Wednesday, May 8, 2024

కాలంతో పోటీ పడదాం.!

తప్పక చదవండి

మానవ జీవితం చాలా అమూల్యమైనది. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా ముగిసితుందో ఎవరికీ తెలియదు. అదొక దైవ రహస్యం. దాన్ని ఛేదించే శక్తి దైవం ఎవ్వరికీ ప్రసాదించలేదు. జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకోవడం పైన్నే సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనం ఏదైనా సాధించవచ్చు.. ఛేదిం చవచ్చు. డబ్బు.., గౌరవం.., ఉద్యోగం.., అధికారం.., హోదా.. ఏదైనా కావచ్చు, అదిసాధ్యమే.. కాని కాలాన్నిమాత్రం ఎంత ధనం ధారపోసినా, ఎంతపలుకుబడి ఉపయోగించినా సాధించ లేము. గడిచినకాలం – అది రెప్ప పాటైనా సరే – కోట్లు కుమ్మరిం చినా మనకు లభించదు. ఇది కాలం చెప్పే సత్యం. మనం దాని విలువను గుర్తించకపోతే అది మనకోసం ఆగదు. సమయాన్ని సమర్ధవంతంగా సద్వినియోగం చేసుకోగలిగినప్పుడే అదిమనకు ఉపకరిస్తుంది. లేకపోతే అదిమనల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి ముందుకు సాగిపోతుంది. అందుకని మనం ఏవిషయంలో అయినా సకాలంలో స్పందించ గలగాలి. సమయం మించి పోయిన తరువాత తీరిగ్గా విచారిస్తే ప్రయోజనం ఉండదు. అవకాశాలు ఎప్పుడూ మనకోసం నిరీక్షిస్తూఉండవు. అవకాశాలను మనమే సృష్టించుకోవాలి. మనమే వాటిని అందిపుచ్చుకోవాలి. అవి మన వద్దకు రావాలని ఆశించడం సరికాదు. ఎప్పుడు ఏది అవసరమో దానిపై దృష్టి కేంద్రీకరించాలి. బాధ్యతల నిర్వహణలో అలసత్వాన్ని దరి చేరనీయకూడదు. ఎందుకంటే, ఈరోజు చేయవలసిన కార్యాన్ని రేపటికి వాయిదా వేశామంటే కాలానికి మనం విలువ ఇవ్వనట్లే లెక్క. ఈనాటి కొద్దిపాటి అలక్ష్యం రేపటి బాధ్యతను రెట్టింపుచేస్తుంది. ఒకటికి రెండుతోడై, బాధ్యతలు పేరుకు పోతాయి. ఇక ఆతరువాత బాధ్యతల నిర్వహణ తలకు మించిన భారంగా మారి, పలాయనవాదాన్ని ఆశ్రయించే దుస్థితి వస్తుంది. అద్భుతమైన విజయాలను సాధించినవారి జీవితాలను పరిశీలిస్తే, వారు కాలాన్ని (సమయాన్ని) ఎలా తమకు అనుకూలంగా మలచు కొని, సద్వినియోగం చేసుకొని, కొత్త అవకాశాలను సృష్టించు కున్నారో, కొంగ్రొత్త ఆవిష్కరణలకు ఎలా నాంది పలికారో మనకు అర్ధమవుతుంది. ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్‌ అల్వా ఎడిసన్‌ తన జీవితకాలంలో వెయ్యికంటే ఎక్కువ నూతన ఆవిష్కరణలకు నాంది పలికాడు. వాటిలో గ్రామ్‌ ఫోన్‌, విద్యుత్తుబల్బు అతని ఆవిష్క రణలే. ఇది ఎలాసాధ్యమైంది? అతను కాలం నాడిని ఒడిసిపట్టి, దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కాలక్షేపం కోసం కాలాన్ని దుర్వినియోగం చేయలేదు. సరదాలు, షికార్లు, సొల్లు కబుర్లకోసం సమయాన్ని నిర్లక్ష్యం చేయలేదు. నేటి యువతకులాగా (అందరూ కాదు సుమా) స్మార్ట్‌ ఫోనుకే అతుక్కుపోయి, ఫేస్‌ బుక్కు, వాట్సాపు చాటింగుల్లో సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుగా, ఆనాడతను సమయాన్ని దుర్వినియోగం చెయ్యలేదు. తన ప్రయోగశాలనే వినోదశాలగా మార్చు కున్నాడు. చేస్తున్న పనిలోనే ఆనం దాన్ని, వినోదాన్ని అనుభవించాడు. కాలం విలువను గుర్తించబట్టే, విద్యుత్‌ బల్బును కనుగొనే సమయంలో ఏకధాటిగా పన్నెండు, పదమూడు రోజులు ప్రయోగశాలలోనే నిద్రలేని రాత్రులు గడిపాడు. అనుకున్నది సాధించాడు. అందుకని కాలం విలువను గుర్తించాలి. దాని ప్రాధాన్యతను అర్ధం చేసుకోవాలి. జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకొని విజయ తీరాలకు చేరినవారి గాధల్ని అధ్యయనం చెయ్యాలి. స్పూర్తిపొందాలి. అపజయాలు మూటగట్టుకొని కాలగతిలో కలిసిపోయిన వారి గాధల్ని గుణపాఠాలుగా తీసు కోవాలి. కాలం / సమయం మనకు అనేక నిజాలు చెబుతోంది. బుధ్ధిజీవి అయిన మానవుడు వాటిని అవలోకన చేసుకుంటూ, నీతిగా, నిజాయితీగా, విలువలతో కూడిన జీవితం గడుపుతూ, ఆత్మస్థయిర్యంతో ముందుకు సాగితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాలను సాధించ వచ్చు. గమ్యాన్ని ముద్దాడవచ్చు. దేవుడు మనందరికీ ఈకొత్త సంవత్సరంలో సకల శుభాలూ, సంతోషాలు కలుగ జేయాలని, గతం నుండి గుణ పాఠాలు నేర్చుకుంటూ వెలుగులవైపు నడిపించాలని కోరుకుందాం.!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు