Sunday, April 28, 2024

మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ పేరుతో భారీ మోసం

తప్పక చదవండి
  • అసలు సూత్రధారి అప్పటి సీఎండీ రఘుమారెడ్డే..!
  • రెండు చేతులా సహకరించిన లీగల్‌ అటాచీ..!
  • ఒక్కొక్క పోస్టుకు రూ.30-50 లక్షల వసూల్‌..!
  • ఆర్టీఐ కింద సమాచారం అడిగితే.. ఇవ్వని హెచ్‌ఆర్డీ హెచ్వోడీ మురళీకృష్ణ

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో తవ్వినాకొద్ది అవినీతి లీలలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో ఆసంస్థలో జరిగిన దొంగ పనులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అప్పటి ప్రభుత్వాధినేత కేసీఆర్‌ యొక్క అమోఘమైన ఆశీస్సులతో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి చేసిన అవినీతి పనులు ఇప్పుడు బయటపడుతున్నాయి. మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ పేరుతో ఆయన సాగించిన ఉద్యోగాల నియామకాల ప్రక్రియ చూస్తే విస్మయం కలుగుతోంది. ఈయన చేసిన అవినీతి లీలలను ఇటు కప్పిపుచ్చుకోలేక..అటు బయట పెట్టలేక నానా అవస్థలు పడుతున్నారు ఇప్పటి అధికారులు. గత సీఎండీ రఘుమారెడ్డి చేసిన లీలలన్ని బయట పెడితే ఎక్కడ టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఇజ్జత్‌ పోతుందోనని వారు మథనపడుతున్నారు. అందుకే కాబోలు రఘుమారెడ్డి హయాంలో మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ కింద జరిగిన నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేందుకు ససేమీరా అంటున్నారు.
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ కింద ఇచ్చిన అపాయింట్‌ మెంట్స్‌ లో భారీగా అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ కింద టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో సుమారు 200 మంది ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. అప్పటికే సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు వైద్యపరమైన కారణాల వల్ల పదవీ విరమణ చేయించి… శారీరక లేదా మానసిక బలహీనతతో శాశ్వతంగా ప్రజా సేవ కోసం అసమర్థుడైన ఉద్యోగిగా మెడికల్‌ గ్రౌండ్‌ చూయించి, వారి కుటుంబ సభ్యుల నుండి ఒక్కరికి మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ క్రింద ఉద్యోగ అవకాశాన్ని కల్పించడం జరిగింది. వీరు జేఎల్‌ఎం, సబ్‌ ఇంజినీర్‌ పోస్టులను దక్కించుకున్నారు. ఇందుకోసం ఒక్కోక్క అభ్యర్థి సుమారు రూ.30-50 లక్షల వరకూ లంచాల రూపంలో సమర్పించుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ ప్రక్రియ అనేది అన్ని డిపార్ట్‌ మెంట్లలో మురిగిపోయిన అధ్యాయనం. కానీ,అప్పటి సీఎండీ రఘుమారెడ్డి మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ పద్ధతినే సుమారు 200 మందికి అపాయింట్‌ మెంట్‌ ఆర్డర్స్‌ ఇచ్చేయడం విస్మయం కల్గిస్తోంది. నిజానికి టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ లో ఏదైనా ఉద్యోగి జాబ్‌ చేయని పరిస్థితుల్లో ఉన్నారని భావిస్తే, మెడికల్‌ బృందం ఆ ఉద్యోగి శారీరక లేదా మానసిక బలహీనతతో శాశ్వతంగా ప్రజా సేవ కోసం అసమర్థుడైన ఉద్యోగిగా గుర్తించి, వైద్యుల బృందం జారీ చేసిన మెడికల్‌ సర్టిఫికేట్‌ పొందిన తర్వాతే తన కుటుంబంలోని ఒక్కరికి ఉద్యోగం వస్తుంది.
కానీ, దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలో మాత్రం అలాంటి నిబంధలేవీ పాటించకపోవడం గమనార్హం. సంస్థ పూర్వపు సీఎండీ రఘుమారెడ్డి హయాంలో మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ ద్వారా అపాయింట్‌ అయిన 200 మంది దొడ్డిదారిన మెడికల్‌ సర్టిఫికెట్లు, లీగల్‌ అటాచీ అప్రూవల్‌ తెచ్చుకొని ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. ఒక్కో క్క అభ్యర్థి నుంచి లీగల్‌ అటాచీ రూ.2-3 లక్షలు పుచ్చుకొని అప్రూవ్‌ చేసినట్లు సమాచారం. తద్వారా ఒక్క సీఎండీ రఘుమారెడ్డి స్వంత జిల్లా పాలమూరులోనే 70 శాతం మందికి మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ పద్ధతి ఉద్యోగాలు రావడం గమనార్హం. అయితే అప్పట్లో రఘుమారెడ్డి ఈస్థాయిలో ఉద్యోగాలు ఇవ్వడంతో..విద్యుత్‌ సంస్థలకు సంబంధించిన యూనియన్‌ నాయకులు సైతం బ్లాక్‌ మెయిల్‌ చేసి తమకు సంబంధించిన మనుషులను కూడా మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ కింద తమ వారికి జాబ్స్‌ ఇప్పించుకున్నట్లు సమాచారం.

సమాచారం అడిగితే ఇవ్వకుండా..దాటవేత
మరోవైపు 2014 నుంచి ఇప్పటి వరకు మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ కింద టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ లో ఎంత మంది అనర్హులు జాబ్స్‌ పొందారని, వాస్తవాలు తెలుసుకోవాలని సంస్థ కార్యాలయానికి ఆదాబ్‌ హైదరాబాద్‌ తరపున ఆర్టీఐ కింద కొద్ది రోజుల క్రితం దరఖాస్తు చేస్తే..టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ హెచ్‌ఆర్డీ హెచ్వోడీ మురళీకృష్ణ ఇన్ఫర్మేషన్‌ ఇచ్చేందుకు నిరాకరించడం గమ్మత్తుగా ఉంది. మురళీకృష్ణ సమాచారం ఇస్తే ఎక్కడ అప్పటి సీఎండీ రఘుమారెడ్డితో పాటు ఆసంస్థకు సంబంధించిన అవినీతి తిమింగలాల అసలు రంగు బయటపడుతుందోననే ఆయన ఇన్ఫర్మేషన్‌ ఇచ్చేందుకు ససేమీరా అంటుండడం విశేషం. అంతేకాక టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ లో 2014 నుంచి ఇప్పటి వరకూ మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ కింద జరిగిన నియామకాల సమాచారం సమాచార హక్కు చట్టం-2005లోని సెక్షన్‌ 8(1) (ఇ) (జె ) కిందకు వస్తుందని బుకాయించడం విస్మయం కల్గిస్తోంది. ఆదాబ్‌ కోరిన సమాచారం దేశ భద్రతకే ముప్పు ఏర్పడుతున్నట్లు సమాచారాన్ని ఇవ్వకుండా… ఉద్దేశపూర్వకంగా తృతీయపక్షానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వలేమని చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది.
మొత్తంగా అప్పటి ఇప్పటి అధికారుల యవ్వారం చూస్తే గజదొంగలు.. తోడు దొంగలు కలిసి సంస్థను సర్వం ముంచేందుకే పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వాస్తవాలను గ్రహించి చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు సమాచారం ఇచ్చిన హెచ్‌ఆర్డీ హెచ్వోడీ మురళీకృష్ణ శాఖపరమైన చర్యలు తీసుకొని, ఈ యవ్వారంపై సమగ్రంగా విచారించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు