Friday, July 19, 2024

దేశం నన్ను నమ్మింది…నేను దేశాన్ని నిలబెట్టా : ప్రధాని మోడీ..

తప్పక చదవండి
  • విూరిచ్చిన స్ఫూర్తితో ఆర్ధికంగా అగ్రభాగాన నిలిపాను..
  • మార్పు తీసుకొస్తానన్న వాగ్దానం నెరవేర్చాను..
  • వచ్చే ఎన్నికల్లో మరోమారు విూ ఆశిస్సులతో వస్తా..
  • వచ్చేయేడూ నేనే ఎర్రకోటపై జెండా ఎగురేస్తా..
  • విూరు కన్న కలల కోసం నా చెమట చిందిస్తా..
  • 140 కోట్ల భారతీయులు నా పరివారమే..
  • గతంలో అక్రమాలు, కుంభకోణాలు రాజ్యమేలాయి..
  • మణిపూర్‌కు యావత్‌ భారతావని అండగా ఉంది..
  • స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ..

న్యూ ఢిల్లీ : దేశప్రజలంతా నన్ను నమ్మారు. నేను విూకు ఇచ్చిన మాటను నమ్మకంగా మార్చుకున్నాను. చేసిన మంచి పనులకు 2019లో మద్దతుగా నిలిచారు. మళ్లీ నన్ను ఆశీర్వదించారు. నాకు మరో అవకాశం ఇచ్చారు. నీ కలలన్నీ నెరవేరుస్తాను. మళ్లీ ఆగస్టు 15న వస్తాను. విూ కోసమే బతుకుతున్నాను. విూరు నా కుటుంబం అందుకే విూ కోసం చెమటలు చిందిస్తాను.. అంటూ ఎర్రకోటపై నుంచి ప్రధాని మోడీ ఉద్వేగపూరతి ప్రసంగం చేసారు. వచ్చే ఎన్నికల్లో మరోమారు విజయం సాధించి విూ ముందుక వస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2014లో మార్పు తీసుకొస్తానని హావిూ ఇచ్చాను. దానిని నెరవేర్చడంలో కృతకృత్యులయ్యాను. 90 నిమిషాలకుపైగా సాగిన ప్రధాని ప్రసంగంలో స్వాతంత్య సమరయోధుల గురించి, మణిపూర్‌ గురించి ప్రస్తావించారు. ప్రభుత్వ విజయాలను వివరించారు. కొత్త ప్రపంచంలో భారతదేశం పాత్రపై అభిప్రాయాలు వ్యక్తం చేసారు. రాజకీయ ప్రత్యర్థులను కూడా ఆయన టార్గెట్‌ చేశారు.

వచ్చేసారి ఆగస్టు 15న ఈ ఎర్రకోట నుంచి దేశం సాధించిన విజయాలను, సాధించబోయే విజయాలను విూకు వివరిస్తాను అన్నారు. నేను విూ నుంచి వచ్చాను.. విూ కోసం జీవిస్తున్నాను. విూ కోసమే నేను కలలు కంటున్నా.. విూ కోసం చెమటలు చిందిస్తాను. విూరు నాకు ఈ బాధ్యత ఇచ్చారనే కాదు విూరు నా కుటుంబం అనినేను ఇలా చేస్తున్నాను. విూరు బాధపడుతుంటే చూడలేను అని మోడీ అన్నారు. 2014లో మార్పు తెస్తానని హావిూ ఇచ్చానన్న మోదీ 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు, విూరు నన్ను నమ్మారని, ఆ నమ్మకాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించానని చెప్పారు. దేశం కోసం ఎంతో కష్టపడ్డారని, గర్వించదగ్గ పని చేశారన్నారు. మాకు దేశమే ప్రథమం, దేశమే సర్వోన్నతం. 2019లో విూరంతా మార్పు ప్రాతిపదికన మమ్మల్ని మరోసారి ఆశీర్వదించారు. ఆ ప్రదర్శన నన్ను మరింత ప్రోత్సహించిందన్నారు. రాబోయే ఐదేళ్లలో అపూర్వమైన అభివృద్ధి జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. వచ్చేసారి ఆగస్టు 15న దేశం సాధించిన విజయాలు, విూ బలాలు, విూ తీర్మానాలు, సాధించిన పురోగతి, దాని విజయం, దాని వైభవం, మరింత ఆత్మవిశ్వాసం గురించి ప్రస్తావిస్తాను. ఎర్రకోట నుంచి విూ సాయం కోరేందుకు వచ్చానని, విూ ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చానని పేర్కొన్నారు. 2047లో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే సందర్భంగా భారత త్రివర్ణ పతాకం ప్రపంచంలో అభివృద్ధి చెందిన భారతదేశానికి త్రివర్ణ పతాకంగా నిలవాలని ఆకాంక్షించారు. తన 90 నిమిషాల ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ తాను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టునలను ప్రారంభిస్తానని చెప్పారు. ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ గత ప్రభుత్వాలను టార్గెట్‌ చేశారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన కుంభకోణాలను ప్రస్తావిస్తూ అవినీతి భూతాలు దేశాన్ని వెంటాడుతున్నాయన్నారు. 140 కోట్ల మంది దేశప్రజల కృషి ఫలించిందని, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అన్నారు. గతంలో అవినీతి రాక్షసుడు దేశాన్ని వెంటాడేవాడు.. లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేశాయి. అలాంటి వాటిని అరికట్టి బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకున్నాం. పేదల సంక్షేమం కోసం వీలైనంత ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి ప్రయత్నించాం అన్నారు. మణిపూర్‌ రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సమస్య పరిష్కారం శాంతి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. గత కొన్ని వారాల్లో ఈశాన్య రాష్టాల్ల్రో మరీ ముఖ్యంగా మణిపూర్‌లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. భారత దేశ ఆడబిడ్డల గౌరవ, మర్యాదలకు తీవ్ర భంగం కలిగిందని చెప్పారు. అయితే గత కొన్ని రోజుల నుంచి అక్కడ ప్రశాంతత ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు. యావద్భారతావని మణిపూర్‌ రాష్టాన్రికి, ప్రజలకు అండగా ఉందని తెలిపారు. కొన్ని రోజుల నుంచి నెలకొన్న శాంతి ఆధారంగా మణిపూర్‌ ప్రజలు ప్రశాంతతను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. శాంతి ద్వారా మాత్రమే పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల బాధితులైనవారికి సంఫీుభావం ప్రకటిస్తూ, మృతులకు సంతాపం తెలిపారు. ఈ సంవత్సరం మన దేశంలోని చాలా రాష్టాల్రు అనూహ్యమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సవాలును అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేస్తాయని చెప్పారు. ఎర్ర కోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగించడం వరుసగా ఇది పదోసారి. ఈసారి ఆయన దేశ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా సంబోధించారు. ‘పరివార్‌జన్‌‘ అని సంబోధిస్తూ ప్రసంగించారు. గతంలో ఆయన దేశ ప్రజలను ‘నా ప్రియమైన సోదర, సోదరీమణులారా‘ అని సంబోధించేవారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆయన సరికొత్త రకం తలపాగా, దుస్తులు ధరించారు. వర్ణరంజితమైన రాజస్థానీ బంధని ప్రింట్‌ తలపాగాను, ఆఫ్‌వైట్‌ కుర్తా, పనెట్ జాకెట్‌, చుడీదార్‌లను ధరించారు. తలపాగా పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉంది. దీనికి పొడవైన వస్త్రం వేలాడుతూ ఉంది. వరుసగా10వ సారి ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఎగురవేశారు. ఎర్రకోటలో వేడుకలు తిలకించేందుకు దేశంలోని వివిధ రంగాల నుంచి సుమారు 1,800 మందికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానం అందింది. గత ఏడాదితో పోల్చితే... ఈ ఏడాది పెద్ద సంఖ్యలో అతిథులకు ఆహ్వానం అందింది. ’జన భాగస్వామ్యం’ పేరిట ఆహ్వానం పంపారు. ఉజ్వల గ్రామాల నుంచి 400 మంది సర్పంచులు సహా 660 మందిని పైగా ఆహ్వానించడం జరిగింది. రైతు ఉత్పత్తిదారు సంస్థల నుంచి 250 మంది, ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం, ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకం కింద 50 మంది, కొత్త పార్లమెంట్‌ భవనం, సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న 50 మంది కార్మికులు, సరిహద్దు రోడ్ల నిర్మాణం, అమృత సరోవరాల తవ్వకం, ఇంటింటికీ నీరు పథకంలో పాల్గొన్న కార్మికులు, 50 మంది ఖాదీ కార్మికులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారుల నుంచి 50 మంది చొప్పున ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎర్రకోట వద్ద రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సహాయ మంత్రి అజయ్‌ భట్‌, కార్యదర్శి గిరిధర్‌ అరమానే తదితరులు స్వాగతం పలికారు. ఢిల్లీ సంయుక్త ఇంటర్‌సర్వీసెస్‌, ఢిల్లీ పోలీస్‌ గార్డ్‌ బలగాలు ప్రధానికి వందన సమర్పణ చేశాయి. అనంతరం సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ గౌరవ వందన కవాతు బృందంలో ఆర్మీ, వైమానిక దళం, ఢిల్లీ పోలీసు విభాగం నుంచి ఒక్కొక్క అధికారితో పాటు 25 మంది సిబ్బంది, నావికాదళం నుంచి ఒక అధికారితోపాటు 24 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఏడాది కవాతు సమన్వయ బాధ్యతను భారత సైన్యం నిర్వహించింది. మేజర్‌ వికాస్‌ సంగ్వాన్‌ నేతృత్వంలో సైనిక దళాలు కవాతు నిర్వహించాయి. ప్రధాని జాతీయ జెండాను పూల వర్షం కురిపించిన భారత వైమానిక దళానికి చెందిన మార్క్‌ ఎఎఎ ధ్రువ్‌ అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్లు ఆవిష్కరించాయి. ఎర్రకోట వద్ద పుష్పాలంకరణలో విశేషాకర్షణగా జి – 20 లోగో నిలిచాయి. ఎర్రకోటకు చేరుకునే ముందు రాజ్‌ ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు