Monday, April 29, 2024

కాళేశ్వరంపై విజిలెన్స్ తనిఖీలు..

తప్పక చదవండి
  • మేడిగడ్డ బ్యారేజ్‌పై విజిలెన్స్ విచారణ
  • ఈఎన్‌సీ ఆఫీసులో సోదాలు
  • ఏక కాలంలో 12 చోట్ల తనిఖీలు

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంగళవారంనాడు విజిలెన్స్ అధికారులు హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో విచారణ ప్రారంభించారు. ఈ తనిఖీల్లో 10 విజిలెన్స్, ఇంజినీరింగ్ బృందాలు పాల్గొన్నాయి. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ జలసౌధలోని ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. రెండో అంతస్థు, నాలుగో అంతస్థులో సోదాలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలేమిటో తేల్చాలని విజిలెన్స్‌ను ఆదేశించామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మొత్తం 12 చోట్ల సోదాలు జరుగుతున్నాయని వెల్లడించారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు.. ఇతర అంశాలను తేల్చాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లుగా తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనను కొత్త ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కాళేశ్వరం అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో గోప్యత, రహస్య జీవోలు, అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవలే మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన మంత్రుల బృందం అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇచ్చింది.

మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.4600 కోట్లు ఖర్చు చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగిందని.. మరో మూడు పిల్లర్లపై ఆ ప్రభావం పడిందని పరిశీలన చేసిన తర్వాత వెల్లడించారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై విచారణలో తప్పు చేసినట్లుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. క్రమంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించడం ఆసక్తికర పరిణామంగా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు