Wednesday, May 15, 2024

రాష్ట్రంలో ఎన్నికలవేళ తగ్గిన మద్యం అమ్మకాలు

తప్పక చదవండి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎన్నికల వేళ మద్యం అమ్మకాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో.. అనధికార మద్యం, గుడుంబా తయారీ పెరిగాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అబ్కారీ శాఖ అధికారులు నిఘా కట్టుదిట్టం చేశామని చెబుతున్నప్పటికీ.. మద్యం విక్రయాలు ఎందుకు పెరగడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. అధికారులు అంచనా వేశారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మద్యం అమ్మకాలు ఊపందుకోకపోవడంపై.. ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. లిక్కర్‌ 90ఎంఎల్‌ బాటిల్‌పై 10 రూపాయలు తగ్గించారు. దీని వల్ల లిక్కర్‌ అమ్మకాలు అధికమై.. టర్నోవర్‌ పెరగడం వల్ల ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఆ ప్రభావం పెద్దగా లేదని తెలుస్తోంది. 2022 అక్టోబర్‌ 9 నుంచి.. నవంబర్‌ 18 వరకు రూ.3.470 కోట్ల విలువైన.. 37.76 లక్షల లిక్కర్‌ కేస్‌లు.. 40.85 లక్షల కేస్‌ల బీర్ల అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా ఈ ఏడాది గత నెల 9 నుంచి.. ఈ నెల 18 వరకు రూ.3.850 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 38.66 లక్షల కేస్‌ల లిక్కర్‌, 56.76లక్షల కేస్‌ల బీర్ల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో 40 రోజుల్లో కేవలం రూ.380 కోట్ల రూపాయల విలువైన మద్యం మాత్రమే.. అదనంగా అమ్ముడు పోయినట్లు స్పష్టమవుతోంది. సాధారణంగానే ప్రతి ఏడాది లిక్కర్‌ సేల్స్‌ 10 నుంచి 15 శాతం వరకు పెరుగుదల నమోదు అవుతుంటుంది. ఇప్పుడు పెరిగిన రూ.380 కోట్లు అంటే.. కేవలం 11 శాతం మాత్రమే అమ్మకాలు పెరిగాయి. తద్వారా సాధారణంగా పెరగాల్సిన విక్రయాలు కూడా పెరగలేదని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో మద్యం పెద్ద ఎత్తున వాడకం జరుగుతున్నప్పటికీ.. ఎందుకు ఆశించినంత విక్రయాలు పెరగడం లేదని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. గడిచిన వారం రోజులుగా జరిగిన మద్యం అమ్మకాలను పరిశీలించినట్లయితే.. ఈ నెల 13, 16 రెండు రోజులు మాత్రమే రూ.100 కోట్లుకుపైగా లిక్కర్‌ అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. మిగిలిన రోజుల్లో రోజుకు రూ.75 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు మాత్రమే విక్రయాలు జరిగినట్లు సమాచారం.అబ్కారీ శాఖ పెద్దఎత్తున తనిఖీలు చేపట్టినా.. స్థానిక నాయకులతో ఉన్న పరిచయాలతో చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీంతో అనధికార మద్యం సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సమీక్ష చేసిన రాష్ట్ర ఉన్నతాధికారి.. క్షేత్రస్థాయిలో విధులు సక్రమంగా నిర్వహించడం లేదన్న భావన వ్యక్తం చేసినట్లు సమాచారం. తక్షణమే నిఘా పెంచి బెల్ట్‌ దుకాణాలను రద్దు చేయడంతో పాటు.. బయట రాష్ట్రాల నుంచి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ సరఫరా రాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో గుడుంబా తయారీ, నాన్‌డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ సరఫరాలు పూర్తిగా కట్టడి అయ్యి.. మద్యం అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్‌ శాఖ అంచనా వేస్తోంది. మద్యం సరఫరాపై అధికారులు ప్రత్యేక బృందాలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు