Tuesday, June 25, 2024

లోగుట్టు పెరుమాళ్ళకెరుక..

తప్పక చదవండి
  • కానీ సోషల్ మీడియాకు తెలిసిపోతుంది..?
  • అపార చాణుక్యుడి మదిలో ఏముందో ఎలా తెలుస్తుంది..
  • హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా కేసీఆర్ మాస్టర్ ఫ్లాన్..!
  • తెలంగాణాలో కాంగ్రేస్ రాజకీయ భవిష్యత్తు ఏంటి.. ?
  • కాంగ్రేస్ ఓడితే ఓటమినెపం రేవంత్ కు ఆపాదిస్తారా..?
  • టీడీపీ ఏ పార్టీ ఓట్లకు గండి కొట్టనుంది..!
  • బీఎస్పీ వైపు ఎవరున్నారు..?
  • బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది..

( తెలంగాణ రాజకీయాలపై “ఆదాబ్ హైదరాబాద్ ” స్పెషల్ ఫోకస్.. )

హైదరాబాద్ : లోగుట్టు పెరుమాళ్ళకెరుక అంటారు.. ముక్కంటికి కూడా తెలియని విషయాలు సోషల్ మీడియాకు ఎలా తెలిసిపోతున్నాయి..? గడిచిన 20 ఏండ్లలో తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతూ.. దృవతారగా వెలుగులు జిమ్ములుతున్నకేసీఆర్ పేరును తెలంగాణ రాష్ట్రంలో పసిపిల్లాడిని తట్టిలేపి అడిగినా.. ! టక్కున చెప్పేస్తారు.. ? తెలంగాణ చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ తన మనసులోని మాటని కొడుకుకి కూడా చెప్పడని కేసీఆర్ సన్నిహితులే సరదాగా చెప్పుకుంటుంటారు .. ! ఆయన మనసులో నిజంగా ఏముందో..? ఎన్నికల సమయంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు అమలుచేస్తారో .. ? తన పదునయిన మాటలతో.. వ్యూహాలతో రాజకీయ దురంధరులను సైతం మాటలు మాట్లాడలేని డిఫెన్స్ లోకి నెట్టేయగల నేర్పరి కేసీఆర్.. ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల దూకుడుకు కళ్ళాలు వేస్తూ తన మార్కును చేరగనీయకుండా ప్రజల్లో తన చరిష్మాను కాపాడుకుంటూ వస్తున్నారు కేసీఆర్.. అలాంటి కేసీఆర్ అసలు ఏమనుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లోఎలాంటి మార్పులు తీసుకుని రావాలనుకుంటున్నారు.. విశ్లేషించే ప్రయంత్నం చేద్దాం.?

- Advertisement -

( “వాసు” పొలిటికల్ కరెస్పాండెంట్..)

మరి కొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీతమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.. ప్రత్యేక కార్యక్రమాలతో, సభలు, సమావేశాలతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువయ్యి.. రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి ఎలాగయినా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీఆర్ఎస్ కు పక్కా వ్యూహాలతో చెక్ పెట్టి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రేస్ భావిస్తుండగా..ఎ ప్పటి కప్పుడు కాంగ్రేస్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలను రచిస్తూ.. బీఆర్ఎస్ ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫోకస్ పెడితే.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (యువరాజు) రాష్ట్రంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇద్దరు నేతలు బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు రెడీ అయిన బీఆర్ఎస్.. గెలుపు కోసం మాస్టర్ ఫ్లాన్ సిద్ధంచేసుకుంది. కొన్ని నెలల క్రితం నుంచి ఆత్మీయ సమ్మేళనాల పేరుతో స్పీడ్ పెంచిన అధికార పార్టీ మరో కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది . రాష్ట్రంలోని అన్ని నియోజవర్గాల్లో బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభలు, సమావేశాలను నిర్వహించాలని యోచిస్తోంది.

చాణక్యుడి మదిలో ఏముందో ఎవ్వరికి తెలుసు ..!
సీఎం కేసీఆర్ ఈసారి జరుగబోయే ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దానిలో భాగంగా పలువురు నాయకులకు స్థాన భ్రంశం కల్పిస్తూనే మరికొందరు సీనియర్ నాయకులను ఎంపీ బరిలో నిలపాలన్న ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ముఖ్యంగా వినబడుతున్న మొదటి పేరు ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేరు, మంత్రి హరీష్ రావు ను మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.. ఒకవేళ హరీష్ ఎంపీగా పోటీకి దిగితే ఆయన స్థానం హరీష్ సతీమని శ్రీనిత రావు పోటీ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇదే స్థానం నుంచి కేసీఆర్ తనయ కవిత కూడా పోటీ చేయాలనీ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.. కానీ హరీష్ సిద్ధిపేట స్థానంపై గట్టిగా పట్టుబట్టడంతో కవిత వెనుకకు తగ్గినట్లు సమాచారం.ఇప్పుడు మెదక్ సిట్టింగ్ ఎంపీ గా కొనసాగుతున్న కొత్త ప్రభాకర రెడ్డి దుబ్బాక సీటును ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని సమాచారం. ఇక హైదరాబాద్ లో తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఎలాగయిన ఎంపీగా పంపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే తాను ఎంపీగా వెళ్తే తన కుమారుడు సాయికిరణ్ యాదవ్ కు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని శ్రీనివాస్ యాదవ్ కోరుతున్నట్లు సమాచారం. మంత్రి మల్లారెడ్డి తాను మంత్రిగా తెచ్చుకున్న పేరుకంటే సోషల్ మీడియా స్టార్ గా సంపాదించుకున్న పేరే ఎక్కువని సోషల్ మీడియాలో ఎవ్వరిని అడిగిన యిట్టే చెప్పేస్తారు.. అలాంటి స్టార్ డమ్ మూటగట్టుకున్న మంత్రి మల్లారెడ్డిని ఎలాగయిన ఈ సారి ఎంపీ బరిలో నిలపాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం ఆయన స్థానంపై ఇప్పటికిప్పుడు క్లారిటీ ఇవ్వకపోయిన సీటీ పరిధిలోని ఎదో ఒక పార్లమెంట్ స్థానంపై పోటీ చేసే అవకశం ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో మంత్రి కంటే ఎక్కువ చరిష్మా కలిగియున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్న మైనంపల్లి హనుమంత రావు మల్కజ్ గిరి పార్లమెంట్ స్థానంపై పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ లీడరుగా పార్టీలో, రాష్ట్రంలో చరిష్మా ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్న మైనంపల్లి , ఈ సారి ఎలాగయిన ఆయన కుమారుడు రోహిత్ కు పొలిటికల్ ఎంట్రీ ఇప్పించాలని చూస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న రోహిత్ మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగితే గెలుపు పక్కా అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కూతురు కవిత ఈ సారి ఎంపీ గా పోటీ చేయడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. ఎంపీగా పోటీ చేయడం కంటే ఎమ్మెల్యేగా పొటీ చేయడానికి ఆమె గట్టిగా పట్టుబడుతున్నారట. ఇక కేటీఆర్ విషయానికొస్తే రెండు రోజుల క్రితం ‘ఆదాబ్ హైదరాబాద్’ గజ్వేల్ ఫై ప్రత్యేక కథనం ప్రచురించింది.. కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఇద్దరిలో ఒక్కరు గజ్వేల్ లో పోటీ చేసే అవకాశాలున్నాయి.. కేటీఆర్ గతంలో పోటీ చేసి గెలిచిన సిరిసిల్ల నుంచి ఈ సారి పొటీ చేసే ఆవకాశం లేదన్నట్లు వార్తలు వినబడుతున్నాయి..

తెలంగాణాలో కాంగ్రేస్ రాజకీయ భవిష్యత్తు ఏంటి.. ?
తెలంగాణాలో కాంగ్రేస్ రాజకీయ భవిష్యత్తు ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఒక సామెత గుర్తొస్తుంది… ఒక అడుగు ముందుకు పడితే.. పది అడుగులు వెనక్కి జారీ పడుతున్నారట అన్న చందంగా తయారయ్యింది కాంగ్రేస్ నాయకుల పరిస్థితి.. నిజం చెప్పాలంటే అధికార పార్టీ బీఆర్ఎస్.. నగరాల్లో బలంగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా బలహీనంగా ఉంది. డబుల్ ఇండ్ల వైఫల్యం,నిరుద్యోగ సమస్య,పరిమితమయిన ప్రభుత్వ పథకాలు, స్థానిక నాయకుల భూకబ్జాలు, నియోజక వర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నపలు సమస్యలు, నాయకులఫై వస్తున్న పలు అవినీతి ఆరోపణలు ఇవన్నీ అధికార పార్టీని ఇబ్బంది పెట్టే అంశాలుగా ఉన్నప్పటికీ వీటిని ఎత్తి చూపి ప్రజల్లోకి గట్టిగా తీసుకుని వెళ్లే స్థితిలో కాంగ్రేస్ నాయకులు లేరు. ఏమున్నా నేను ముఖ్యమంత్రిని ఎందుకు కాకూడదనే చర్చ తప్ప పార్టీ గెలుపుపై మాత్రం రేవంత్ రెడ్డి తప్ప ఏ నాయకుడు దృష్టి సారించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో బలహీనంగా ఉన్న కాంగ్రేస్ ను రేవంత్ రెడ్డ్డి తట్టిలేపి గాడిలో పెట్టినప్పటికీ ఆయనను ఆ పార్టీ నాయకులే కోవర్టుల అవతారం ఎత్తి ముప్పుతిప్పలు పెడుతున్నారు. రేవంత్ ఎడ్డెన్ అంటే అయన స్వంత పార్టీ నాయకులే తెడ్డం అనడం అందరిని విస్మయానికి గురిచేస్తుంది. పార్టీ మారుతామని ఒకసారి.. పార్టీ మాదే మేమెందుకుమారుతామని మరోసారి ఇలా అర్ధం పర్ధంలేని ప్రసంగాలతో పార్టీ ప్రతిష్టతను దిగజార్చుకుంటూ రోడ్డునపడుతున్నారు. పనుల కోసం, పర్మిషన్ల కోసం అధికార పార్టీ నాయకుల ఇండ్లకు చెక్కర్లు కొట్టే.. కొడుతున్న నాయకులు తాము అధికారం చేపడితే.. తమ పార్టీ అధికారంలోకి వస్తే తాము ఎవ్వరి ఇంటికి వెళ్లి గంటల తరబడి వేచి ఉండి పనులు చేయించుకుంటున్నారో అదే నాయకులు తమ కార్యాలయాలకు వచ్చి వేచి ఉంటారనే కనీస జ్ఞానాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు.

ఒకవేళ కాంగ్రేస్ ఓడితే ఓటమినెపం రేవంత్ కు ఆపాదిస్తారా..?
కొందరు కాంగ్రేస్ నాయకులు జేబులో నుంచి ఒక్క రూపాయి ఖర్చు చెయ్యరు.. కనీసం నియోజక వర్గంలోని నాయకుల, కార్యకర్తల గోడు పట్టించుకోరు. వాళ్ళ మంచి చెడులు చూడరు.. పై పొచ్చు సీనియర్లని గప్పాలు కొడుతుంటారు. కనీసం వాళ్ళున్న నియోజకవర్గంలో చిన్న ప్రభుత్వ ఉద్యోగి కూడా వాళ్ళ మాటలు వినే పరిస్థితి లేదు. అయినా ఢిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్లు పెట్టి మరీ వాళ్ళ లీడర్లపైనే కామెంట్స్ చేస్తుంటారు.. ఏమైనా అంటే మా పార్టీలో స్వాతంత్రం ఎక్కువ అని కబుర్లు చెబుతుంటారు.. పార్టీ గెలిస్తే మేమందరం కలిసి పనిచేశాం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వాన్ని ప్రజలు నమ్మారు.. అని చెబుతారు. ఒకవేళ పార్టీ ఒడి పోతె రేవంత్ రెడ్డి దూకుడే పార్టీ ప్రతిష్టతను మసకబారిచ్చిందని రోడ్డ్డేక్కి మరి చెబుతారు .. కాంగ్రేసు నాయకులు ఇకనైనా మారండి.. మిమ్ములను విమర్శించాలన్నది ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఉద్దేశ్యం కాదు.. మిమ్ములను నమ్ముకున్న నాయకుల, కార్యకర్తల గోడు వినండి.. వారి బాగోగులు చూడండి. ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఎం చేయగలరో..! గతంలో ఎం చేశారో..! నిజాయితిగా ప్రజలకు చెప్పండి.. చేసిన తప్పులను ఒప్పుకొండి ..!. వాటిని సరిదిద్దుకోండి..! ప్రజలకు ఏమి కావాలో తెలుసుకోండి.. వారిలో ఒక్కరిగా మెలగండి ! స్పష్టమైన ఎజెండాతో ఎన్నికలకు వెళ్ళండి. విజయం తప్పక మీ స్వంతం అవుతుంది.

టీడీపీ ఏ పార్టీ ఓట్లకు గండి కొట్టనుంది..?
టీడీపీ ..! ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలుగి దేశ రాజకీయాల్లో కూడా తనదయిన స్థానాన్ని గుర్తింపును పదిలపరుచుకున్న టీడీపీ నేడు తెలుగు వారి గుండెల్లో మాత్రమే మిగిలిపోయింది.. క్రమశిక్షణతో కూడిన నాయకులు, కార్యకర్తల బలం ఉన్న టీడీపీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణాలో కేవలం సింగల్ డిజిట్ సీట్లకే పరిమితమయ్యింది. నేడు కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షతన కాసాని వీరేష్ సారథ్యంలో టీటీడీపీ నూతన జవసత్వాలను నింపుకుని 2024 ఎన్నికలకు పోటీకి రెడీ అంటూ ఎన్నికల శంఖారావం మ్రోగించింది.. అయితే టీడీపీ ఏ పార్టీ ఓట్లకు గండి కొట్టనుందనేది రాష్ట్రంలో ఇప్పుడు చర్చగా మారింది.. తెరాస రాష్ట్రం ఏర్పడక ముందు టీడీపీపై అంతగా దృష్టి సారించని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక మొదటగా ఆయన టీడీపీపై కన్నేశారు . ఆ పార్టీని తుడుచిపెట్టాలనే ఏకైక లక్ష్యంతో ఆ పార్టీలోని సీనియర్ నాయకులపై నజర్ పెట్టిన కేసీఆర్ ఉన్నఫలంగా పార్టీలోకి పలువురు సీనియర్లను చేర్చుకుని మంత్రులను కూడా చేసి పార్టీలో గౌరవం కల్పించేశారు.. దీంతో టీడీపీ లోని పలువురు సీనియర్లు తెరాస వైపు ఆకర్షితులయి తెరాస కండువా కప్పుకున్నారు. లీడర్ల నిర్ణయానికి ఖంగుతిన్న టీడీపీ శ్రేణులు ఏమి చేయాలో అర్ధం కాక చెల్లాచెదురయిపోయారు. ఇక తెరాసను నమ్ముకుని ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకున్న నాయకులు పార్టీలో కనీస గౌరవం దక్కక పోవడంతో నిరాశలోపడ్డారు. టీడీపీ నుంచి తెరాసలో చేరిన తరువాత ఆ నాయకులు తమ స్వంత కోటరీ నిర్మించుకోవడంతో పలువురు సీనియర్లు తమ అవకాశాలను, భవిష్యత్తును కోల్పోయామని భావిస్తున్నారు. ఇక టీడీపీ కార్యకర్తలు పార్టీ మారిన నాయకులపై గుర్రుగా ఉన్నారట.. రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన పార్టీకి నమ్మక ద్రోహం చేశారని.. ఈ సారి ఆ నాయకులకు ఎలాగయిన బుద్ది చెప్పాలనే నెపంతో ఉన్నారట.. దీంతో బీఆర్ఎస్ లో అవకాశాలు కోల్పోయిన ద్వితీయ శ్రేణీ నాయకులు, చెల్లా చెదురయిన టీడీపీ నాయకులు పార్టీ పిరాయించిన నాయకులపై దృష్టిసారించారట. వారిని ఎలాగయిన ఓడించాలన్న కృతనిశ్చయానికి వచ్చారట. దీంతో పార్ట్టీ మరీనా నాయకులకు గుబులు పట్టుకుందట.. ఒకవేళ టీడీపీ ఫామ్ లోకి వస్తే తమ భవిష్యత్తు ఏంటని నాయకులు చర్చించుకుంటున్నారట. ఒక వేళ నియోజక వర్గాల్లో టీడీపీ బలమైన అభ్యర్థులను దింపితే పార్టీ పిరాయించిన అభ్యర్థుల ఓట్లు చీలే అవకాశం కొట్టిపారేయలేమని విశ్లేషకులు తెగేసి చెబుతున్నారు.

బీఎస్పి వైపు ఎవరున్నారు.?
బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసే పనిలో బీఎస్పి పార్టీ బిజీగా ఉంటూ పావులు కదుపుతోంది. తమ అభ్యర్థులు ఆర్థికంగా బలంగా లేరని చెబుతూనే సామాజిక న్యాయం ఒక బీఎస్పితోనే సాధ్యమని ప్రకటిస్తున్నారు. 119 స్థానాల్లో పోటీకి సిద్ధపడుతున్న బీఎస్పి ఎక్కువశాతం ఎస్సి, ఎస్టీల ఓట్లు చీల్చే అవకాశం కనబడుతుంది.

బీజేపీ స్టాండ్ ఏమిటి..?
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అనూహ్యరీతిలో బీజేపీ బలపడింది.. ఇది వాస్తవం.. క్షేత్రస్థాయిలో బీజేపీ శ్రేణులను బలోపేతం చెయ్యడంలో బండి సంజయ్ విజయం సాధించారు.. ఈసారి తెలంగాణాలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అనే నమ్మకాన్ని కలిగించారు.. అయితే బండిని అధ్యక్ష బాధ్యతల నుండి తొలగించి బీజేపీ అధిష్టానం చారిత్రాత్మక తప్పిదం చేసిందనే చెప్పాలి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పబడుతున్న కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడంతోనే ఆ పార్టీ నిర్ణయం ఏమిటో ఇట్టే అర్ధం అయిపొయింది.. తెలంగాణాలో కాంగ్రెస్ పుంజుకుంటోంది అని తెలుసుకున్న బీజేపీ అధిష్టానం ఎలాగైనా ఆ పార్టీని అధికారంలోకి రాకుండా చేయాలనే తలంపుతో లోపాయికారిగా బీ.ఆర్.ఎస్. తో ఒప్పొందం చేసుకుందనే అపవాదు కూడా మూటకట్టుకుంది.. ఎక్కువ ఎంపీ స్థానాలు సాధించడమే ఇప్పుడు ముఖ్యంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది.. అందుకే బీ.ఆర్.ఎస్. తిరిగి అధికారంలోకి రావడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్లేషకులు వాదిస్తున్నారు.. కవిత లిక్కర్ కేసు, కేటీఆర్ లీకుల కేసు నీరుగారేలా చేసిన బీజేపీపై ఆ పార్టీ లోయర్ క్యాడరే గుర్రుగా ఉందన్న వాస్తవాన్ని కాదనలేం.. నోదాకా వచ్చిన కూడు నేలపాలు చేస్తోందని బీజేపీ అధిష్టానంపై వారు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.. మరి బీజేపీ అధిష్టానం మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో కాలమే నిర్ణయించాలి.. ఎందుకంటే లోగుట్టు పెరుమాళ్ళకెరుక..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు