Friday, May 3, 2024

దళిత బంధుపై కన్నేసిన రాబందులు

తప్పక చదవండి
  • దళితుల అభ్యున్నతిని మరిచి దళారులకు ఫలహారంగా మారిన పథకం
  • తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి పైలెట్‌ ప్రాజెక్టులో మరోసారి దోపిడికి రంగం సిద్ధం..
  • మొదటి విడతలో లబ్ధి పొందిన భర్తలు.. రెండో విడతలో భార్యల పేరును సిఫారసు చేసిన ఎమ్మెల్యే.!
  • ఒకే కుటుంబంలో నలుగురి పేర్లు రాసిన అధికార పార్టీ కౌన్సిలర్‌ కక్కుర్తి..
  • పెళ్లయి అత్తగారింటికి వెళ్లినవారు.. పై చదువులకు ఇతర దేశాల్లో ఉన్న పెళ్లి కాని వారి పేర్లు జాబితాలో ప్రత్యక్షం…
  • పైలెట్‌ ప్రాజెక్టు మండలంలో అర్హత కలిగిన ఒక్క కుటుంబం కూడా మిస్‌ కావొద్దని చీఫ్‌ సెక్రటరీ ఆదేశాలు..

( పెరుమాళ్ళ నర్సింహారావు, ప్రత్యేక ప్రతినిధి.. )

హైదరాబాద్‌ : తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మండలంలో ‘దళిత బంధు’ పథకం అధికార పార్టీ నాయకులకు, వార్డు కౌన్సిలర్లకు, నకిలీ కొటేషన్లు ఇచ్చే బోగస్‌ ఏజెన్సీ దారులకు ఫలహారంగా మారింది. తిరుమలగిరి మండలం పైలెట్‌ ప్రాజెక్టు కావడం వలన ఈ మండలంలోని అర్హత కలిగిన ఏ ఒక్క లబ్ధిదారుడి కుటుంబం కూడా మిస్‌ కాకుండా అందరికీ ఈ పథకం అమలు చేయాలని ఆదేశిస్తూ, సెప్టెంబర్‌ 8.వ తేదీన ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ జిల్లా కలెక్టర్‌ కు ఆదేశాలు జారీ చేశారు (సంబంధిత లేఖ.నెం.1281/ఎస్‌.సి.పి/ఎ1/2023, తేదీ.08/09/2023). ఖమ్మం జిల్లా చింతకాని మండలం, నాగర్‌ కర్నూలు జిల్లా చారగొండ, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఈ మూడు మండలాల్లో మొదటి విడతలో మిస్‌ అయిన వారందరికీ ఈ పథకం అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తూ,ఇందుకు కావాల్సిన బడ్జెట్‌ కూడా రిలీజ్‌ చేస్తున్నట్లు సదర్‌ ఆర్డర్‌ లో ప్రభుత్వ సెక్రెటరీ పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి సంబంధిత ఆదేశాలు తెప్పించడంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ కుమార్‌ కృషి కాదనలేని సత్యం.
ఇంతవరకు బాగానే ఉన్నా, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ కుమార్‌ కు క్రింది స్థాయి నాయకత్వం తప్పుడు సమాచారం ఇచ్చి, తమకు నచ్చిన వారిని, కమిషన్లు ఇచ్చే వారిని ఏరికోరి ఎంచుకొని మరీ అనర్హులను ఈ జాబితాలో చేర్చి, మొత్తం తిరుమలగిరి మండలం క్రింద 307 మందిని ఎంపిక చేసి ఎమ్మెల్యే చేత సదరు జాబితాను ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులకు సిఫార్సు చేయించినారు. తాను అందరికీ న్యాయం చేస్తున్నాను అనే భ్రమలో స్థానిక ఎమ్మెల్యే ఉండగా, అనర్హులను క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే గుర్తుపట్టే అవకాశం లేనందున స్థానిక వార్డు కౌన్సిలర్లు, మండల నాయకులు, బోగస్‌ ఏజెన్సీదారులు అందరు కూడా గల్పుకొని మొదటి విడతలో లబ్ధి పొందిన కుటుంబ యజమానుల భార్యల పేర్లను, పెళ్లయి అత్తగారింటికి వెళ్లిపోయిన వారు, ఉన్నత చదువుల కోసం విదేశాల్లో చదువుకుంటున్న అవివాహితులు, గతంలో లబ్ధిదారుడైన ఒక నాయకునికి చెందిన ఇద్దరు భార్యల పేర్లు సైతం ఈ 307 మంది జాబితాలో చేర్చి, మరోసారి దళితుల రక్తం తాగేందుకు స్థానిక నాయకులు సిద్ధమయ్యారని అనేందుకు ఈ జాబితానే ప్రత్యక్ష సాక్ష్యం.
తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన ఓ వార్డు కౌన్సిలర్‌ ఏకంగా ఒకే కుటుంబంలో నలుగురి పేర్లు సిఫారసు చేయడం సిగ్గుచేటు. ప్రభుత్వ ఉత్తర్వులు, నియమ నిబంధనలపై కనీస అవగాహన లేకుండా, కేవలం కమిషన్లు మాట్లాడుకుని తమకు నచ్చిన వారందరినీ ఈ జాబితాలో చేర్చి, అర్హత ఉన్న ఎంతో మందిని తొక్కిపడేసి స్థానిక ఎమ్మెల్యే చేత అధికారులకు ఈ నకిలీ జాబితాను పంపించడంలో వీరంతా సక్సెస్‌ అయ్యారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకు తెలిసి జరుగుతుందా.. తెలియక జరుగుతోందా.? తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ చిల్లర నాయకత్వాన్ని నమ్మితే., చివరికంటా బదననాం అయ్యేది, దోషిగా మిగిలేది ఎమ్మెల్యే మాత్రమే. పొరపాటున ఈ జాబితాలో అనర్హులకు ఈ పథకం మంజూరి అయితే, అధికారులు జైలు పాలు కావడం ఖాయం.! అధికారులారా తస్మాత్‌ జాగ్రత్త.!!
దళితుల అభ్యున్నతికి, ఆర్థిక స్వాలంబన కొరకు ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రవేశపెడితే, అధికార పార్టీ నాయకుల స్వార్థ రాజకీయం వల్ల ప్రభుత్వ అభాసుపాలైంది. దళారులను ధనికులుగా మార్చింది. బికారి వ్యాపారులు జీఎస్టీ పేరుతో 18% దళిత లబ్ధిదారుల నుండి దోచుకుని దాచుకున్నారు. ఈ విషయం గతంలోనే ‘‘ఆదాబ్‌’’ ఆధారాలతో సహా వీళ్ళ బండారాన్ని బట్టబయలు చేసింది. అయినా జిల్లా అధికారుల్లో కనీసం చలనం లేదు. త్వరలోనే దొంగలు అందరూ బొక్కలోకి వెళ్లే తరుణం రాకమానదు. ముందున్నది అసలైన ముసుర్ల పండగ. వెయిట్‌ అండ్‌ సీ..!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు