Tuesday, May 14, 2024

ఇజ్రాయెల్‌పై విరుచుకు పడిన హమాస్ మిలిటెంట్ గ్రూప్..

తప్పక చదవండి
  • కేవలం 20 నిమిషాల్లో 5 వేల రాకెట్లతో దాడులు..
  • భీకరస్థాయిలో ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
  • భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసిన ఎంబసీ
  • అప్రమత్తంగా ఉండాలని సూచన
  • ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటించిన భారత ప్రధాని మోదీ..
  • భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచన..

న్యూ ఢిల్లీ : హమాస్ ఉగ్రవాదులు అకృత్యాలకు పాల్పడుతున్నారు.. ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులతో విరుచుకుపడుతున్నారు.. ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చొరబడి వికృత చేష్టలు చేస్తున్నారు. కనిపించిన వారందరినీ కాల్చి చంపుతూ వికృతానందం పొందుతున్నారు. కొంతకాలంగా ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అయితే హమాస్ సంస్థ హానివారం ఉదయం నుంచి ఇజ్రాయెల్ పై రాకెట్లతో విరుచుకుపడడంతో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి.. కేవలం 20 నిమిషాల్లో హమాస్ గ్రూపు 5 వేల రాకెట్లు ప్రయోగించినట్టు తెలుస్తోంది. అటు, ఇజ్రాయెల్ లోకి హమాస్ ఉగ్రవాదులు భారీగా చొరబడినట్టు భద్రతా బలగాలు వెల్లడించాయి. పౌరులు ఇళ్లలోనే ఉండాలని, బయటికి రావొద్దని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసింది.

హమాస్ మిలిటెంట్ల దాడితో ఆగ్రహించిన ఇజ్రాయెల్ ప్రతిదాడులకు తెగబడింది.. ఈ సంఘటనలతో జనం ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. హమాస్ మిలిటెంట్ల ఆకస్మిక దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ ‘‘ జాతీయ అత్యవసర పరిస్థితి ’’ని ప్రకటించింది. అందుతున్న నివేదికల ప్రకారం.. దుండగులు కనీసం 22 మంది ఇజ్రాయిలీలను చంపగా.. 500 మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రవాదులు కొంతమంది పౌరులను బంధించారు.. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇజ్రాయెల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. గాజా స్ట్రిప్‌లోని లక్ష్యాలను ఇజ్రాయెల్ ఛేదిస్తోంది. రాకెట్ నిరోధక రక్షణ వ్యవస్థను మోహరించడంతో పేలుళ్ల శబ్ధాలు వినిపిస్తున్నట్టు తెలుస్తోంది.. ఇజ్రాయెల్ ఇటీవలి కాలంలో ఎదుర్కొన్న ఘోరమైన దాడిగా దీనిని అధికారులు అభివర్ణించారు.

- Advertisement -

ఇప్పటికే యుద్దానికి సిద్దమని ప్రకటించిన ఇజ్రాయెల్ సైన్యం.. హమాస్ మిలిటెంట్లపై ‘‘ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్’’ను ప్రకటించింది. గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దళం డజన్ల కొద్దీ ఫైటర్ జెట్‌లతో దాడి చేసింది. మరోవైపు హమాస్‌ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ భారీ హెచ్చరికను జారీ చేసింది. టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రధాన కార్యాలయంలో భద్రతా మంత్రివర్గ సమావేశం తర్వాత.. ఆ దేశ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మాట్లాడుతూ.. దాడిని ప్రారంభించడం ద్వారా హమాస్ తీవ్ర తప్పు చేసిందని అన్నారు. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ యుద్ధాన్ని ప్రారంభించిందని.. ఇజ్రాయెల్ గెలుస్తుందని ధీమాగా చెప్పారు. ప్రస్తుత పరిణామాలపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు.. తాము యుద్దంలో ఉన్నామని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్ పౌరులారా.. మనం యుద్ధంలో ఉన్నాము. శత్రువు భారీ మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది. మనం ఈ యుద్ధంలో గెలుస్తాము’’ అని ప్రధాని నెతన్యాహు చెప్పారు. శత్రువు ఇంతకు ముందెన్నడూ తెలియని ప్రతిస్పందనను ఎదుర్కొంటారని అన్నారు. శనివారం రోజు ఉదయం గాజా స్ట్రిప్ ప్రాంతం నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సైన్యం.. దేశం దక్షిణ, మధ్య ప్రాంతాలలో ఒక గంటకు పైగా సైరన్లతో జనాలకు హెచ్చరికలు జారీచేసింది. బాంబు షెల్టర్ల దగ్గర ఉండమని ప్రజలను కోరింది. మిలిటెంట్ల చొరబాటుకు సంబంధించి ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. గాజా వైపు నుంచి ఉగ్రవాదులు చొరబడ్డారని సైన్యం తెలిపింది. ఈ ప్రాంత ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నామని సైన్యం పేర్కొంది. అయితే ఈ రాకెట్ల దాడుల వల్ల ఏ మేరకు నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఈ రాకెట్ల దాడుల్లో ఒక మహిళ మృతిచెందిందని వార్తలు అందుతున్నాయి.. ఇదిలాఉంటే, అయితే.. గాజా స్ట్రిప్‌లో 2007 నుంచి హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధికారం చేపట్టింది. దీంతో గాజాపై ఇజ్రాయెల్ దిగ్బంధనాన్ని విధించింది. అప్పటి నుండి పాలస్తీనా మిలిటెంట్లు, ఇజ్రాయెల్ అనేక విధ్వంసకర యుద్ధాలు చేశారు.

అయితే హమాస్ తీవ్రవాద సంస్థకు చెందిన మిలిటెంట్లు పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ లో చొరబడి విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడుతున్నట్టు వచ్చిన వార్తలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇజ్రాయెల్ లో ఉగ్రదాడుల వార్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని తెలిపారు. ఉగ్రదాడుల్లో బలైన అమాయకుల కుటుంబాలకు, బాధితులకు సానుభూతి తెలుపుతున్నాం అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో స్పందించారు.

ఇక ఇజ్రాయిల్‌పై హమాస్‌ దాడి నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ఇజ్రాయిల్‌లోని భారత పౌరుల భద్రత కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు సూచనలు జారీ చేసింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటించాలని తెలిపింది. ఇజ్రాయిల్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ఒక నోటీస్‌ జారీ చేసింది. ’ఇజ్రాయిల్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ దేశంలోని భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటించాలి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. అనవసర కదలికలు నివారించండి. సెఫ్టీ షెల్టర్స్‌ వద్దకు వెళ్లండి. అదనపు సమాచారం కోసం ఇజ్రాయిల్‌ హోమ్‌ ఫ్రంట్‌ కమాండ్‌ వెబ్‌సైట్‌ లేదా వారి బ్రోచర్‌ను చూడండి’ అని పేర్కొంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఇండియన్‌ ఎంబసీ హెల్ప్‌లైన్‌ నంబని, ఇమెయిల్‌ ద్వారా సంప్రదించాలని ఇజ్రాయిల్‌లోని భారతీయ పౌరులను కోరింది. ఎలాంటి సహాయమైనా అందించేందుకు ఎంబసీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు