Thursday, May 16, 2024

ఉద్యమ కేసుల ఎత్తివేత

తప్పక చదవండి
  • ఉద్యమకారులపై కేసులన్నీ ఎత్తివేయాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయం
  • 2009 నుంచి 2014 జూన్‌ 2 వరకు నమోదైన కేసుల ఎత్తివేత
  • రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం పట్ల ఉద్యమకారులు హర్షం

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన రేవంత్‌ సర్కార్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచే దూకుడుగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీల అమలుకు ఆదేశాలు జారీ చేశారు. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని రేపటి నుంచి అమలు చేసేందుకు.. జీవో కూడా విడుదల చేశారు. మరోవైపు.. సర్కారు కొలువుదీరిన తర్వాతి రోజే ప్రజా దర్భార్‌ నిర్వహించి.. తమది ప్రజా ప్రభుత్వమని తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో.. తెలంగాణను అమరులు, ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తానని మాటిచ్చిన రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పొల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసులన్నీ ఎత్తివేయాలని రేవంత్‌ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పోలీసులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2009 నుంచి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన 2014 జూన్‌ 2 వరకు ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. వివరాలు వచ్చిన వెంటనే.. ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేయనున్నట్టు తెలుస్తోంది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే.. బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో.. ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని అప్పటి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయగా.. పోలీసు ఉన్నతాధికారులు పలువురిపై ఉన్న కేసులను ఎత్తేశారు. కాగా.. అసలైన ఉద్యమకారులను కేసీఆర్‌ నిర్లక్ష్యం చేశారని పదే పదే ఆరోపిస్తూ వచ్చిన రేవంత్‌ రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరిపై ఉన్న కేసులను ఎత్తేసేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు