Tuesday, May 7, 2024

వర్షంతో ఆగిన ఆట…

తప్పక చదవండి
  • సఫారీల పతనాన్ని అడ్డుకున్న వరుణుడు..
  • 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా…

కోల్‌కత్తాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా… 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సౌతాఫ్రికాకు షాకులు తాకుతున్న క్రమంలో వరుణుడి పుణ్యమా అని వికెట్ల పతనానికి కాస్త అడ్డుకట్ట పడింది. టోర్నీ ఆసాంతం పరుగుల వరద పారించిన సౌతాఫ్రికా స్టార్‌ బ్యాటర్లు క్వింటన్‌ డికాక్‌, రస్సీ వాండెర్‌ డసెన్‌, ఎయిడెన్‌ మార్క్‌రమ్‌లు 25 పరుగుల లోపే పెవిలియన్‌ చేరారు. నాకౌట్‌ దశలో తమలోని అత్యుత్తమ ఆటను బయటకు తీసే ఆస్ట్రేలియా బౌలర్లు.. కోల్‌కతాలో సఫారీలను చావుదెబ్బ కొడుతున్నారు. 14 ఓవర్లు ముగిసేసరికి వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు.
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సఫారీ సారథి టెంబా బవుమా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కానీ అది ఎంత తప్పుడు నిర్ణయయో సఫారీలకు మొదటి ఓవర్‌లోనే తెలిసొచ్చింది. స్టార్క్‌ వేసిన మొదటి ఓవర్లోనే బవుమా.. వికెట్‌ కీపర్‌ జోష్‌ ఇంగ్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఐదు ఓవర్లకు సఫారీ జట్టు చేసింది 8 పరుగులు మాత్రమే. ఆరో ఓవర్లో సఫారీలకు మరో షాక్‌ తాకింది. 14 బంతులాడిన డికాక్‌.. మూడు పరుగులే చేసి హెజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. పది ఓవర్లకు సఫారీలు చేసింది 18 పరుగులు మాత్రమే.
నాలుగో స్థానంలో వచ్చిన ఎయిడెన్‌ మార్క్‌రమ్‌.. 20 బంతులాడి రెండు బౌండరీల సాయంతో పది పరుగులే చేసి స్టార్క్‌ వేసిన 11వ ఓవర్లో వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే హెజిల్‌వుడ్‌.. వాండెర్‌ డసెన్ ను వెనక్కిపంపాడు. 31 బంతులాడిన డసెన్‌ ఆరు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. 14 ఓవర్లలో వర్షం పడే సమయానికి సఫారీలు నాలుగు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్(10 నాటౌట్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌ (10 నాటౌట్‌)లు క్రీజులో ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు