Saturday, May 4, 2024

తెలంగాణలో పలువురు ఐపిఎస్‌కు స్థానచలనం

తప్పక చదవండి
  • హైదరాబాద్‌ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి
  • సైబరాబాద్‌ సిపిగా అవినాశ్‌ మహంతి
  • రాచకొండ సిపిగా సుధీర్‌ బాబు
  • నార్కోటిక్‌ బ్యూరో డైరక్టర్‌గా సందీప్‌ శాండిల్యా
  • డిజిపి కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని స్టీఫెన్‌ రవీంద్ర,చౌహాన్‌లకు ఆదేశం
  • డిజిపి అంజనీకుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తేసిన ఎన్నికల సంఘం

హైదరాబాద్‌ : తెలంగాణలో పలువురు ఐపిఎలస్‌ల బదిలీలు జరిగాయి. పలువురికి కొత్త పోస్టులను ఇవ్వగా పాతవారిని డిజిపి కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్‌ బదిలీలకు మొదటిసారి శ్రీకారం చుట్టారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో కమిషనర్లను బదిలీ చేస్తూ రేవంత్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నూతన సీపీగా కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ సీపీగా సుధీర్‌ బాబు , సైబరాబాద్‌ సీపీగా అవినాష్‌ మహంతి నియమితులయ్యారు. అలాగే హైదరాబాద్‌ పాత సీపీ సందీప్‌ శాండిల్యాను తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో డైరక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, రాచకొండ సీపీ చౌహన్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలావుంటే మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ ఎత్తివేసింది. డిసెంబర్‌ 3న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగియక ముందే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని అప్పటి డీజీపీ అంజనీ కుమార్‌తోపాటు అదనపు డీజీ సంజయ్‌ కుమార్‌, మహేశ్‌ భగవత్‌ కలిశారు. దీంతో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని అంజనీ కుమార్‌ను సస్పెండ్‌ చేయగా, మిగిలిన ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు నోటీసులు జారీచేసింది. అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించలేదని ఈసీకి మాజీ డీజీపీ తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజున రేవంత్‌ రెడ్డి పిలిస్తే వెళ్లానని చెప్పారు. ఇలాంటి ఘటన పునరావృతం కాదని వివరణ ఇచ్చారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సీఈసీ సమాచారం అందించింది. నవంబర్‌ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరిగింది.. డిసెంబర్‌ 3న ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో కొనసాగింది. పూర్తిస్థాయిలో కౌంటింగ్‌ పూర్తికాకముందే డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌ మధ్యాహ్నం సమయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఐపీఎస్‌ అధికారులు మహేశ్‌ భగవత్‌, సంజయ్‌ కుమార్‌తో కలిసి రేవంత్‌ వద్దకు వెళ్లిన ఆయన పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతోపాటు ఓట్ల లెక్కింపు పూర్తవకముందే డీజీపీ హోదాలో రేవంత్‌ రెడ్డిని కలవడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆనపై సస్పెన్షన్‌ వేటువేసిన విషయం తెలిసిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు