Friday, May 3, 2024

ఎంఎస్‌ స్వామినాథన్‌ కన్నుమూత

తప్పక చదవండి

చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

  • అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర..
  • భారత హరిత విప్లవానికి జాతిపిత
  • ఆయన వయసు 98 ఏళ్ళు
  • రామన్‌ మెగాసెస్సే అవార్డు అందుకున్న ఇండియన్‌
  • సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్‌, మంత్రులు, పలురంగాల ప్రముఖులు

చెన్నై: భారతీయ హరిత విప్లవానికి జాతిపితగా కీర్తించబడే ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 98 ఏళ్లు. భారతీయ వ్యవసాయ రంగంలో ఆయన అనేక విప్లవాత్మక మార్పులను సృష్టించారు. అత్యధిక స్థాయిలో దిగుబడిని ఇచ్చే అనేక వరి వంగడాలను ఆయన డెవలప్‌ చేశారు. తక్కువ ఆదాయం ఉన్న రైతులకు .. దిగుబడిని పెంచే అనేక పద్ధతులను ఆయన నేర్పారు. 1987లో స్వామినాథన్‌కు వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ అవార్డు దక్కింది. ఆ తర్వాత ఆయన చెన్న్కెలో ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసర్చ్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. స్వామినాథన్‌ అనేక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. 1971లో ఆయన రామన్‌ మెగస్సేసే అవార్డును సొంతం చేసుకున్నారు. 1986లో ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ వరల్డ్‌ సైన్స్‌ అవార్డు ఆయన్ను వరించింది. స్వామినాథన్‌కు భార్య విరీనాతో పాటు ముగ్గురు కుమార్తెలు సౌమ్యా స్వామినాథన్‌, మధురా స్వామినాథన్‌, నిత్యా స్వామినాథన్‌ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో సౌమ్యా స్వామినాథన్‌.. చీఫ్‌ సైంటిస్టుగా ఉన్న విషయం తెలిసిందే.
సంతాపం ప్రకటించిన కేసీఆర్‌.. దేశ వ్యవసాయం పెద్ద దిక్కును కోల్పోయిందని వ్యాఖ్య.. భారతీయ హరిత విప్లవానికి జాతిపితగా కీర్తించబడే ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ గురువారం రోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే.. ఎంఎస్‌ స్వామినాథన్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని కేసీఆర్‌ తెలిపారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్‌ వినూత్న పద్ధతులు చేర్చారని గుర్తు చేశారు. స్వామినాథన్‌ కృషి వల్లే ఆహారాభివృద్ధిలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించిందన్నారు. రైతుల గుండెల్లో స్వామినాథన్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని కేసీఆర్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు తెలంగాణ మంత్రులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన పరిశోధనలు, సిఫారసుల ద్వారా అటు రైతులకు ఆదాయం పెంచడంతో పాటు, ఇటు దేశ ప్రజల ఆహార కొరతను తీర్చిన మహానుభావుడు స్వామినాథన్‌ అంటూ మంత్రి హరీశ్‌ రావు చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధిని స్వామినాథన్‌ ప్రశంసించినట్టు మంత్రి నిరంజన్‌ రెడ్డి గుర్తు చేశారు. అన్నదాతల ఆత్మబంధువు స్వామినాథన్‌ అని మంత్రి కొనియాడారు. యావత్‌ దేశానికి తన పరిశోధనలతో ఎంతో సేవ చేశారని స్వామినాథన్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌ కొనియాడారు. ఆయన కృషితోనే నేడు భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తున్నదన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు