Saturday, May 18, 2024

యువత చేతుల్లోనే దేశ భవిత

తప్పక చదవండి
  • ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి
  • ప్రజల ప్రయోజనాన్ని కోరుకునే నాయకున్ని ఎన్నుకోండి
  • వికారాబాద్‌ జిల్లా స్వీప్‌ ఐకాన్‌, సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

వికారాబాద్‌ జిల్లా : ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్క యువత తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖ సినీ నటుడు, వికారాబాద్‌ జిల్లా స్వీప్‌ ఐకాన్‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్వీప్‌లో భాగంగా ఓటరు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మంచి నాయకున్ని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటింగ్‌ లో పాల్గొని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల రోజు ప్రతి ఒక్కరూ తమ వాట్సాప్‌ స్టేటస్‌ ద్వారా ఓటు వినియోగంపై మెసేజీలను పొందుపరచాలని సూచించారు. యువత వచ్చే ఎన్నికలలో క్రియాశీలక పాత్ర వహించాలని, ప్రజల ప్రయోజనాన్ని కోరుకునే నాయకున్ని ఎంచుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

విద్యార్థులందరూ బాగా చదువుకుని ఉన్నతాధికారులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మంచి వాతావరణంతో కూడుకున్న వికారాబాద్‌ ప్రాంతానికి మంచి భవిష్యత్తు ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ..రాబోవు ఎన్నికలలో ప్రతి ఒక్కరు ఓటింగ్‌ లో పాల్గొని దేశంలోనే వికారాబాద్‌ జిల్లాను ఆదర్శంగా నిలపాలని కోరారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద రాక్షసుడు డబ్బు, మద్యం అని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికలలో నిర్భయంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరు ఇప్పటి వరకు ఓటరుగా నమోదు కాని వారందరూ చివరి రోజైన ఈ రోజే ఓటరుగా నమోదై మన గ్రామం, మన ప్రాంత అభివృద్ధి చెందేందుకు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటింగ్‌లో పాల్గొనాలని ఆయన అన్నారు. జిల్లాలో గత ఎన్నికలలో 76 శాంతం ఓటింగ్‌ పోలింగ్‌ జరిగిందని, ఈసారి ఎన్నికలలో 90 శాంతం పోలింగ్‌ జరగాలని ఆయన ఆకాంక్షించారు. వచ్చే మూడు నెలలలో ఎన్నికలు ఉన్నందున ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనాలని కలెక్టర్‌ కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ లింగ్యా నాయక్‌, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ నారాయణ అమిత్‌, వికారాబాద్‌, తాండూర్‌ ఆర్డీవోలు విజయ కుమారి, శ్రీనివాసరావు, స్వీప్‌ నోడల్‌ అధికారి కోటాజి, వివిధ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు