- ఎన్ని కుట్రలు చేసినా నా గెలుపు ఎవరూ ఆపలేరు : జగ్గారెడ్డి
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు పక్కా అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ 15 తర్వాత కాంగ్రెస్ స్పీడ్ ఎవరూ ఆపలేరన్నారు. బీఆర్‌ఎస్ చెప్పుకోవడానికి ఏ అంశంపై లేక మళ్లీ తెలంగాణ వాదాన్నే ముందుకు తీసుకొస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి విషయంలో ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే ఆలోచించి, అందరి అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రిని డిసైడ్ చేస్తారని వెల్లడిరచారు. కేసీఆర్ తొమ్మిది కిస్తీల ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మళ్ళీ రాదని బీఆర్‌ఎస్‌కు భయం, అనుమానం పట్టుకుందన్నారు. ఇది మాటల ప్రభుత్వమని గ్రామాల్లో చర్చ నడుస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని బీఆర్‌ఎస్‌కు అర్ధమైందని.. కర్నాటక ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలను మిస్ గైడ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి బయటపడాలని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ అవారా పార్టీగా మారిందని ఎమ్మెల్యే తెలిపారు. 50 డ్యాములు కట్టిన కాంగ్రెస్ ఎక్కడ… ఒక్క డ్యామ్‌కే సినిమా చూపిస్తున్న బీఆర్‌ఎస్ ఎక్కడ అని అన్నారు. ఎన్నికల కోడ్ వచ్చేముందు అన్ని వాగ్ధానాలు ఇచ్చారని.. ఒక్క జీవో కూడా బయటకి రాలేదని తెలిపారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాల గూర్చి కేసీఆర్ ఆలోచించారా అని ప్రశ్నించారు. అమరుల కుటుంబాలను ప్రగతి భవన్ పిలిచి ఒక్క పూటైనా అన్నం పెట్టిండా అని నిలదీశారు. అమరుల కుటుంబాలను ఎందుకు పట్టించుకోలేదని అడిగారు. కొందరు అమాయకులను చంపి వాళ్ళ చేతిలో చిట్టిలు పెట్టిన వాళ్ళు ఎమ్మల్యేలు, ఎంపీలు అయ్యారన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు యూనివర్సిటీలకు ఎందుకు వెళ్ళలేక పోతున్నారని అన్నారు. ఎంఐఎం సినిమా హైదరాబాద్‌లోనే నడుస్తదని.. ఎంఐఎం, బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ రావద్దని మోదీ, కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారన్నారు. కవిత జైలుకి వెళ్తదని బండి సంజయ్ రోజూ ఉపన్యాసాలు ఇచ్చారని.. కవిత అరెస్ట్ డ్రాప్ కాగానే బీజేపీ పని ఖతం అయిందన్నారు. నోరు విప్పినందుకే బండి సంజయ్ అవుట్ అయ్యారన్నారు. బీజేపీలో ఎవరైనా మాట్లాడితే బొంద పెడుతారని… కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ‘‘కాంగ్రెస్ దగ్గర పైసలు లేవని.. అందరి దగ్గర బొక్కలు తెలినాయ్. నా దగ్గరికి ఐటీ వాళ్ళు వస్తే నా అప్పుల లిస్ట్ ఇచ్చేస్తా. ఐటీ వాళ్లే నాకు పైసలు ఇచ్చి వెళ్ళాలి. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి కాంగ్రెస్‌ను ఒంటరి చేస్తున్నాయి. ముస్లింలకు ఓవైసీ బ్రదర్స్ ఏం చేశారు. సీఏం ఎవరుంటే వాళ్ళని గొప్ప ముఖ్యమంత్రి అనడం తప్పా ఓవైసీలకు ఏం రాదు. ముస్లింల కోసం ఓవైసీ ఏం చేయట్లేదని… అల్లా ఇదే చెప్పాడా?.. సచ్చిపోయాకా ఏం తీసుకెళ్లగలం? ఏడుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలను ఓడగొట్టండి. మజ్లిస్ ఎమ్మెల్యేలను ఓడగొట్టి మాకు అధికారం ఇస్తే విూ జీవితాలను మార్చుతాం. దారుస్సలం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
మంత్రి హరీష్ రావుపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘నేను ఎవరి గురించి నెగెటివ్ మాట్లడను. మేం ఏం చేస్తామో అది చెప్తాం. ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతా. ఆయన వంద పంచులు కొడితే నాకు ఒక్క పంచ్ చాలు. హరీష్ రావుకి సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తా. హరీష్ రావుకి నిద్ర కరువైంది. హరీష్ రావుకి నిద్ర పట్టక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు’’ అంటూ మండిపడ్డారు.
‘‘నా బిడ్డనే నా అపోజిషన్. ప్రభుత్వం వస్తే చెప్పినవన్నీ చేయాలని నా బిడ్డ చెప్పింది. నేను పని చేయకపోతే నా బిడ్డనే అడ్డం పడుతది. రేవంత్ మా పీసీసీ చీఫ్. నేను రేవంత్ అన్నదమ్ములం. ఉప్పు కారం తింటున్నాం కాబట్టి అప్పుడప్పుడు కోపాలు వస్తాయి. అన్నదమ్ములం పంచాయితీ పెట్టుకుంటాం. అవుతల వాడు వచ్చి మా మధ్యలోకి వస్తే ఎటాక్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. సైలెంట్ ఓటింగ్ కాంగ్రెస్‌కు పడుతుంది. రాష్ట్రంలో నిషబ్ద విప్లవం వస్తుంది. 70 సీట్లలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మా పాలసీలు కాపీ కొట్టి కేసీఆర్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు’’ అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు.