- మూడు పువ్వులు ఆరుకాయలుగా అక్రమ సంపాదన
- ఖజానాలో జమకానీ ఇంటి పన్ను..?
- దొంగ బిల్లులతో ప్రజాధనం దోపిడీ
- మేకపోతు గాంభీర్యంలో కార్యదర్శి
లంచావతారమెత్తిన పంచాయితి కార్యదర్శి అనే శీర్షికన ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో ప్రచురితమైన కథనం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందు గలడందు లేడని సందేహము వలదు ఎందెందు వెదకి జూచిన అందందే గలడు అన్నట్లుగా ఆమె అవినీతి చీకటి సామ్రాజ్యాన్ని చూస్తే ఎవరైనా నోరెళ్ళ బెట్టాల సిందే. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయ పాలెం మండలం లోని కాకరవాయి గ్రామపంచాయితీ లో జూనియర్ పంచాయితి కార్య దర్శిగా 2019లో బాధ్యతలు స్వీకరించిన మేకల పావని గ్రామంలో చేపట్టిన అక్రమ వసూళ్లను, పాల్పడిన అవినీతిని చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే.అక్రమ వసూళ్ల కోసం ఒక అడుగు ముందుకేసి పంచా యితికి చెందిన ఓ మల్టిపర్పస్ వర్కర్ (గుమస్తా)ని లంచం వసూళ్లు చేయ టానికి ఎజెంట్ గా నియమించుకుని బరి తెగించి మరి అక్రమ వసూళ్ల కు తెరలేపింది.కాకరవాయి గ్రామం విస్తీర్ణ పరంగా పెద్దది కావడం ఇక్కడి ప్రజలు కూలి నాలి,వ్యవసాయం పై ఆధారపడే నిరక్ష్యరాస శ్రమజీవులు కావడంతో వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తన అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతుంది.
మూడు పువ్వులు ఆరు కాయలుగా అక్రమ సంపాదన..
అక్రమాలకు పాల్పడటంలో అందెవేసిన చెయ్యి పేరుగాంచిన సదరు కార్యదర్శి పావని గ్రామంలో జరిగే అభివృద్ధి పనుల్లో భాగంగా పంచా యితీ నిధుల నుంచి కొనుగోలు చేసే వస్తువుల్లో వీధి దీపాలు,ట్రీ గార్డులు, బ్లీచింగ్ పౌడర్,మంచి నీటి పైపులతో పాటుగా, మరమ్మతులు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులు క్రయం పేరుతో దొంగ బిల్లులు సృష్టించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి ప్రజాధనం దోచుకుంది.దీనికి తోడు నూతన గృహనిర్మాణ అనుమతులుఇంటి నెంబర్ తీసుకోవాలన్నా, విద్యుత్ మీటర్ పొందాలన్నా కోరిన పైకం ఆమెకు ముట్ట చెప్పాల్సిందే. లేదంటే సరైన ద్రువపత్రాలు లేవనే సాకుతో దరఖాస్తును తిరస్కరించి గ్రామస్తులను అనేక ఇబ్బందులకు గురిచేసి కావాల్సిన పైకం రాబట్టుకుంటుంది.
ఖజానాలో జమకానీ ఇంటి పన్ను..?
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పెద్ద గోడౌన్ లకు,భవనాలకు పెద్ద ఎత్తున అమ్యామ్యాలు పుచ్చుకుని నామమాత్రపు భవనాల వలే అనుమతులు మంజూరు చేసింది.ఆమె కార్యదర్శిగా విధుల్లో చేరిన రోజు నుండి నేటి వరకు (ఐదు సంవత్సరాలలో) గ్రామంలో వసూలు చేసిన ఇంటి పన్నుల నిధులను సైతం సంబంధిత ప్రభుత్వ ఖజానా శాఖలో జమ చేయకుండా కార్యదర్శి పావని కొంతమేర సొంతానికి వాడుకున్నట్లు సమాచారం.వసూలు చేసిన ఇంటి పన్నుల రశీదు తేదీలను అట్టి నిధులను ప్రభుత్వ ఖజానా శాఖలో జమ చేసిన తేదీలను నిశితంగా పరిశీలిస్తే బాగోతాలు మొత్తం బట్టబయలవు తాయనేది గ్రామ ప్రజల ప్రధాన ఆరోపణ.
అవినీతి పై విచారణ జరిపించాలి…
జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తక్షణమే స్పందించి విచారణ కై ఓ ప్రత్యేక అధికారిని నియమించి కాకరవాయిలో క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తే కార్యదర్శి చేసిన అవినీతి అక్రమాలు, ఎంపిఓ రాజేశ్వరి అందించిన పరోక్ష సహకారం,ఏజెంట్ చేసిన అక్రమ దందా వ్యవహారం మొత్తం బట్టబయలవుతుందని స్థానికుల మాట.