Sunday, April 28, 2024

సంతోషా ఎంత ప‌నిచేస్తివి రా..

తప్పక చదవండి
  • వెలుగు చూస్తున్న టానిక్ వైన్ షాపు అక్ర‌మాలు
  • ఒక్క టానిక్ దుకాణాలకే ఎలైట్ లైసెన్స్
  • పెద్ద ఎత్తున పన్నలు ఎగ్గొట్టినట్లుగా గుర్తింపు
  • గ‌త ప్ర‌భుత్వ అండ‌దండ‌ల‌తో రెచ్చిపోయిన యాజ‌మాన్యం
  • ఎంపీ సంతోష్ కుమార్‌ ఉన్న‌ట్లు అధికారుల గుర్తింపు
  • జీఎస్టీ అధికారుల దాడుల‌తో వెలుగులోకి విస్తుపోయే నిజాలు
  • ఎవ‌రీ ర‌వీంద‌ర్‌రావు..? మ‌రో క‌థ‌నంతో మీ ముందుకు..

టానిక్ స్కాం మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని కుదిపేస్తోంది. స్వయంగా సంతోష్ రావు పాత్ర ప్రత్యక్షంగా ఉందని ఎక్సైజ్ అదికారులు స్పష్టమైన ఆధారాలు సేకరించడంతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొనసాగిన అవినీతి కుంభకోణాల్లో ఇది కూడా కీలకంగా మారింది. నిజానికి రేవంత్ రెడ్డి గతంలోనే టానిక్ వైన్ షాప్ ల కుంభకోణంపై ఆధారాలు సేకరించారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే కెసిఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యకలాపాల జాబితాలో టానిక్ స్కాం ను కూడా చేర్చారు.. ఈ జాబితాలో ఉన్న అంశాలపై ప్రాధాన్యత క్రమంలో దర్యాప్తులు చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల వేళ టైమ్ చూసి బీఆర్ఎస్ ను గట్టిగా ఇరుకున పెట్టడానికే ఆఘమేఘాల మీద దర్యాప్తు చేయించారు. టానిక్ స్కాం దర్యాప్తు విషయంలో ఎవరి జోక్యం చేసుకోకుండా స్వయంగా ముఖ్యమంత్రే దర్యాప్తును ప్రత్యేకంగా పర్వవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది…

మనదే ప్రభుత్వం ఏం చేసినా నడుస్తుందని చాలా వ్యవహారాలు గత ప్రభుత్వంలో జరిగాయి. అందులో ఒకటి టానిక్ లిక్కర్ మాల్స్. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వ పెద్దల అండతో.. స్పెషల్ జీవోలు విడుదల చేసి మరీ.. వందల కోట్ల ట్యాక్స్‌ ఎగవేసిన బడా కుంభకోణం బయటకు వచ్చింది. టానిక్ మద్యం దుకాణాల తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌ కు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టానిక్‌ గ్రూప్స్‌కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్‌ బ్రాండ్‌కు గత ప్రభుత్వంలో అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న టానిక్‌ ఎలైట్‌ వైన్‌ షాపులో జీఎస్టీ అధికారులు చేపట్టిన సోదాల్లో విస్తుపోయే విషయాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్‌కు ఉన్నట్టు సోదాల్లో అధికారులు గుర్తించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టానిక్‌కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు..

ప్రస్తుతం నగరంలో టానిక్‌కు 11 ఫ్రాంచైజ్‌లు ఉండగా.. క్యూ బై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. తెలంగాణలో ఏ వైన్ షాప్‌కు లేని ప్రత్యేక అనుమతులు కేవలం టానిక్‌‌కు మద్యం దుకాణానికి మాత్రమే ఉండటం గమనార్హం. ఈ మేరకు ప్రత్యేక జీవోను కూడా గత ప్రభుత్వం విడుదల చేసింది. టానిక్ వైన్ షాప్‌కి రాష్ట్రంలో ఏ డిపో నుంచైనా మద్యం తీసుకునే వెసులుబాటుతో పాటు దేశంలో ఏ రాష్ట్రం నుంచైనా రకరకాల మద్యం బ్రాండ్లను తెచ్చుకుని టానిక్‌లో విక్రయించుకునేలా అనుమతులు ఇచ్చారు. విదేశీ మద్యం అమ్మకానికి 2016లో గత ప్రభుత్వం ప్రత్యేక జీవోతో అనుమతి ఇవ్వగా.. 2017లో అమ్మకాలు మొదలు పెట్టారు.

విదేశీ మద్యం విక్రయాల్లో ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎగవేసిన ఆధారాలను రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ సేకరించింది. హైదరాబాద్ లోని ‘టానిక్, వాటి అనుబంధ మద్యం దుకాణాలు, గోదాముల్లో ఈ శాఖ అధికారులు తనిఖీ చేశారు. జీఎస్టీ, వ్యాట్ ఎగవేత ఆధారాలు సేకరించారు. మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ‘వ్యాట్ వసూలు చేస్తోంది. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ (బీసీఎల్) గోదాముల నుంచి దుకాణాలకు మద్యం నిల్వలు తీసుకెళ్లే వ్యాపారులు ఎంత వ్యాట్ చెల్లించారనే వివరాలను బిల్లులపై రాయాలి. వ్యాట్ ప్రస్తావన లేకుండానే మద్యం నిల్వలను ఈ దుకాణాలకు పంపుతున్నా.. ఏళ్ల తరబడి బీసీఎల్ పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎంత మద్యం విక్రయించారు, ఎంత వ్యాట్ చెల్లించారనే వివరాలను ఈ దుకాణాల వ్యాపారులు పూర్తిగా ఇవ్వలేదని తెలుస్తోంది. మద్యం కొనుగోలుదారులకు ఇచ్చే రసీదు (ట్యాక్స్ ఇన్వాయిస్)ను జీఎస్టీ నంబరుతో ఈ దుకాణాల్లో జారీచేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం అమ్మకాల రసీదులో వ్యాట్ వివరాలు మాత్రమే పేర్కొనాలి. జీఎస్టీ కింద మద్యం అమ్మకాలు లేవు. అయినా జీఎస్టీ పేరుతో ఎందుకు ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు? ఇప్పటివరకూ ఎంత తీసుకున్నారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ దుకాణాల్లో ఆహార పదార్థాల విక్రయానికి ప్రభుత్వ అనుమతి లేదు. అయినా వాటిని విక్రయిస్తూ జీఎస్టీ చెల్లించకుండా మోసం చేస్తున్నట్లు తేలింది.

అయితే.. ఏడేళ్లుగా టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా తేలింది. ఇందులో ఎక్సైజ్ శాఖలోని ఉన్నతాధికారితో పాటు ఓ ఐఏఎస్ అధికారి పాత్ర కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇన్నేళ్ల నుంచి వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొడుతున్నా ఎక్సైజ్ శాఖ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పట్టించుకోకపోవడానికి గల కారణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఇందుకు ప్రధాన కారణం..

టానిక్ ఎలైట్ వైన్ షాప్ యజమానులుగా.. బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్సీ ఉండటమేనని అధికారులు గుర్తించారు. అంతేకాదు 11 మద్యం షాపులను అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి అనే వ్యక్తులు నడిపిస్తుండడం విశేషం. ఇక ఈ గ్రూప్ పరిధిలో బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న షాపుల్లో ముగ్గురు రాష్ట్ర ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులకు వాటాలు ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో సీఎంవో అధికారిగా పనిచేసిన భూపాల్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, ఎక్సైజ్ ఉన్నతాధికారి ర‌వీంద‌ర్ రావు కూతురు హారిక‌, మరో అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంక రెడ్డి కి టానిక్ గ్రూప్ లో వాటాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే అప్ప‌టి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. ఏడేళ్ల పాటు మద్యం విక్రయాల లెక్క తీస్తే ఎంత ట్యాక్స్ ఎగ్గొట్టారో బయట పడుతుందని జీఎస్టీ అధికారులు లెక్కలేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవటంతో.. బీఆర్ఎస్ నేతలు తమ వాటాలు వేరే వ్యక్తులకు అమ్ముకున్నట్టు సమాచారం. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా దాడులు చేయగా.. యజమానులు వాళ్లు కాదని తేలటంతో అవాక్కవటం అధికారుల వంతైంది. దీంతో.. టానిక్‌తో పాటు దానికి అనుబంధంగా ఉన్న అన్ని మద్యం షాపుల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జీఎస్టీ, వ్యాట్‌ ఎగవేత కోణాలతో పాటు మద్యం బదిలీ, పన్ను చెల్లించని మద్యం అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ దుకాణం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు వస్తున్న వార్తల కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం.

అయితే.. తాము మాత్రం నిబంధనలకు లోబడే వ్యాపారం నిర్వహిస్తున్నట్టు టానిక్‌ సంస్థ చెప్తుండటం గమనార్హం. చూడాలి మరి.. ఈ కుంభకోణంలో ఎంత మంది పేర్లు బయటికొస్తాయి.. ఎన్ని వందల కోట్ల స్కాం బయటపడుతుందో..! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. మీరూ మీ ఎక్సైజ్ శాఖ టానిక్ స్కాం పై నిక్కచ్చి గా దర్యాప్తు చేయించి టానిక్ సంస్థ ఇప్పటివరకు ఎగవెసిన మొత్తాన్ని వసూల్ చేసినట్లైతే ప్రజా సంక్షేమ పథకాలకు ఉపయోగపడతాయి.

గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ఎక్సైజ్ మంత్రిగా ఉన్న వి. శ్రీనివాస్ గౌడ్ ను విచారిస్తే మ‌ధ్యం కుభ‌కోణంలో జ‌రిగిన అవినీతి విష‌యాలు బ‌ట్ట‌బ‌య‌లు అవుతాయ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు కోరుతున్నారు. గ‌త మునుగోడు ఉప ఎన్నిక‌లో ఏరులై పారిన న‌కిలీ మ‌ధ్యం మంత్రి శ్రీనివాస్ గౌడ్ క‌నుస‌న్న‌లోనే జ‌రిగిన విష‌యం కూడా తెలిసిందే. ఎంతో ప్ర‌జ‌లు అనార్యోగానికి కూడా గురైయ్యారు. కావున అప్ప‌టి బీఆర్ఎస్ ప్ర‌భుత్వ ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌ను విచారిస్తే మ‌రిన్ని విష‌య‌లు వెలుగులోకి వ‌స్తాయి…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు