Saturday, May 4, 2024

సెమీ ఫైనల్స్ లో భారీ పరుగులతో భారత్..

తప్పక చదవండి
  • కివీస్ ఎదుట భారీ లక్ష్యం

వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీస్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌.. విరాట్‌ కోహ్లీ (113 బంతుల్లో 117, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రికార్డు సెంచరీకి తోడు శ్రేయస్‌ అయ్యర్‌ (70 బంతుల్లో 105, 4 ఫోర్లు, 8 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ ఇద్దరితో పాటు ఇన్నింగ్స్‌ ఆరంభించిన రోహిత్‌ శర్మ (29 బంతుల్లో 47, ఫోర్లు, సిక్సర్లు) ధాటిగా ఆడగా శుభ్‌మన్‌ గిల్‌ (66 బంతుల్లో 79 నాటౌట్‌, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించడంతో కివీస్‌ ఎదుట భారత్‌ భారీ లక్ష్యాన్ని నిలిపింది.
ఇన్నింగ్స్‌ ప్రారంభం నుంచే భారత్‌ దూకుడు మంత్రాన్ని జపించింది. ట్రెంట్‌ బౌల్ట్‌, సౌథీలతో పాటు కివీస్‌ బౌలర్ల లయను దెబ్బతీయడానికి రోహిత్‌ ఆదినుంచే హిట్టింగ్‌కు దిగాడు. బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాదిన హిట్‌మ్యాన్‌.. ఆ తర్వాత సౌథీ వేసిన నాలుగో ఓవర్లో కూడా 4,6 కొట్టాడు. కెప్టెన్‌ దూకుడును చూసి గిల్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించాడు. ఈ ఇద్దరి దూకుడుతో 5.2 ఓవర్లలోనే భారత స్కోరు 50 దాటింది. అయితే ధాటిగా ఆడుతున్న రోహిత్‌ను సౌథీ పెవిలియన్‌ చేర్చాడు. రోహిత్‌-గిల్‌లు తొలి వికెట్‌కు 8.2 ఓవర్లలోనే 71 పరుగులు జోడించారు. రోహిత్‌ ఔటయ్యాక బాదుడు బాధ్యతలను గిల్‌ తీసుకున్నాడు. 41 బంతుల్లో అర్థ సెంచరీ చేసుకున్నాక బ్యాట్‌ ఝుళిపించిన గిల్‌.. కండరాలు పట్టేయడంతో 22వ ఓవర్లో గ్రౌండ్‌ వీడాడు. కోహ్లీతో కలిసి గిల్‌ రెండో వికెట్‌కు 86 బంతుల్లోనే 93 పరుగులు జోడించాడు. గిల్‌ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ కూడా బాదుడు మంత్రాన్ని జపించాడు. కోహ్లీ తనదైన శైలిలో ఇన్నింగ్స్‌ను నిర్మిస్తుంటే అయ్యర్‌ మాత్రం కివీస్‌ స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడాడు. ఇదే క్రమంలో కోహ్లీ 59 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసుకుని గేర్‌ మార్చాడు. ఓవర్‌కు ఫోర్‌ తగ్గకుండా ధాటిగా ఆడాడు. మరోవైపు శాంట్నర్‌ వేసిన 37వ ఓవర్లో రెండో బంతికి సింగిల్‌ తీసిన శ్రేయస్‌.. అర్థ సెంచరీ చేశాడు. ఈ ఇద్దరి దూకుడుతో భారత్‌ స్కోరు 40 ఓవర్లకే 287 పరుగులకు చేరింది. ఫెర్గూసన్‌ వేసిన 42వ ఓవర్లో నాలుగో బంతికి రెండు పరుగులు తీయడంతో కోహ్లీ సెంచరీ పూర్తయింది. వన్డేలలో కోహ్లీకి ఇది 50వ సెంచరీ. తద్వారా సచిన్‌ వన్డేలలో సాధించిన 49 శతకాల రికార్డును బ్రేక్‌ చేశాడు. శతకం ముగిసిన వెంటనే సౌథీ వేసిన 44వ ఓవర్లో భారీ షాట్‌ ఆడబోయి కాన్వేకు క్యాచ్‌ ఇచ్చాడు. అర్థ సెంచరీ తర్వాత అయ్యర్‌ దూకుడు పెంచాడు. రచిన్‌ రవీంద్ర వేసిన 45 వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన అయ్యర్‌.. సౌథీ వేసిన 48వ ఓవర్లో తొలి బంతికి భారీ సిక్సర్‌ బాది 99లోకి వచ్చాడు. తర్వాత బంతికే సింగిల్‌ తీసి సెంచరీ పూర్తిచేశాడు. అయ్యర్‌కు ఇది బ్యాక్‌ టు బ్యాక్‌ సెంచరీ. ఈ మెగా టోర్నీలో రెండోది. 67 బంతుల్లోనే అయ్యర్‌ సెంచరీ పూర్తయింది. బౌల్ట్‌ వేసిన 49వ ఓవర్లో నాలుగోబంతికి బౌండరీ బాదిన అయ్యర్‌.. మరుసటి బంతికే మిచెల్‌ కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆఖర్లో కెఎల్‌ రాహుల్‌ (20 బంతుల్లో 39 నాటౌట్‌, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో భారత్‌ స్కోరు 390 మార్కు దాటింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు