Friday, May 3, 2024

తీర్పు నేడు..

తప్పక చదవండి
  • చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు నేటికీ వాయిదా..
  • ఉదయం పదిన్నరకు తీర్పు వెలువరిస్తామన్న న్యాయమూర్తి..
  • ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన కస్టడీ పిటిషన్ తీర్పు..
  • కస్టడీ పిటిషన్‌పై బుధవారమే పూర్తయిన వాదనలు..

అమరావతి : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కస్టడీ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. నేటి ఉదయం గం.10.30 సమయానికి ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడటంతో అందరిలోను ఉత్కంఠ కనిపిస్తోంది. ఇది రిజర్వ్ తీర్పు కాబట్టి నేడు రావొచ్చు లేదా సోమవారం నాటికి రావొచ్చునని న్యాయనిపుణులు చెబుతున్నారు. కస్టడీ పిటిషన్‌పై బుధవారం రోజే వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి నేడు ఉదయం తీర్పు వెలువరిస్తామని తెలిపారు. గురువారం రోజు ఉదయం మళ్లీ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేశారు. సాయంత్రం మరోసారి వాయిదా పడింది. నేడు తీర్పు చెబుతామని న్యాయమూర్తి తెలిపారు. చంద్రబాబు కస్టడీని కోరుతూ సీఐడీ… ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరిన్ని విషయాలు వెలికితీసేందుకు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరఫు న్యాయవాది కోరగా, సిట్ కార్యాలయంలో ఇప్పటికే విచారణ జరిపారని, రాజకీయ కక్షపూరిత కేసు కాబట్టి కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

చంద్రబాబు రిమాండ్ ముగుస్తున్నందున కస్టడీ ఇవ్వాలని సిఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. చంద్రబాబు నాయుడు క్వాష్‌ పిటిషన్‌ హైకోర్టులో ఉంది. ఈ పిటిషన్‌కు సంబంధించిన వివరాల గురించి ఏసీబీ కోర్టు జడ్జి ఆరా తీశారు. ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్‌ అయితే, తీర్పు వాయిదా వేస్తామని, క్వాష్‌ పిటిషన్‌ లిస్ట్‌ కాకపోతే తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు.

- Advertisement -

మరోవైపు.. ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు నాయుడిని విచారించేందుకు 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ కూడా నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును విచారించేందుకు పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిన అవసరంలేదని ఆయన తరఫు న్యాయవాదులు బుధవారం వాదించారు. 5 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చాలని కోరారు. పోలీసు కస్టడీ పేరుతో విచారణ చేసి, ఆ వివరాలను ఎంపిక చేసుకున్న ఛానళ్ల ద్వారా ప్రచారం చేసి ప్రజల్లో చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయాలనే లక్ష్యంతో దర్యాప్తు సంస్థ వ్యవహరిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రత్యేక పీపీ వివేకానంద వాదనలు వినిపించారు. అరెస్టు అనంతరం పూర్తి స్థాయిలో విచారించడానికి తగిన సమయం లేదన్నారు. చంద్రబాబును పోలీసు కస్టడీలో విచారిస్తే తప్పేంటని అన్నారు. ఈ కేసులో విచారణకు సహకరించాలని నోటీసు ఇస్తే ఇద్దరు విదేశాలకు వెళ్లిపోయారని, షెల్‌ కంపెనీలకు మళ్లించిన ప్రజాధనం ఎవరికి చేరిందనేది ఇంకా తేల్చాల్సి ఉందని వివరించారు. ఇది రూ. 371 కోట్ల ప్రజాధనానికి సంబంధించిన వ్యవహారమని.. వాస్తవాలు వెలికితీయాలంటే పోలీసు కస్టడీలో విచారణ అవసరం అని వాదించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు