- పఠాన్ చెరు నియోజకవర్గంలో వింత పోకడ..
- చెంచాగిరి, ధనం, అవినీతే ఇక్కడ ప్రాధాన్యం..
- వేరే ఎవరైనా ఎమ్మెల్యే అయితే మొదటికే మోసం
వస్తుందని భావిస్తున్న ప్రధాన పార్టీలు.. - ఇదే కారణంతో నీలం మధును దూరం పెడుతున్నారా.. ?
- నీలం మధు సామాజిక వర్గంలో గెలుపును
శాసించే స్థాయిలో ఓటర్లు ఉన్నారు.. - ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా నీలం మధు గెలుపు ఖాయం..
అంటున్న రాజకీయ విశ్లేషకులు.. - పఠాన్ చెరు నియోజక వర్గంలో ఆసక్తిని రేపుతున్న
రాజకీయ పరిణామాలు.. - ఆదాబ్ పాఠకులకు బీవీఆర్ రావు అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపు గుర్రాలకోసం ప్రాకులాడుతాయి.. గెలిచే వ్యక్తులకు టికెట్లు ఇచ్చి, తమ పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేసుకుంటాయి.. తద్వారా ప్రజల్లో మరింత విలువను ఆపాదించుకుంటాయి.. రాజకీయాల్లో ఇది సర్వ సామాన్యం.. అయితే తెలంగాణ రాష్ట్రంలో పఠాన్ చెరు రాజకీయాలు ఇందుకు భిన్నంగా సాగుతున్నాయి.. అవినీతి పరులకు, తమ సామాజిక వర్గాల వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు పార్టీ అధినేతలు.. ఇది వాచనీయం కాకపోయినా వారి అవసరాలు అలా మారుస్తున్నాయి.. దీనివల్ల సమాజానికి మేలు జరుగకపోగా తీవ్రమైన నష్టాలు ఎదురవుతున్నాయి.. ప్రజా సంక్షేమం కుటుబడిపోతోంది.. అడ్డదారిలో, అక్రమాల వంతెనమీద రాజకీయాల్లోకి వచ్చి, డబ్భులు వెదజల్లి గెలుస్తూ.. అక్రమార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న రాజకీయ కంటకులు ఉన్నంత కాలం సమాజం వెనుకబడిపోతూనే ఉంటుంది..
హైదరాబాద్ : తెలంగాణాలో సార్వత్రిక ఎన్నికల నగారా మ్రోగింది.. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈమేరకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసింది.. ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎన్నికలో తలమునకలవుతున్నాయి.. కొన్ని స్థానాల్లో ఏకాభిప్రాయానికి వచ్చినా.. కొన్ని స్థానాల్లో చిక్కుముడి ఇంకా విడివడలేదు.. ఇక తెలంగాణాలో అధికార పార్టీ అయిన బీ.ఆర్.ఎస్. తమ అభ్యర్థులను ఎప్పుడో ప్రకటించేసింది.. కాగా ఎవరికీ బీ ఫార్మ్ అందుతుంది అన్నది ప్రశ్నార్థకంగానే మిగిలింది.. ఇదిలాగా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు ఒకెత్తయితే.. ప్రస్తుతం పఠాన్ చెరు నియోజకవర్గం వార్తల్లోకి ఎక్కింది.. ఈ నియోజకవర్గంలో బీ.ఆర్.ఎస్. పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డిని తిరిగి ప్రకటించారు గులాబీ బాస్.. అయితే మహీపాల్ రెడ్డి పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. ఆయన సోదరులు భూ కబ్జాలకు పాల్పడటం లాంటి మరెన్నో అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిసిందే.. వారు చేసిన నిర్వాకం వలన వందలమంది పేదలు రోడ్డుమీద పడ్డ సంగతి కూడా తెలిసిందే.. కాగా నియోజక వర్గ వ్యాప్తంగా ఎన్నెన్నో భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలకు మహిపాల్ రెడ్డి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించినట్లు పలు ఆరోపణలు హల్ చల్ చేశాయి.. అయితే ఆయనకు రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఆశీస్సులు మెండుగా ఉన్నాయనే ఆరోపణలు ఊన్నాయి.. పైగా మంత్రితో ఎమ్మెల్యేకు వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నట్లు వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.. ఈ కారణం చేత నిజానిజాలు బహిర్గతం కాకుండా ఉండాలంటే తిరిగి మహిపాల్ రెడ్డిని గెలిపించుకునే ప్రయత్నాల్లో హరీష్ రావు ఉన్నాడన్నది జగమెరిగిన సత్యం.. కాగా నియోజకవర్గ ప్రజల్లో మహీపాల్ రెడ్డి మీద సరైన అభిప్రాయం లేదనేది నిజం.. వారు విసిగిపోయారన్నది కూడా వాస్తవం.. ఈ క్రమంలో బీ.ఆర్.ఎస్. పార్టీకే చెందిన యువ రాజకీయ కిశోరం నీలం మధు ముదిరాజ్.. ప్రజా సేవలో దూసుకుపితున్నాడు.. అధికార పార్టీ ఎమ్మెల్యేకు పూర్తి భిన్నంగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా.. కేవలం ప్రజా శ్రేయస్సుకోసమే ఆయన పాటు పడుతున్నారు.. ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. ప్రభుత్వంతో సంబంధం లేకుండా తన సొంత డబ్బులతో లెక్కలేని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాడు.. పిలిస్తే పలికే నేతగా ఆయన పేరు సంపాదించుకున్నారు.. నియోజక వర్గ వ్యాప్తంగా నీలం మధును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని, బహుజన వర్గాలతో పాటు అన్ని వర్గాలు కోరుకుంటున్నారు.. పైగా పఠాన్ చేరు నియోజకవర్గంలో నీలం మధు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు రికార్డు స్థాయిలో ఉన్నారు.. ప్రజా నాయకుడిగా ఆయనను గెలిపించుకోవడానికి తమ సర్వ శక్తులూ ఒడ్డటానికి నియోజక వర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎలాగైనా ఆయనే తమ నాయకుడిగా వుండాలని వారు ఆశిస్తున్నారు.. అవినీతి మరక అంటిన గూడెం మహీపాల్ రెడ్డికి ఈసారి బీ.ఆర్.ఎస్. నుండి టికెట్ రాదని అందరూ భావించారు.. నిజాయితీపరుడైన నీలం మధుకు గులాబీ బాస్ తప్పనిసరిగా టికెట్ ఇస్తారని ఆశించారు.. కానీ నియోజకవర్గ ప్రజల ఆశలను అడియాసలు చేస్తూ కేసీఆర్ తిరిగి గూడెం పేరును ప్రకటించడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.. దీనికంతటికీ కారణం హరీష్ రావే అని వారందరూ గ్రహించారు.. తన మామ దగ్గర చక్రం తిప్పిన హరీష్ గూడెం పేరు ప్రకటించేలా చేయడంలో విజయం సాధించారు.. దీంతో తమ అవినీతి చరిత్ర బహిర్గతం కాకుండా ఉంటుందని ఆయన భావించారు.. ఎన్ని కుతంత్రాలు చేసి అయినా సరే ఈసారి కూడా మహీపాల్ రెడ్డినే గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.. అయితే నీలం మధు కు బాసటగా నడుస్తున్న అన్నివర్గాల ప్రజలు గూడెం కు ఓట్లు వేస్తారా అన్నది సందేహమే..
గెలిచే సత్తా ఉన్న నీలం మధును ఇటు కాంగ్రెస్ వారు గానీ, అటు బీజేపీ వారు గానీ పట్టించుకోకపోవడం వెనుక కారణం అన్వేషిస్తే సరైన సమాధానం మాత్రం దొరకడం లేదు.. ఒక నిజాయితీ పరుడిని, సేవా తత్పరుడిని, గెలిచే అవకాశం ఉన్న వ్యక్తిని పార్టీలన్నీ దూరం పెట్టడం శోచనీయం.. అయితే ఇక్కడ అన్ని పార్టీలదే ఒకే ఆలోచన స్వతంత్రంగా నిలబడ్డా నీలం మధు ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు వంద శాతం కనిపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.. కాగా ఆదివారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన ముదిరాజుల ఆత్మగౌరవ సభలో నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ఏపార్టీ అయితే తమను ఆదరిస్తుందో వారికే తమ మద్దతు ఉంటుందని కుండబ్రద్దలు కొట్టినట్లు ప్రకటించారు.. ఈ సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ కూడా అక్కడే ఉండటం విశేషం.. మరి బీజేపీ అధిష్టానానికి ఈటల ఈ వ్యవహారం గురించి తెలియజేసే అవకాశం కూడా లేకపోలేదు.. యువకుడైన నీలం మధు తను స్థాపించిన ఎన్.ఎం.ఆర్. యువసేన ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతలో కూడా తిరుగులేని పేరు సంపాదించుకున్నారు.. ఇది కూడా ఆయనకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు..
పఠాన్ చెరు నియోజకవర్గం వ్యాప్తంగా :
మొత్తం ఓటర్లు : 3. 3 లక్షల మంది ఉన్నారు..
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు దాదాపు 80 నుంచి 85 వేల మంది ఉన్నారు..
మున్నూరు కాపు ఓటర్లు సుమారు 30 వేలమంది ఉన్నారు..
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు దాదాపు 35 నుంచి 40 వేలమంది దాకా ఉన్నారు..
మైనారిటీ వర్గానికి చెందిన ఓటర్లు సుమారు 30 వేలమంది ఉన్నారు..
రాజ రాజ వర్గానికి చెందిన ఓట్లు సుమారు 25 వేల వరకు ఊన్నాయి..
యాదవ వర్గానికి చెందిన ఓటర్లు 40 వేలమంది ఉన్నారు..
ఇక గౌడ్స్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు దాదాపు 20 వేలకుపైగా ఉన్నారు..
ఈ సామాజిక వర్గాల ఓట్లన్నీ దాదాపు నీలం మధుకే పడే సూచనలు వంద శాతం ఉన్నాయి.. కనుక ఆయన గెలుపు నల్లేరుమీద నడక లాంటిదే.. స్వతంత్ర అభ్యర్థిగా మధు పోటీచేసిన భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.. కనుక ప్రధాన పార్టీలు ఒక సారి నీలం మధు ముదిరాజ్ మీద దృష్టి పెడితే ఎంతో మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.. చూద్దాం ఏమి జరుగనుందో..?