Tuesday, February 27, 2024

పట్టణ గాలి కాలుష్య నివారణలోఎలక్ట్రిక్‌ బస్సులు సత్ఫలితాలు ఇచ్చేనా..!

తప్పక చదవండి

ఢిల్లీ , ఫరీదాబాదు, బాగుసరాయ్‌, బహదూర్‌ఘర్‌, బివాండీ, బికనీరా, నోయిడా లాంటి భారత నగరాలు అత్యంత గాలి కాలుష్య సంక్షోభంలో చిక్కుకొని ప్రజారోగ్యాన్ని హరిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. భారత మగానగరాలన్నీ గరళ గాలి మబ్బులు కమ్మి నగరవాసుల ఊపిరిని తీయడానికి కాచుకొని ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాల సీజన్లో ఏయిర్‌ క్వాలిటీ, పిఎం2.5 (పార్టికులేట్‌ మ్యాటర్‌-2.5) గాఢతలు ప్రమాదకర స్థితులకు చేరడంతో విద్యాలయాలకు కూడా ప్రత్యేక సెలవులు ప్రకటించే దుస్థితులను చూస్తున్నాం. ‘లోకల్‌ క్లైమెట్‌ ఆక్చన్‌ సమిట్‌’ పేరుతో కోప్‌-28 సమావేశాల్లో ప్రత్యేక చర్చలు చేసి నగరాల గాలి కాలుష్యాలను తగ్గించడానికి పలు నిర్ణయాలు తీసుకోవడం చూసాం. ఇదే క్రమంతో వాతావరణ మార్పులకు చెక్‌ పెట్టే లక్ష్యంతో భారత కేంద్ర ప్రభుత్వం సరి కొత్త ‘పిఎం ఈ-బస్‌ సేవా స్కీమ్‌’ పథరడకాన్ని ప్రవేశపెట్టి దేశంలోని ముఖ్యమైన 100 నగరాల్లో 10,000 విద్సుత్‌ బస్సులను (ఈ-బస్సులు) ప్రవేశ పెట్టింది. ఇలాంటి అనేక వాతావరణ హిత మార్పులకు తగిన చర్యలతో 2070 నాటికి నెట్‌ జీర్‌ ఉద్గార స్థితికి చేరడానికి నెమ్మదిగా, పటిష్టమైన అడుగులు పడడం సంతోషదాయకం.

భారతంలో 87 శాతం రోడ్డు రవాణా:
భారత రవాణా వ్యవస్థలో రోడ్డు రవాణా మాత్రమే 87 శాతం ఆక్రమించింది. పర్యావరణహిత రోడ్డు రవాణాకు సరైన మార్గం విద్యుత్‌ వాహనాల (ఎలక్ట్రిక్‌ వెహకిల్స్‌ లేదా ఈ-వాహనాలు) వినియోగం పెంచడమే అని గుర్తించాలి. రోడ్డు రవాణాలో విద్యుత్‌ వాహనాల (ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర ఆటోలు / ట్రాలీలు, కార్లు, లారీల వంటి సరుకు రవాణా వాహనాలు, ప్రజారవాణా బస్సులు) వాడకంతో గ్రీన్‌ హౌజ్‌ వాయువులు కట్టడి చేయబడుతూ, భూతాప ప్రభావం, గాలి కాలుష్య తీవ్రతలు తగ్గుతాయని అర్థం చేసుకోవాలి. దేశంలో పట్టణీకరణ వేగంగా పెరగడంతో పట్టణాలు అసంబద్ధంగా విస్తరించడం, ప్రజా రవాణా వాహనాల ఆదరణ పెరగడం అనివార్యం అవుతున్నది. 2050 నాటికి 66 శాతానికి పైగా ప్రజలు పట్టణాల్లో తిష్ట వేస్తారనే హెచ్చరికలు భవిష్యత్తు నగరాల దుస్థితులను కళ్ల ముందు ఉంచుతున్నాయి.
పట్టణ ప్రజా రవాణాకు ఎలక్ట్రిక్‌ బస్సులు:
పట్టణ ప్రజా రవాణాలో బస్సుల భాగస్వామ్యం ప్రధానమైంది. ప్రస్తుతం ప్రతి రోజు 42,000 బస్సులు 35 మిలియన్ల ప్రయాణికులను (బస్సుకు 840 మంది ప్రయాణీకుల చొప్పున) రవాణా చేస్తున్నాయి. ప్రజా రవాణాలో బస్సుల పాత్ర 80 శాతం వరకు ఉంటున్నది. దీని దృష్టిలో పెట్టుకొని నేడు పర్యావరణ హిత ఈ-బస్సులను (ఎలక్ట్రిక్‌ బస్సులు) పట్టణ రోడ పై ప్రవేశ పెట్టే ఉద్దేశంతో ‘పిఎం ఈ-బస్‌ సేవా స్కీమ్‌’ ప్రవేశ పెడుతూ రూ: 20,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ స్కీమ్‌కు మొత్తంగా రూ: 57,613 కోట్లు అవసరం అవుతాయని, దశల వారీగా నిధులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయించడం ముదావహం. ఈ – బస్సులను వాడడంతో ప్రత్యక్షంగా 50,000ల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ప్రస్తుతం భారత పట్టణాల్లో రోజుకు సగటున 42,260 బస్సులు తిరుగుతూ లక్ష మందిని తమ తమ గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి. నిర్థారిత ప్రమాణాల ప్రకారం పట్టణ ప్రజా రవాణా డిమాండ్‌ను బట్టి 93,480 బస్సులు అవసరం అవుతాయని తేల్చారు. నేడు ప్రవేశ పెట్టబడిన 10,000 ఈ – బస్సులతో రానున్న దశాబ్దకాలంలో 16.5 మిలియన్‌ టన్నుల కార్బన్‌డైఆక్సైడ్‌ ఉద్గారాలు తగ్గుతాయనే అంచనాలు భవిష్యత్తు తరాలకు ఉపశమనంగా ఉంటాయని ఆశిస్తున్నారు.
ఈ – బస్సులతో సంబంధాలున్న మాన్యుఫాక్చరర్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ఆపరేటర్స్‌, పెట్టుబడి పెట్టే సంస్థలు, ఇన్నొవేటర్స్‌, రీసెర్చర్స్‌ వర్గాలకు తగిన ప్రోత్సాహకాలులేదా సబ్సిడీలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలు వెనకడుగు వేయరాదు. ప్రపంచ డీకార్బనైజేషన్‌ విధానంలో 1.4 బిలియన్ల జనాభా కలిగిన భారత్‌ ఒక ఆదర్శ దేశంగా ప్రపంచ ప్రజారవాణా వ్యవస్థలకు దారినదీపం కావాలని కోరుకుందాం. మన మహానగరాలను ఈ – వాహనాల ఉద్యమంతో నగర ప్రజలకు పరిశుద్ధ గాలిని అందించే నందన వనాలుగా మార్చుదాం.
డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి
9949700037

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు