- ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
- నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం ప్రకటన
- అనూహ్య నిర్ణయాలు ఉంటాయని ప్రతిపక్షం అనుమానం
న్యూఢిల్లీ : పార్లమెంట్ ‘ప్రత్యేక’ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పార్లమెంట్ పాత భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్ సభ లో ప్రసంగించారు. పాత భవనానికి వీడ్కోలు పలుకుతూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఈ నేపథ్యంలో పాత భవనంలో పలు జ్ఞాపకాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్లమెంట్ పాత భవనంతో తన జ్ఞాపకాలను సభలో పంచుకున్నారు. తెలగాణ వంటి కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది ఇక్కడేనని చెప్పారు. పార్లమెంట్ తరలివెళ్లినా ప్రస్తుత భవనం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో ఇదొక కీలక ఘట్టమని మోదీ వివరించారు. కాగా, మంగళవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు కొత్త భవనంలో నిర్వహించనున్నారు. ఈ పార్లమెంట్ భవనం ఆలోచన బ్రిటీష్ వారిదే అయినప్పటికీ.. నిర్మాణంలో భారతీయులు చెమటోడ్చారని ప్రధాని మోదీ అన్నారు. 75 ఏళ్లుగా ఈ భవనంలో అడుగుపెట్టిన ప్రతిఒక్కరూ భారతీయ సంస్కృతిని కాపాడారని ప్రశంసించారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మన దేశంవైపే చూస్తోందని, వివిధ రంగాలలో మన విజయాలు ప్రపంచాన్ని అబ్బుర పరుస్తున్నాయని చెప్పారు. ఇటీవలి చంద్రయాన్ -3 ప్రాజెక్టుతో మన సత్తాను ఇస్రో ప్రపంచ దేశాలకు చాటిచెప్పిందని మోదీ పేర్కొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిడివి తక్కువే అయినప్పటికీ.. సందర్భం చాలా గొప్పదని, ఈ సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నామని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధానిమోదీ ప్రతిపక్షాలకు ఓ విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్ష సభ్యులు సహకరిస్తారని భావిస్తున్నానని, ఏడుపులు, విమర్శలకు ఇది సమయం కాదని గుర్తుంచుకోవాలని కోరారు. విశ్వాసం, సానుకూల దృక్పథంతో ఈ సమావేశాలు నిర్వహించుకుందామని, సభ్యులంతా ఉత్సాహంగా చర్చల్లో పాల్గొంటారని ఆశిస్తున్నట్లు మోదీ అన్నారు.
జీ20 సదస్సు సక్సెస్ భారత దేశానికి గర్వకారణం అని ప్రధాని మోదీ అన్నారు. భారత్ సత్తా ఏంటో చూపించామని, జీ20 విజయాన్ని ప్రపంచాధినేతలు ప్రశంసించారని మోదీ అన్నారు. ఆఫ్రికన్ యూనియన్ జీ20 శాశ్వత సభ్యత్వం పొందినందుకు భారత్ గర్వపడుతుందని, ఇవన్నీ భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతం అని మోదీ అన్నారు. చంద్రయాన్-3 విజయవంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని, మన జెండా సగర్వంగా రెపరెపలాడుతుందని మోదీ అన్నారు.