిడ్డలు రాగి, వెండి, బంగారు తమ తాహతు ను బట్టి కొత్త చెంబు,సరువ,బిండె తో నీళ్ళు పోయడం వల్ల తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్ళకు ఇంటిల్లిపాదికి, గ్రామానికి శుభం జరుగుతుందని ఆడబిడ్డలను, చుట్టాలను పిలుచుకొని మూడు రోజులు ఆనందంతో జరుపుకుంటున్నారు. మొదటి రోజు గణపతి పూజ తో మొదలుకొని నవధాన్యాలు చల్లడం ఊరిని దిగ్బంధన చేయడం మూడవరోజు ( చివరి రోజు) బోనాలు సమర్పించడం ఆడబిడ్డలకు వడిబియ్యం పోయడం చేస్తున్నారు. మూడు రోజుల ” బొడ్రాయి” ప్రతిష్ఠామహోత్సవం సందర్భంగా మేకలు, గొర్రెలు,చేపలు, కోళ్ళు వండుకొని తింటూ ఇంటిల్లిపాది బంధువులతో కలిసి మెలిసి ఆనందంగా గడుపుతున్నారు. బ్రాహ్మణులకు మొక్కులు సమర్పించుకోవడం ఇండ్లకు వేపకొమ్మలు కట్టడం చేస్తున్నారు.

“బలగం ” సినిమా,” ప్రతి రోజు పండుగే “సినిమా ఇతర కుటుంబ సమేతంగా ప్రదర్శిస్తున్న సినిమాల ప్రభావం ప్రజలపై ఎక్కువగా పని చేస్తుంది.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు ఈ తరానికి తెలియకుండా పోతున్నాయి.” బొడ్రాయి” ప్రతిష్ఠాపన” మహోత్సవాలతో విద్యార్థిని, విద్యార్థులకు పాత పద్ధతులను పరిచయం చేయడానికి” బొడ్రాయి” ప్రతిష్ఠామహోత్సవం చక్కగా ఉపయోగపడుతుంది. అనేక మంది అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ములు, అత్తమామలు విడిపోయిన అనేక కుటుంబాలకు ” బొడ్రాయి” ప్రతిష్ఠామహోత్సవం కలిసిమెలిసి ఉండేలా చేస్తుంది. “బొడ్రాయి” ప్రతిష్ఠామహోత్సవం సందర్భంగా నగరాలలో ఉండి చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులు, వివాహాలు జరిగి అత్తారింటికి వెళ్ళిన ఆడబిడ్డలు, అల్లుళ్ళు,బావలు, బావమరుదులు,మరదళ్ళు అందరూ మూడు రోజులు సందడి సందడిగా సంబరాలు చేసుకుంటున్నారు. కుల, మతాలకు అతీతంగా పేద, మధ్యతరగతి,ధనిక బేధం లేకుండా గ్రామంలోని ప్రజలందరు సంతోషంగా మూడు రోజులు ” “బొడ్రాయి ” ప్రతిష్ఠాపన మహోత్సవాలను జరుపుకుంటున్నారు. యాంత్రిక జీవనంలో ” బొడ్రాయి” ప్రతిష్ఠామహోత్సవం ప్రజలందరికీ సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార, వ్యవహారాలను తెలియజేస్తుంది. కోళ్ళ, మేకల, గొర్రెల, చేపల, పాలు, పెరుగు, నిత్యావసర వస్తువులను విక్రయించే వ్యాపారులకు ” బొడ్రాయి” ప్రతిష్ఠాపన మహోత్సవాల మూడు రోజులు కిక్కిరిసిన జనంతో నిండిపోతున్నాయి. యువకులు సాయంత్రం సమయంలో వాలీబాల్,పుట్ బాల్, టెన్నిస్ ఆడుతూ, పాడుతూ ఆనందంగా గడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో “బొడ్రాయి” ప్రతిష్ఠాపన మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు “శుభ ” కార్యాలకు వెళ్ళేటప్పుడు ” బొడ్రాయి”ని మొక్కి పోతే తప్పకుండా విజయం సాధిస్తామని విశ్వాసం.

- Advertisement -

డాక్టర్. ఎస్. విజయ భాస్కర్, సైదాబాద్, హైదరాబాద్-59., 9290826988..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు