Monday, April 29, 2024

‘జెన్‌ కో’లో కంత్రీలు

తప్పక చదవండి
  • తెలంగాణ జెన్‌ కో జేపిఏ నియామకాల్లో భారీ అక్రమాలు
  • 80%స్థానికులకు, 20% స్థానికేతరులకు కేటాయింపు
  • 70మంది అభ్యర్థులు స్థానికులు కానప్పటికి ఉద్యోగాలు
  • నకిలీ దృవపత్రాలతో స్థానికత గుర్తింపు
  • బోగస్‌ అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సరిగ్గా చేయని అధికారులు
  • నియామకాల్లో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్న అధికారులు
  • ఫిర్యాదు చేసిన అర్హులైన స్థానిక అభ్యర్థులు

కష్టపడి తల్లి దండ్రులు చదివిస్తారు.. పిల్లలు వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా చదువు పూర్తిచేసి, పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతూ.. తల్లి దండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తారు.. వారి సాధనలో ఎలాంటి లోపం ఉండదు.. కానీ లోపభూయిష్టమైన గత ప్రభుత్వం, అందులో విధులను వెలగబెట్టిన అధికారులు వారి ఆశలపై నీళ్లు జల్లాయి.. నియామకాల్లో భారీ ఎత్తున ముడుపులు తీసుకొని నకిలీ సర్టిఫికెట్స్‌ సృష్టించిన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించి, అర్హులైన అభ్యర్థులకు మోసం చేసిన ఘటనపై ఆదాబ్‌ అందిస్తున్న ప్రత్యేక కథనం.

2013వ సంవత్సరంలో కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (కెటిపిపి)చేల్పూర్‌, వరంగల్‌ జిల్లాలో జేపిఏ (జూనియర్‌ ప్లాంట్‌ అటెండెన్స్‌) నియమకాలకు పరీక్షలు నిర్వహించారు. అందులో స్థానికులకు 80%, స్థానికేతరులకు 20%గా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కెటిపిపి చెల్పూర్‌ వరంగల్‌ జిల్లాలో కలదు. అయితే ముఖ్యంగా స్థానికేతర జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి ఖమ్మం, నల్లొండ జిల్లాలకు చెందిన అభ్యర్థులు స్థానికంగా వరంగల్‌లో ఉన్నట్లు నకిలీ ధృవపత్రాలు సృష్టించి ఉద్యోగాలు పొందినారు. అర్హులైన స్థానికులు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన అభ్యర్థులపై నానా రకాలుగా పోలీసులతో వేధించి ఫిర్యాదును తొక్కిపట్టారు. ఈ విషయంలో విజిలెన్స్‌ మరియు తెలంగాణ జెన్‌ కో అధికారులు లక్షల్లో సంపాదించినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అభ్యర్థుల విద్యార్హత పత్రాలు ఆదాబ్‌ నిఘా టీం సేకరించడం జరిగింది. ఈ పత్రాలను పరిశీలిస్తే కళ్ళు నివ్వెరపోయే, ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఎవరైతే నిజానికి స్థానిక అభ్యర్థలు కారో, వారి యొక్క 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చదివినట్లు ఉన్నాయి. ముఖ్యంగా 7వ తరగతి కామన్‌ పరీక్షల మార్కులు కూడా ఆదాబ్‌ వద్ద ఉన్నాయి. అయినను వీరు వరంగల్‌ జిల్లాలో చదివినట్లు ఉద్యోగం సాధించారు. జూనియర్‌ ప్లాంట్‌ అటెండెన్స్‌ ఉద్యోగ నియామకాల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కొక్క బోగస్‌ అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సరిగ్గా చేయకుండా.. భారీ ఎత్తున ముడుపులు తీసుకొని అధికారులు నియామకం జరిపినట్లు స్పష్టంగా కనిపిస్తుంది .ఆదాబ్‌ కు అందిన సమాచారం ప్రకారం సుమారు 70 మంది అభ్యర్థులు స్థానిక వరంగల్‌ జిల్లా కానప్పటికి నకిలీ దృవపత్రాలతో స్థానిక అభ్యర్థులుగా ఉద్యోగం సంపాదించి, అర్హత కలిగిన నిజమైన స్థానిక అభ్యర్థుల పొట్టకొట్టారు. అందిన సమాచారం ప్రకారం పి. కిషోర్‌ రెడ్డి, కొమ్ము మధు, మేకల వీరభద్రమ్‌, దొడ్డ అనంత రామయ్య, కట్ట శివ రామ కృష్ణ, కడాలి నాగరాజు, సువ్వరపు శ్రీనివాస్‌ రావు, బుద్ది సతీష్‌ కుమార్‌, చింతల మురళీ మోహన్‌, గుజ్జల లక్ష్మన్న, బర్ల చిరంజీవి మొదలగు వారు అక్రమంగా ఉద్యోగం పొందినట్లు అందిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. నిజానికి ఈ నకిలీ స్థానికేతర అభ్యర్థుల వలన నష్టపోయిన వారు హైదరాబాద్‌లోని టీఎస్‌ జెన్‌కో అధికారులకు ఫిర్యాదు చేయడం, న్యాయపరంగా ముందుకు పోతామని తెలిపినా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఇప్పటికైనా టీఎస్‌ జెన్‌కో ముఖ్యకార్యదర్శి ఈవిషయంపై సమగ్ర విచారణ జరిపించి, నష్టపోయిన స్థానిక అభ్యర్థులకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ నియామకాల్లో అధికారుల కు ముట్టిన వాటా ఎంత? బోగస్‌ పత్రాలు సమర్పించిన అభ్యర్థుల వివరాలు పూర్తి ఆధారాలతో తెర ముందు తేనుంది ఆదాబ్‌ హైదరాబాద్‌.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు