Saturday, May 11, 2024

ఆస్పత్రి నుంచి కెసిఆర్‌ డిశ్చార్జ్‌

తప్పక చదవండి
  • నేరుగా నందినగర్‌ ఇంటికి చేరిక
  • దిష్టితీసి ఇంట్లోకి తీసుకెళ్లిన కుటుంబ భ్యులు
  • వెంటవచ్చిన కెటిఆర్‌ తదిరులు
  • కెసిఆర్‌ భద్రతను కుదించిన ప్రభుత్వం

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యశోద ఆస్పత్రి నుంచి శుక్రవారం ఉదయం డిశ్చార్జ్‌ అయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన కేసీఆర్‌.. నేరుగా బంజారాహిల్స్‌ నంది నగర్‌లోని తన సొంతింటికి వెళ్లారు. ఆయనకు ఇంటివద్ద గుమ్మడికాయతో దిష్టితీసి ఇంట్లోకి తీసుకుని వెళ్లారు. కేసీఆర్‌ వెంట కేటీఆర్‌, హరీశ్‌రావు ఉన్నారు. హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ కారణంగా కేసీఆర్‌ యశోద ఆస్పత్రిలో వారం రోజుల పాటు ఉన్నారు. చికిత్స అనంతరం కేసీఆర్‌ కోలుకోవడంతో.. వైద్యులు శుక్రవారం డిశ్చార్జ్‌ చేశారు. మరో నాలుగైదు వారాల పాటు కేసీఆర్‌ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నెల 8వ తేదీన రాత్రి కేసీఆర్‌ తన వ్యవసాయ క్షేత్రంలో కాలు జారి కింద పడిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్‌ను కుటుంబ సభ్యులు సోమాజి గూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. 9వ తేదీన కేసీఆర్‌ హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత కేసీఆర్‌ను వాకర్‌ సాయంతో వైద్యులు నడిపించారు. తుంటి మార్పిడి విజయవంతం కావడం, మరుసటి రోజునే ఆయన వాకర్‌ సాయంతో నడవడం, ఆరోగ్యం కుదుటపడడంతో డిశ్చార్జి చేయాలని వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. డిశ్చార్జి తర్వాత కేసీఆర్‌ హైదరాబాద్‌ నందినగర్‌లోని తన పాత ఇంటికి వెళ్లారు. కేసీఆర్‌ డిశ్చార్జి అవుతారని తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు నందినగర్‌లోని పాత ఇంట్లో ఆయన ఉండడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. వైద్య సేవల కోసం తరచూ ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బంది కలగకుండా దగ్గరగా ఉంటుందని.. నందినగర్‌లోని ఇంట్లోనే ఉండాలని కేసీఆర్‌ నిర్ణయించు కున్నారని సమాచారం. అయితే తనను పరామర్శించేందుకు ఎవరూ రావద్దని ఆస్పత్రిలో ఉండగానే కెసిఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఇక ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రభుత్వం భద్రతను కుదించింది. ఆయనకు వై కేటగిరి’ భద్రతను ప్రభుత్వం కేటాయించింది. మాజీ మంత్రులకు 2ప్లస్‌ 2 భద్రతను పోలీస్‌ శాఖ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యేలకు పూర్తిగా భద్రత తొలగించింది. వారికి కేటాయించిన గన్‌మెన్లను పోలీసు ఉన్నతాధికారులు వెనక్కి పిలిపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరెవరికి భద్రత అవసరమనే అంశంపై.. ఉన్నతాధికారులతో సవిూక్షించి అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇంటెలిజెన్స్‌ నివేదిక మేరకు గన్‌మెన్లను పోలీసు శాఖ కేటాయించనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు