Friday, May 17, 2024

తొలి పూజ అందుకున్న ఖైరతాబాద్ గణేశ్

తప్పక చదవండి
  • హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి తలసాని హాజరు
  • పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్

హైదరాబాద్ : ఖైరతాబాద్ మహా గణేశుడికి పూజలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు జరిగిన తొలి పూజలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహా గణపతికి నేతలు హారతిచ్చారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది 63 అడుగుల భారీ ఆకారంతో దశవిద్య మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. గణపతికి కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి, ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బారీకేడ్లు ఏర్పాటు చేసినట్లు ఖైరతాబాద్ మహా గణపతి ఉత్సవ కమిటీ వెల్లడించింది.

300మంది పోలీసులు.. 70సీసీ కెమెరాలతో నిఘా
ఖైరతాబాద్‌ గణేశుడి దర్శనానికి ప్రతి ఏడాది నవరాత్రుల్లో సుమారు 20లక్షల నుంచి 30లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వార్డు ఆఫీసు, రైల్వే గేటు, మింట్‌ కాంపౌండ్‌, బడా గణేశ్‌ వెనుక వైపు నలుదిక్కులా సుమారు 70సీసీ కెమెరాలను అమర్చారు. ఇద్దరు ఏసీపీలు, సీఐల పర్యవేక్షణలో 300 మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పిస్తున్నారు. అడుగడుగునా మెటల్‌ డిటెక్టర్లతో పాటు ఎనిమిది డోర్‌ ఫ్రేమ్‌ డిటెక్టర్లను ఇప్పటికే అమర్చారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే దర్శనానికి పంపిస్తామని ఖైరతాబాద్‌ సీఐ బాల్‌గోపాల్‌ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు